– చిచెస్టర్ వర్సిటీ ప్రతినిధులతో మంత్రి వాకిటి సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రతిష్టాత్మక చిచెస్టర్ విశ్వవిద్యాలయం ప్రతినిధులతో పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం ప్రత్యేకంగా సమావేశమై విద్యా సహకారం, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, ఉన్నత విద్యావకాశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర యువత అంతర్జాతీయస్థాయి విద్యను అందిపుచ్చుకుని ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌లో పోటీపడేలా భాగస్వామ్య కార్యక్రమాలు రూపొందించాలని మంత్రి శ్రీహరి సూచించారు. తమ విద్యా కార్యక్రమాలు, పరిశోధన అవకాశాలు, అంతర్జాతీయ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ప్రత్యేక పథకాలు, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాల గురించి విశ్వవిద్యాలయ ప్రతినిధులు మంత్రికి వివరించారు. రాష్ట్ర విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య, గ్లోబల్ ఎక్స్‌పోజర్ కల్పించేందుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి శ్రీహరి చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులను శాలువాతో సన్మానించి అభినందించారు. సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధి ఒలివియా మెక్‌లాగ్లిన్, సంబంధిత శాఖల అధికారులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





