“బ్రిక్స్ సదస్సు ద్వారా ఎన్నో ప్రశ్నలతో పాటు అనేక ఆశలు ప్రపంచ దేశాల ప్రజల్లో అంకురించాయి. బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్య మిచ్చిన భారత్ అమెరికా విధిస్తున్న టారిఫ్ లకు ప్రత్యామ్నాయంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటుందా? డాలర్ ప్రపంచాన్ని శాసిస్తున్న పరిస్థితుల్లో డీ డాలరైజేషన్ వైపు బ్రిక్స్ దేశాలు తమ దృష్టి సారిస్తాయా? డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టాలని తహతహ లాడుతున్న చైనా,రష్యా,ఇరాన్ తదితర దేశాలతో భారత్ గళం ఆచరణలో అమెరికా శతృదేశాలతో గళం కలుపుతుందా? అమెరికా తో వైరమెందుకని మిన్నకుండి పోతుందా? అనే మీమాంస కలగడం సహజం..”
పశ్చిమాసియా లో శాంతి స్థాపనకు కృషిచేయాలని బ్రిక్స్ దేశాలు న్యూదిల్లీ సదస్సులో అంగీకరించాయి.చర్చల ద్వారా ఘర్షణలకు స్వస్తి చెప్పాలని కోరాయి. ఏక పక్ష యుద్ధాలకు స్వస్తి చెప్పాలని, ఉగ్రవాదాన్ని పెకలించాలన్న న్యూ దిల్లీ డిక్లరేషన్ ఏక గ్రీవంగా ఆమోదం పొందడం గమనార్హం. డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీ కోసం ప్రయత్నాలు సాగించడం ట్రంప్ కు నచ్చక పోయినా, ఈ దిశగా అడుగులు పడడం ఆహ్వానించదగ్గ పరిణామం. మోదీ ఇచ్చిన విందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గైర్హాజరవడం ప్రశ్నార్ధకమైనది. వర్తమాన ప్రపంచ పరిణామాల నేపథ్యంలో న్యూదిల్లీ లో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సుదీర్ఘంగా కొనసాగుతున్న రష్యా- ఉక్రెయన్ యుద్ధానికి ఈ సదస్సు పరిష్కారం చూపిస్తుందని భావించినా, అందుకు తగ్గ చొరవ ప్రదర్శించలేదనే చెప్పాలి. హస్తినలో కొలువు దీరి సుదీర్ఘంగా చర్చలు సాగించిన బ్రిక్స్ అగ్రనేతలు- భారత్ ను అగ్రభాగాన నిలబెట్టారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇరాన్- అమెరికా ల మధ్య బ్రిక్స్ దేశాలు సంధి కుదిర్చి, హార్ముజ్ ను స్వేచ్ఛాయుత ఇంధన రవాణాకు అనుకూలంగా మార్చాలని పలు దేశాలు ఆశిస్తున్నాయి. బ్రిక్స్ సదస్సు ద్వారా ఎన్నో ప్రశ్నలతో పాటు అనేక ఆశలు ప్రపంచ దేశాల ప్రజల్లో అంకురించాయి. బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్య మిచ్చిన భారత్ అమెరికా విధిస్తున్న టారిఫ్ లకు ప్రత్యామ్నాయంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటుందా? డాలర్ ప్రపంచాన్ని శాసిస్తున్న పరిస్థితుల్లో డీ డాలరైజేషన్ వైపు బ్రిక్స్ దేశాలు తమ దృష్టి సారిస్తాయా? డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టాలని తహతహ లాడుతున్న చైనా,రష్యా,ఇరాన్ తదితర దేశాలతో భారత్ గళం ఆచరణలో అమెరికా శతృదేశాలతో గళం కలుపుతుందా? అమెరికా తో వైరమెందుకని మిన్నకుండి పోతుందా? అనే మీమాంస కలగడం సహజం.
హార్ముజ్ జల సంధి వద్ద ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల వలన ప్రపంచ దేశాలన్నీ ఆర్ధికంగా దివాలా తీస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగి, పెరిగిన ఇంధన,నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలకు పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయి. అయినప్పటికీ ఈ క్లిష్ట సమస్య నుండి ప్రపంచాన్ని గట్టెక్కించడానికి అమెరికా,ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలకు అహం అడ్డుపడుతున్నది. కిర్గిస్తాన్ లోని బిష్కెక్ లో ఇటీవల జరిగిన ఎస్ సి ఓ సదస్సు సందర్భంగా భారత ప్రధాన మంత్రి మోదీ రష్యా- ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం ముగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు విజ్ఞప్తి చేయడం, ఇరాన్ యుద్ధ విరమణకు స్వస్తి పలకాలని, మిడిల్ ఈస్ట్ లో శాంతి కోసం భారత్ సహకరిస్తుందని చెప్పడం గమనార్హం.ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ యుద్ధం విరమణకు అంగీకరిస్తారా? బ్రిక్స్ సమావేశం లో ఆమోదించిన దిల్లీ డిక్లరేషన్ సానుకూల ఫలితాలకు మార్గం సుగమం చేయాలని పలు దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
గల్వాన్ లో జరిగిన సంఘర్షణలు భారత్ – అమెరికా ల మధ్య తీవ్రమైన విభేదాలకు కారణమయ్యాయి. 1962 లో భారత్- చైనా యుద్ధం తర్వాత ఇరుదేశాల మధ్య నమ్మకమైన ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పటికీ నెలకొనలేదు. పైగా అరుణాచల ప్రదేశ్ విషయంలోను, భారత ఈశాన్య ప్రాంతాల పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరి ఇరు దేశాల సంబంధాలకు పెను విఘాతంలా మారింది.పాక్ కు చైనా అనుకూలంగా ప్రవర్తించడం, ఎకనామిక్ కారిడార్ నిర్మించడం, బంగ్లా దేశ్ ను భారత్ కు వ్యతిరేకంగా మార్చడం,చికెన్ నెక్ విషయంలో భారత్ వ్యతిరేక వైఖరి ప్రదర్శించడం, ఈశాన్య రాష్ట్రాలను భారత్ తో కలిపే సిలిగురి కారిడార్ కు దగ్గరలో ఉన్న టిబెట్ లోని చుంబీ వ్యాలీ లో చైనా పాల్పడుతున్న భారత్ వ్యతిరేక చర్యలు అసమంజసం. టిబెట్ లో చైనా చేపట్టిన భారీ జల విద్యుత్ ప్రాజెక్టు భారత్ ను ఇబ్బంది పెట్టడానికేనన్న విషయం సుస్పష్టం.
సుదీర్ఘ విరామం తర్వాత చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారీ డెలిగేట్స్ తో ఇండియా కు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ, చైనా వాణిజ్యానికి భారత్ పెద్ద మార్కెట్ గా ఉన్నప్పటికీ, భారత్ పట్ల చైనా ప్రదర్శిస్తున్న వైఖరి ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించలేవన్నది జగమెరిగిన సత్యం. ఈ కారణం గానే అమెరికా తన డాలర్ వాణిజ్యానికి భారత్ ను పావుగా వాడుకుంటున్నది. పాక్ వంటి దేశాలతో సహవాసం చేయడమే కాకుండా, రష్యా నుండి చమురు దిగుమతి చేసుకోవద్దని భారత్ ను అమెరికా హెచ్చరిస్తున్నది. ఇటీవల ఏర్పడిన ఇస్లామిక్ నాటో కేవలం పాక్ పన్నాగమే. భారత్ చుట్టూ శతృ దేశాలు పొంచి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన బ్రిక్స్ దేశాల అగ్ర స్థాయి సదస్సు భారత్ వాణిజ్య,రక్షణ,సాంకేతిక రంగాలను బలోపేతం చేయడానికి ఉపకరించాలి. బ్రెజిల్,రష్యా, ఇండియా,చైనాలతో ఏర్పడిన “బ్రిక్” దక్షిణాఫ్రికా చేరికతో ” బ్రిక్స్” గా మారింది. ఆ తర్వాత యు.ఎ.ఇ,ఇండోనేషియా,ఇథియోపియా, ఇరాన్,ఈజిప్టు దేశాల చేరికతో బ్రిక్స్ కూటమి “బ్రిక్స్ ప్లస్” గా రూపాంతరం చెందింది.
సభ్య దేశాల మధ్య విభిన్న రంగాల్లో పరస్పర సహకారానికి,అభివృద్ధికి ఏర్పడిన బ్రిక్స్ కూటమి ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా డాలర్ కు కళ్ళెం వేయడమే. డాలర్ కు ప్రత్యామ్నాయంగా నూతన కరెన్సీ ని రూపొందించాలన్న లక్ష్యం సమీప భవిష్యత్తులో సాధ్యపడవచ్చు. ట్రంప్ సాగిస్తున్న ట్రేడ్ వార్ పట్ల ఆగ్రహంతో ఉన్న పలు దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరడానికి సంసిద్ధంగా ఉన్నాయి. బ్రిక్స్ పట్ల ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. అమెరికా ప్రతీకార సుంకాలతో ఆగ్రహంగా ఉన్న వర్తమాన ప్రపంచ వాణిజ్య పరిణామాల రీత్యా బ్రిక్స్ కూటమి బలోపేతం కావడం ఆవశ్యకమనే ధోరణి నెలకొంది. ఈ పరిణామాలు ట్రంప్ కు మింగుడు పడక పోవచ్చు. భారత్ తో కయ్యానికి కాలుదువ్వి,వాణిజ్య సుంకాలను పెంచిన ట్రంప్ వీసాల విషయంలో కూడా కఠిన నిబంధనలు విధిస్తున్నారు. రష్యా,చైనాలతో సాన్నిహిత్యం వలన, ఇతర దేశాలతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాల వలన భారత్ తొందరగానే అమెరికా విధిస్తున్న వాణిజ్య ప్రతిబంధకాల నుండి బయట పడవచ్చునని ఆర్ధిక నిపుణుల విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్నాయి.27 దేశాలకు సభ్యత్వమున్న యూరోపియన్ యూనియన్ కూడా భారత్ తో సఖ్యంగానే మెలగుతూ వాణిజ్య సంబంధాలు మెరుగు పరచుకుంటున్నది. భారత్ ను బెదిరించాలనుకుని కంకణం కట్టుకున్న ట్రంప్ ను బ్రిక్స్ దేశాల సదస్సు భయపెట్టిందా? భారత్ పట్ల ట్రంప్ వైఖరి మారుతుందా? ట్రంప్ ట్రేడ్ వార్ కొనసాగుతుందా? అనే విషయంపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుంది.