అనుభవాలతో తడిసిన వాక్యాలు

చెమ్మ : వారాల ఆనంద్

‘ఒక చిరునవ్వు ముందు, ఒక దయామయమైన చూపుముందు, ఒక అద్భుతమైన, ఆత్మీయ కరచాలనం ముందు ఏ పురస్కారాలు ప్రశంసలు సరిపోవు’ అని రావూరి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తెలుగు సాహిత్యంలో సాటి మనుషుల జీవితాల్ని ఎంతో దగ్గరగా చూసి అనుభవించి రాసిన రచయితల్లో రావూరి భరద్వాజ ముఖ్యులు. ఆయన కథలు చదివితే అందులో కేవలం కాల్పనికత కనిపించదు. మన చుట్టూ తిరిగే సాధారణ మనుషుల జీవితం కనిపిస్తుంది. పేదరికం, ఆకలి, కష్టం, ఆశ, నిరాశ  ఇవన్నీ ఆయన అక్షరాల్లో సహజంగా ప్రవహిస్తాయి. నిజానికి భరద్వాజ జీవితమే ఒక నవల అనొచ్చు. పేదరికం ఆయనకు పాఠశాల అయింది. చిన్నప్పుడే ఆకలి గురువయింది. జీవన పోరాటమే విశ్వవిద్యాలయంగా అనేక విషయాల్ని నేర్పింది. వాస్తవంగా రావూరి భరద్వాజ సాహిత్య వాతావరణంలో పెరిగి వచ్చిన రచయిత కాదు. పుస్తకాల కన్నా చాలా ముందు ఆయన జీవితాన్ని చదివిన మనిషి. చెమట వాసన, శ్రమ తెలిసిన రచయిత. అందుకే ఆయన రచనల్లో కృత్రిమత్వం కనిపించదు. అవి సాటి మనుషుల అనుభవాలతో తడిసిన వాక్యాలు.

‘ఆకలి నా రచనలకు ప్రేరణ’ అని ప్రకటించుకున్న రావూరి భరద్వాజ 1925 లో కృష్ణాజిల్లా పరిటాల జగీర్ మోగులూరు గ్రామంలో జన్మించారు. తల్లి మల్లికాంబ, తండ్రి కోటయ్యలపై ఆయన తొలిపద్యం చెప్పారు. ఆయన కేవలం ఏడోతరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 17వ ఏటి నుంచే రచనలు చేయడం ప్రారంభించారు. రావూరి రోజూ ఏ పండో, నీళ్లో తాగి ఆకలి తీర్చుకుంటూ, దొరికిన పుస్తకమల్లా చదువుతూ సాహిత్య దాహం తీర్చుకునేవారు. గ్రంథాలయ సంవత్సర చందా మూడు రూపాయలు కూడా కట్టలేకపోయిన ఆయన దొరికిన పనిచేస్తూ, రాత్రంతా దేవాలయంలోని దీపం వెలుతురులో లైబ్రరీ పుస్తకాలను చదివేవారు. దాదాపు దొరికిన సాహిత్యాన్నంతా అధ్యయనం చేస్తూ ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపారు 1950లో ‘రాగిణి’ వెలువరించారు. ‘కొత్తచిగుళ్లు’లోని విభిన్నశైలి తెలుగు పాఠకుల దృష్టిని ఆకర్షించింది. రావూరి భరద్వాజకి 1968, 1983లలో రెండుసార్లు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్రీయ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయనకు ఆంధ్రా, నాగార్జున, జెఎన్‌టియు తదితర విశ్వవిద్యాలయాలు  డాక్టరేట్‌ను ప్రదానం చేశాయి. గోపీచంద్ అవార్డు, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, భారతీయ భాషాపరిషత్ అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారంతో పాటు అనేక  అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు.

ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం అందించిన ‘పాకుడురాళ్ళు’ తెలుగు నవలా చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఇది కేవలం సినీరంగం నేపథ్యంగా రాసిన నవల మాత్రమే కాదు. కలల ప్రపంచంగా కనిపించే సినిమా వెనుక దాగి ఉన్న చేదునిజాల్ని బయటపెట్టిన సామాజిక చిత్రం. రావూరి భరద్వాజ ఈ నవలలో సినీరంగాన్ని గ్లామర్‌ కళ్లద్దాలతో చూడలేదు. అక్కడి మనుషుల ఒంటరితనం, అవకాశాల కోసం జరిగే పోరాటం, కూలిపోయే ఆశలు  ఇవన్నీ ఎంతో సహజంగా చిత్రించారు. అందుకే పాకుడురాళ్లు చదివినప్పుడు అది కల్పితకథలా కాకుండా, నిజజీవితాన్ని చదివిన అనుభూతి కలుగుతుంది. సినిమా ప్రపంచం కేవలం ప్రకాశించే వెలుగుకాదు, లోపలనుంచి క్రమంగా కాల్చే అగ్ని. పేరుకి, డబ్బుకి, అవకాశాలకి పరుగెత్తే మనుషులు చివరికి తమనితాము కోల్పోతున్న దృశ్యాన్ని భరద్వాజ చాలా లోతుగా చూపించారు. ముఖ్యంగా మహిళాపాత్రల ద్వారా సినీరంగంలోని అసమానతలు, దోపిడీ, రక్షణలేని పరిస్థితులను ఎంతో మానవీయంగా ఆవిష్కరించారు. భరద్వాజ శైలి ఈ నవలకు ప్రధానబలం. ఎక్కడా అతిశయోక్తి లేకుండా, సాదాసీదా భాషలోనే తీవ్రమైన జీవితసత్యాలను చెబుతారు. పాత్రల సంభాషణల్లో జీవితం వినిపిస్తుంది. వారిబాధల్లో సమాజపు క్రూరత్వం కనిపిస్తుంది. పాకుడురాళ్లు నవలలో ముఖ్యమైన విషయం మనిషి కలలు ఎలా వ్యాపారంగా మారిపోతాయో చూపిస్తాడు. సినిమా అనే మాయాజాలం వెనుక ఎన్నో జీవితాలు ‘పాకుడురాళ్లు’లా నలిగిపోతాయని ప్రతీకగా చూపిస్తాడు భరద్వాజ. తెలుగు సాహిత్యంలో సినీరంగాన్ని ఇంత నిజాయితీగా, ఇంత లోతుగా ఆవిష్కరించిన రచనలు చాలా అరుదు. అందుకే పాకుడురాళ్లు కేవలం నవల కాదు, వెలుగుల వెనుక దాగి ఉన్న చీకటిచరిత్ర.

రావూరి భరద్వాజకు 1948 లో కాంతంగారితో ఆయన వివాహం జరిగింది. “సంపన్నురాలైనా నా లేమిని, విద్యాహీనతను, నిరుద్యోగాన్ని చాలా దయగా భరించింది. అమాయకుడైన బిడ్డను తెలివైనతల్లి ఎలా చూస్తుందో ఆ బంగారుతల్లి నన్నలా చూసుకుంది. అందుకే ‘కాంతమ్మ’ అనేవాణ్ని” అని రావూరి భావోగ్వేగంతో చెప్పేవారు. చెప్పడమే కాదు కాంతంగారి స్మృతిలో రావూరి రాసిన జ్ఞాపకాలు గొప్ప ఆర్తితో ప్రేమతో నిండి వుంటాయి. అందులో ముప్పై ఏండ్ల క్రితం నేను చదివిన ‘నాలోనినీవు’ లోని ఒక్కోవాక్యం ఒక్కో కన్నీటిబొట్టును కురిపించింది. ఒక మనిషి మరొక మనిషిని ఇంతగా ప్రేమించడం ఆరాధించడం సాధ్యమా అనిపించి ఎంతో అబ్బురపరిచింది. లాలనతో చూసే సహచరిని తల్లిగా ప్రియురాలిగా చూస్తూ నాలోనినీవు అంటూ ఆమె లేకపోవడాన్ని ఎంత కన్నీరై ప్రవహించారో చదివితే కాని అనుభవంలోకి రాదు. భరద్వాజ మొత్తం 37 కథాసంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథాసంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించాడు. జమీన్ రైతు, దీనబంధు తదితర పత్రికలలో పనిచేసి ఆ తరువాత ఆకాశవాణిలో చేరి అక్కడే పదవీ విరమణ చేశారు. డాక్టర్‌ రావూరి భరద్వాజ 2013 అక్టోబరు 18 మరణించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *