–  ఓటుకు నోటు కేసు వ‌ల్ల‌నే కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌డంలేదు
– మెట్రోరైల్ పూర్తిచేసిన ఘ‌న‌త కేసీఆర్‌దే
– కేసీఆర్ చొర‌వ‌తో 72% ప‌నులు పూర్తి
– కేంద్రంలో బీజేపీని అన‌లేక బీఆర్ ఎస్‌పై విమ‌ర్శ‌లు
– బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 15 : తనపై వేలాడుతున్న ఓటుకు నోటు కేసు వల్లనే కేంద్రాన్ని ప్రశ్నించలేని అసమర్ధతలో రేవంత్ రెడ్డి వున్నాడ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధానిని ప్రశ్నించలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంపై నిందలు వేసే నీచ ప్రయత్నం చేస్తున్నాడ‌న్నారు. మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి కేసిఆర్ దేన‌న్నారు. 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిన నాటి కాంగ్రెస్ 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారన్నారు. కేవలం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉనికిలో లేని ఊహా నగరానికి మెట్రో రెండో దశను రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. కానీ గత ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీ, నగర విస్తరణ, ప్రజల రోజువారి అవసరాల కోసం మెట్రో రెండో దశను ప్రతిపాదించింద‌ని గుర్తుచేశారు. 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ తన ‘బడేభాయ్’ని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేకపోవడం రేవంత్ రెడ్డి చేతకానితనానికి, దద్దమ్మ పాలనకు నిలువెత్తు నిదర్శనమ‌న్నారు.  రేవంత్ రెడ్డి తన అసమర్థతను దాచుకోవడానికి అనేక అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్‌కు ఎందుకు తీసుకురాలేకపోయారో ముందుగా ప్రజలకు జవాబు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం మెట్రో రెండవ దశకి అనుమతి దక్కకపోవడం అన్నారు. మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్రంపై ముఖ్యంగా ప్రధానమంత్రిని విమర్శించే సత్తా ధైర్యం రేవంత్ రెడ్డికి లేదన్నారు. బిజెపిని కాక ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ ని విమర్శించి ప్రజలను తప్పుదోవ పట్టించే నీచమైన ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. గతంలో కేసీఆర్ పాలనలో అనుమతులు, రుణాలు శరవేగంగా ఎలా వచ్చాయో, మీ దిక్కుమాలిన పాలనలో అవి ఎందుకు ఆగిపోయాయో ప్రజలకు అర్థమవుతోందన్నారు. బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై పడి ఏడవడం తప్ప మీకు ఏ పని చేతకాదని నాలుగు కోట్ల తెలంగాణ సమాజానికి అర్థమైందన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా బీఆర్ఎస్ అడ్డుకుందని చెప్పడం అంటే మోదీ కన్నా కేసీఆర్ పవర్ ఫుల్ అని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా అని ఎద్దేవా చేశారు. కేంద్రం సహకరించకపోయినా రుణాలు సాధించి మెట్రోను పరుగులు పెట్టించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని స్పష్టం చేశారు. మూడేళ్లలో మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేసి నిత్యం ఐదు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నామంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ సమర్థత అని, అటువంటి మెట్రోపై చెత్తవాగుడు వాగడం సరికాదని హెచ్చరించారు. మెట్రో విస్తరణ పట్ల అద్భుతమైన విజయంతో అనేక ప్రణాళికలను గత ప్రభుత్వం రూపొందించిందన్నారు. రేవంత్ రెడ్డి మాదిరి స్వార్థ ప్రయోజనాల కోసం అసలు ఉనికిలో లేని ఊహాజనిత నగరానికి మెట్రో తీసుకువెళ్లాలన్న మాదిరి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించలేదన్నారు. కేవలం ప్రజల ప్రయోజనాలు, సౌకర్యం కోసమే దృష్టిలో ఉంచుకొని మెట్రో ఫేజ్-2ను ఆరు కారిడార్లు, 72 స్టేషన్లతో 76.4 కిలోమీటర్ల మేర డిజైన్ చేసింది కేసీఆరేన‌ని, నలుదిశలా ఆరు రద్దీ రూట్లలో ప్రణాళికలు రచిస్తే, వాటిని పనికిరాని రూట్లు అంటూ ప్రజల్ని అవమానిస్తారా అని సీఎంను కేటీఆర్ నిలదీశారు. రెండున్నరేళ్లలో ఫేజ్-2ను అటకెక్కించడం మీ వైఫల్యమని, అధికారంలోకి రాగానే శంషాబాద్ మెట్రోను రద్దు చేసిన ద్రోహం మీదేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెదిరింపులు – ఆస్తుల కొల్లగొట్టే కుట్ర వల్లనే ఎల్ అండ్ టి పారిపోతున్నద‌న్నారు. మెట్రో ఫేజ్-2కు ఎల్ అండ్ టీ అంగీకరించలేదని ఎందుకు బుకాయిస్తున్నారని కేటీఆర్ ప్ర‌శ్నించారు.  ఏకంగా ఎల్ అండ్ టీ సీఎఫ్ఓనే బెదిరించి, పారిశ్రామికవేత్తల తలకు తుపాకీ పెట్టినట్లుగా భయభ్రాంతులకు గురిచేసి పారిపోయేలా చేసింది మీరే కదా అని ఆరోపించారు. 30 వేల కోట్ల మెట్రో ఆస్తులను, నడిబొడ్డున ఉన్న మెట్రో భూములను కొల్లగొట్టేందుకే సంస్థను వెళ్లగొట్టే కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు.

———————————————————————————————————————————————————————————-