–జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: జిల్లా కలెక్టర్లు మరింత అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి ప్రభుత్వ ప్రతిష్టను మరింత పెంపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పిలుపునిచ్చారు. విద్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, భూసేకరణ తదితర శాఖలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలెక్టర్లు జిల్లాల్లోని విద్యాసంస్థలు, ఆసుపత్రులు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో కలెక్టర్లు అద్భుతంగా పనిచేస్తున్నారని అభినందించారు. ఇటీవల తుఫాను ప్రభావంతో చోటుచేసుకున్న ప్రమాద సమయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ సకాలంలో స్పందించి ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రక్షించిన తీరును ప్రత్యేకంగా అభినందించారు.
తాగునీటి సమస్య తలెత్తకూడదు
ఎల్నినో నేపథ్యంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 565 మండలాల్లో ఆవాసాల వారీగా నీటి ఎద్దడి పరిస్థితులను అంచనా వేసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిన నేపథ్యంలో సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.120 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ వారానికోసారి లేదా పక్షం రోజులకు ఒకసారి సమావేశమై జిల్లాలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినట్లు గుర్తు చేశారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా వీబీ-జీ రామ్ జీ పథకం కింద ప్రస్తుతం రోజుకు రికార్డు స్థాయిలో 5.38 లక్షల పనిదినాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. 2027 మార్చి నెలాఖరుకు 11 కోట్ల పనిదినాలు కల్పించాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ పనులను చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొంటూ, అన్ని పనులను వచ్చే జూన్ మాసాంతంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పశుగ్రాసం లభ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పశుగ్రాసం పెంపకానికి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. జలసిరి పథకం కింద ఫామ్ పాండ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు.
పింఛను దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయాలి
రాష్ట్రంలో చేయూత పథకం కింద వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులకు సంబంధించి మొత్తం 5.9 లక్షల దరఖాస్తులు అందాయని, వీటిలో 38 వేల దరఖాస్తులు మినహా మిగిలిన అన్నింటి పరిశీలన పూర్తయిందని ప్రధాన కార్యదర్శి తెలిపారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలనను ఈనెల రెండో వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం రెండు విడతలుగా మంజూరు చేసిన 3.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఒక బస్తా సిమెంట్ ధరను రూ.230గా నిర్ణయించినందున, లబ్ధిదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా చూడాలని సూచించారు. అదేవిధంగా, గనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మన ఇసుక వాహనం’ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, రవాణా శాఖ కార్యదర్శి ఇలంబర్తి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ దివ్య, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతమ్, వివిధ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఎన్ఈహెచ్ఎస్ అమలులో ఇబ్బందులు లేకుండా చూడాలి
న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం పథకం అమలులో ఉద్యోగులు, పెన్షనర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంజయ్ జాజు అధికారులను సిఎస్ ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన ఎన్ఈహెచ్ఎస్ బోర్డు సమావేశంలో ఉన్నతాధికారులు, బోర్డు సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి పథకం అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు లేవనెత్తిన సమస్యలు, ముఖ్యంగా ఆసుపత్రుల్లో అడ్మిషన్లు, వైద్య చికిత్సలు, బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం యశోద, అపోలో, కిమ్స్ తదితర కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో ఆన్లైన్ ద్వారా మాట్లాడిన ప్రధాన కార్యదర్శి, ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన ఫిర్యాదులపై ఆసుపత్రుల ప్రతినిధులను వివరణ కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఈహెచ్ఎస్ పరిధిలోని రోగులకు ఆసుపత్రుల్లో అడ్మిషన్లు నిరాకరించకూడదని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న పాత బిల్లులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, చికిత్సకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. వైద్య చికిత్సల ధరల్లో పారదర్శకత, ఏకరూపత ఉండేలా చర్యలు తీసుకోవాలని, ధరలను క్రమబద్ధీకరించడంతోపాటు జవాబుదారీతనాన్ని పెంపొందించాలని ఆదేశించారు. చికిత్సల ఛార్జీల విషయంలో సీజీహెచ్ఎస్ నిర్దేశించిన ధరలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బి.ఎం.డి.ఎక్కా, నవీన్ మిట్టల్, ముఖ్య కార్యదర్శులు క్రిస్టినా చోంగ్తు, యోగితా రాణా, శిఖా గోయల్, సర్ఫరాజ్ అహ్మద్, గౌరవ్ ఉప్పల్, శృతి ఓజా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ, ఇతర ఉన్నతాధికారులు, బోర్డు సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





