– ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పష్టీకరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్ అమలు (రూల్ ఆఫ్ రిజర్వేషన్), పదోన్నతులు, బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ అంశాలపై సమీక్ష నిర్వహించేందుకు చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు హాజరై తమ సమస్యలు, సూచనలను కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జి విధానాలను కొనసాగించకుండా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల ఫలితాలకు లోబడి అమలులో ఉన్న నిబంధనల ప్రకారం క్రమబద్ధమైన పదోన్నతులు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరింది. ఉద్యోగులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని, క్రమబద్ధమైన పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని యాజమాన్యం కమిషన్‌కు తెలియజేసింది. సంస్థ భవిష్యత్ నియామక ప్రకటనల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇచ్చింది. టీయాజమాన్యం స్పందన, హామీల పట్ల కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ, రిజర్వేషన్ విధానాల అమలు విషయంలో సంస్థ ఇదేవిధంగా తన కృషిని కొనసాగించాలని సూచించింది. కార్యక్రమంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితీష్ వి పాటిల్, డైరెక్టర్ హెచఆర్ చక్రపాణితోపాటు ఇతర ఉన్నతాధికారులు, విద్యుత్ శాఖ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నాయకులు, కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, కుర్రం నీలాదేవి, రేణిగుంట ప్రవీణ్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




