– షోరూముల్లోనే వాహన రిజిస్ట్రేషన్ల పరిశీలన
– దిల్లీ కాలుష్యం దృష్ట్యా హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి
– అధికారులతో సక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్22: దిల్లీలో కాలుష్యం ఎలా ఉందో అందరం చూస్తూనే ఉన్నామని.. అలాంటి పరిస్థితులు హైదరాబాద్‌లో రాకుండా ప్రణాళికలు చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణాశాఖ కార్యాలయాల్లో మధ్యవర్తులు లేకుండా చేస్తాం. ఈ శాఖలో ఏఐ వినియోగాన్ని మరింత పెంచాలని నిర్ణయించాం. ఎలక్ట్రిక్ వాహనాలపై రూ.577 కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చాం. దీంతో ఆ వాహనాల విక్రయాలు 0.03 శాతం నుంచి 1.30 శాతానికి పెరిగాయి. వాహన సారథి పోర్టల్‌ను పూర్తిగా అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్రంలో వాహనాల సంఖ్య 1.70 కోట్లకు చేరింది. షోరూమ్‌లోనే వాహనాల రిజిస్ట్రేషన్ చేసే అంశంపై ఆలోచన చేస్తున్నాం. ప్రజలు సహకరిస్తేనే ట్రాఫిక్ కష్టాలు, కాలుష్యం తగ్గుతుందని మంత్రి పొన్నం అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టులను తక్షణమే మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీఏ చెక్‌పోస్టుల రద్దు చాలా పెద్ద నిర్ణయమని పేర్కొన్నారు. చెక్‌పోస్టుల విషయంలో మరింత పారదర్శకత తీసుకొస్తామని, ఇందులో భాగంగానే ప్రస్తుతమున్న ఆర్టీఏ చెక్ పోస్టులను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో సిమ్యులేటర్లు ఏర్పాట చేస్తామని చెప్పారు. రవాణా వ్యవస్థలో ఏఐ సేవలు మరింత వినియోగిస్తామని స్పష్టం చేశారు. రోడ్డు భద్రతపై విద్యార్థులు, ప్రజలు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని.. రూల్స్ అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు ఇస్తున్నామని.. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వాహనాల స్క్రాపింగ్ విషయంలో కొత్త పాలసీ తీసుకొస్తున్నామని చెప్పారు. వాహనాల స్క్రాపింగ్‌ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు యోచిస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





