హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని అంజయ్యనగర్–కొండాపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం ఆగస్ట్ 22న కుప్పకూలడం, ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. నగరంలో ఒక అక్రమ కట్టడం కూలిపోవడం ఇదే మొదటిసారి కాదు, బహుశా ఆఖరిది కాకపోవొచ్చు. అయితే, ప్రతి ప్రమాదం తర్వాత వినిపించే అధికారిక ప్రకటనలు, కారణాలు మునుపటి కంటే భిన్నంగా ఏమీ లేవు. ఈ భవనానికి కనీస అనుమతులు లేవని మున్సిపల్ అధికారులు తేల్చిచెప్పడం వ్యవస్థలో పేరుకుపోయిన అలసత్వాన్ని మరోసారి బట్టబయలు చేసింది.
ఈ దారుణానికి పూర్తి బాధ్యత కేవలం లాభాపేక్షతో నిబంధనలను తుంగలో తొక్కిన బిల్డర్దేనా? లేక నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యతను విస్మరించిన మున్సిపల్ అధికారులదా? మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం ఎలాంటి అనుమతులు లేని ఒక భారీ నిర్మాణం మొదటి అంతస్తు దాటకముందే ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఏడు అంతస్తుల మేర కాంక్రీటు దిమ్మెలు లేస్తుంటే నిఘా విభాగాలు, క్షేత్రస్థాయి పరిశీలన అధికారులు మౌనంగా ఉండటం వెనుక ఉన్న ప్రలోభాలు, అవినీతి బంధాన్ని ఏమని పిలవాలి? నిజానికి అనుమతి లేని నిర్మాణం మొదటి అంతస్తు దాటకముందే ఆపలేకపోవడానికి, రెండు ప్రాణాలు పోయే వరకు వ్యవస్థ కదలకుండా ఉండటానికి వెనుక స్పష్టమైన వ్యవస్థీకృత లోపాలు, అధికార్ల అవినీతి, పర్యవేక్షణా వైఫల్యాలు ప్రధాన కారణం.
పునాది పడినప్పుడే స్థానిక లైన్ ఇన్స్పెక్టర్లు, బిల్డింగ్ ఓవర్సీర్లకు సమాచారం ఉంటుంది.నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వకుండా, భారీ వసూళ్లకు పాల్పడి నిర్మాణాన్ని “చూసీచూడనట్లు” వొదిలేస్తున్న లంచగొండితనమే బిల్డర్లకు ధైర్యాన్నిస్తుంది. ఒక వార్డు లేదా సర్కిల్ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంటుంది. తనిఖీ చేయని అధికారులపై ఎలాంటి కఠిన చర్యలు (సస్పెన్షన్ లేదా క్రిమినల్ కేసులు) ఉండకపోవడం వల్ల నిర్లక్ష్యం పెరుగుతుంది. మరో అంశం అక్రమ కట్టడాల వెనుక తరచూ స్థానిక రాజకీయ నాయకుల లేదా బలమైన ప్రైవేట్ వ్యక్తుల హస్తం ఉంటుంది . మున్సిపల్ అధికారులు తనిఖీలకు వెళ్లినా, పైస్థాయి నుండి వొచ్చే ఒత్తిళ్లు లేదా బెదిరింపుల వల్ల వెనక్కి తగ్గుతారు. నోటీసులు ఇచ్చినప్పటికీ, వాటిని తక్షణమే కూల్చివేయడానికి అవసరమైన సిబ్బంది, యంత్రాలు , పోలీస్ బందోబస్తు మున్సిపల్ కార్పొరేషన్ల వద్ద సకాలంలో అందుబాటులో ఉండవు.
ఈ లోపాన్ని ఆసరాగా చేసుకుని బిల్డర్లు రాత్రికి రాత్రే అంతస్తులు లేపేస్తారు. అధికారులు నోటీసు ఇవ్వగానే, బిల్డర్లు తక్షణమే కోర్టులను ఆశ్రయించి సాంకేతిక కారణాలు చూపిస్తూ ‘స్టే’ తెచ్చుకుంటారు.కోర్టు పరిధిలో కేసు నడుస్తున్నంత కాలం అధికారులు ఆ నిర్మాణాన్ని ఆపలేరు. దీనిని బిల్డర్లు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అక్రమ కట్టడాలను ప్రారంభ దశలోనే గుర్తించడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగాలు ఉన్నప్పటికీ, అవి కేవలం ఫిర్యాదులు వొచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తాయి. సొంతంగా సర్వే చేసి అక్రమాలను అడ్డుకునే నిఘా వ్యవస్థ మన మున్సిపాలిటీల్లో లోపించింది. ఈ అంశాలకు సమాధానాలు వెతకాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేవలం బిల్డర్పై కేసులు పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదు. క్షేత్రస్థాయిలో అక్రమాలను చూసీచూడనట్లు వొదిలేసిన అధికారులను కూడా చట్టపరంగా బాధ్యులను చేయాలి.
ఇది కేవలం ఒక భవన నిర్మాణ లోపమో, ప్రమాదమో కాదు. భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ కల్పించిన పౌరుల “జీవించే హక్కు”కు, “సురక్షితమైన నివాస హక్కు”కు జరిగిన తీవ్రమైన నష్టం. సురక్షితమైన వాతావరణాన్ని, ప్రాథమిక రక్షణను కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం.మరోవైపు, ఈ ప్రమాదంలో బలైన వలస కార్మికుల వృత్తిపరమైన భద్రత అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి. వేల కిలోమీటర్ల దూరం నుండి పొట్టచేతపట్టుకుని నగర నిర్మాణంలో భాగస్వాములవుతున్న శ్రామికులకు ఎలాంటి రక్షణ పరికరాలు లేవు. పని ప్రదేశంలో ప్రమాదాలు జరిగినప్పుడు వారి కుటుంబాలకు అండగా నిలిచే సామాజిక భద్రతా పథకాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కనీస ప్రమాణాలు పాటించని నిర్మాణ స్థలాలు కార్మికులకు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. కార్మిక చట్టాల అమలు, భద్రతా తనిఖీలు కేవలం కాగితాలకే పరిమితం కావడం వల్లే ఇలాంటి అనర్థాలు పునరావృతమవుతున్నాయి.
ఇప్పటికైనా ప్రభుత్వం కంటితుడుపు చర్యలను పక్కనపెట్టి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. నగరవ్యాప్తంగా అనుమతులు లేని నిర్మాణాలపై తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించాలి. అక్రమ నిర్మాణాలను మొదటి దశలోనే గుర్తించి కూల్చివేసేందుకు వీలుగా పటిష్టమైన డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థను తీసుకురావాలి. అక్రమ కట్టడాలకు సహకరించే అధికారులపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అలాగే నిర్మాణ కార్మికులందరికీ తప్పనిసరి బీమా, భద్రతా ప్రమాణాలు పాటించేలా బిల్డర్లపై కఠిన నిబంధనలు అమలు చేయాలి. అప్పుడే మరణించిన కార్మికుల ఆత్మలకు శాంతి, నగర పౌరుల జీవించే హక్కుకు నిజమైన రక్షణ లభిస్తుంది. ప్రాణాలు పోయిన తర్వాత మొసలి కన్నీరు కార్చడం, కూల్చివేతల నాటకాలు ఆడటం కంటే… “మొదటి ఇటుక పడినప్పుడే అడ్డుకునే” కఠినమైన చట్టం, అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకున్నప్పుడే ఈ వ్యవస్థ మారుతుంది.





