స్కావెంజ‌ర్ల జీతాలు చెల్లించండి

– తొమ్మిది నెల‌లుగా జీతాలు రాక ఇబ్బందులు
– చిరుద్యోగుల క‌ష్టాన్ని గుర్తించాలి
– విశ్రాంత ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్న ప్ర‌భుత్వం
– మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆగ్ర‌హం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 31: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య అని హ‌రీష్‌రావు ప్ర‌భుత్వంపై విరుచుకు ప‌డ్డారు. బుధ‌వారం ఆయ‌న మాట్లాడుతూ చిరు ఉద్యోగుల శ్రమను, కష్టాన్ని గౌరవించడం మీకు చేతకాదా? కాంగ్రెస్ పాలనలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బెనిఫిట్స్ కోసం, స్కావెంజర్ల వంటి చిరు ఉద్యోగులు వేతనాల కోసం ఎదురుచూస్తూ నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. మరోవైపు పేద విద్యార్థుల కడుపు నింపే మధ్యాహ్న భోజన పథకం నిధులు సైతం ఏడాదిగా పెండింగ్‌లో పెట్టారు. కేసిఆర్  ప్రారంభించిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని నిలిపివేశారు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు చెల్లించకుండా అమలు గాలికి వదిలేశారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న మీకు మీ సొంత శాఖలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతన సమస్యలు కనిపించడం లేదా? ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పి, ఆచరణలో మాత్రం గాలికి వదిలేశారన్నారు. మీ మాటల మాయాజాలంతో ఎంతకాలం ఉద్యోగులను మోసం చేస్తారు? సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవలందించిన విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కులైన బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని మానసికంగా వేధించడం అమానవీయం, అనైతికం! రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలలు తరబడి ఎదురు చూస్తున్నామని చెబుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆవేదన వింటే మనస్సు చెలించిపోతున్నద‌న్నారు. మధ్యాహ్న భోజన పథకం సహా విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని, స్కావెంజర్ల 9 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page