సృష్టి ఫెర్టిలిటీ కేసులో స్పీడ్‌ ‌పెంచిన ఈడీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌22: ‌రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో అధికారులు స్పీడ్‌ ‌పెంచారు. ఇప్పటికే చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్‌లో ఉన్న నిందితులు డాక్టర్‌ ‌నమ్రత, కల్యాణి, సంతోష్‌, ‌నందినిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అలాగే  ప్రధాన నిందితుడు డాక్టర్‌ ‌నమ్రత కుమారుడు జయంత్‌కృష్ణను సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున మనీలాండరింగ్‌ ‌జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో సృష్టి ఫెర్టిలిటీకి సంబంధించిన వ్యవహారంలో మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాజస్థాన్‌కు చెందిన దంపతులు సికింద్రాబాద్‌ ‌నార్త్ ‌జోన్‌లోని గోపాలపురం పోలీసులను ఆశ్రయించి సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్‌ ‌వైద్యురాలు నమత్రపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్‌ ‌చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వొచ్చాయి. వారి వద్ద నుంచి రూ. 20 నుంచి 40 లక్షల వరకు నగదును డాక్టర్‌ ‌నమత్ర వసూలు చేసినట్లు గుర్తించారు. ఇక అబార్షన్‌ ‌కోసం వొచ్చే మహిళలకు నగదు ఆశ చూపి వారి వద్ద నుంచి సైతం పిల్లలను కొనుగోలు చేసినట్లు సమాచారం. మొత్తం 86 మంది పిల్లలను విక్రయించడం ద్వారా.. రూ. 50 కోట్ల నగదు డాక్టర్‌ ‌నమత్ర సంపాదించినట్లు తెలుస్తుంది. ఈ మొత్తం నగదును హవాలా రూపంలో సేకరించింది. వీటితో భారీగా ఆస్తులు కొనుగోలు చేయడమే కాకుండా విదేశాలకు సైతం పెద్ద ఎత్తున హవాలా రూపంలో నగదు పంపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ క్రమంలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్లు బహిర్గమైంది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఈ సోదాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఐదుచోట్ల, విజయవాడ, విశాఖపట్నంలో రెండు చోట్ల సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు బ్యాంక్‌ అకౌంట్లతోపాటు సృష్టి రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. పిల్లలు లేని జంటలను లక్ష్యంగా చేసుకుని డాక్టర్‌ ‌నమత్రా వ్యవహారాలు నడిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page