– విరాళాల దుర్వినియోగం కేసులో అయోధ్య బార్ అసోసియేషన్ నిర్ణయం
అయోధ్య, జూన్ 29: అయోధ్య బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్టయిన ఎనిమిది మంది నిందితుల తరఫున తమ సంఘానికి చెందిన ఏ న్యాయవాదీ కోర్టులో వాదించరాదని బార్ అసోసియేషన్ సోమవారం సంచలన తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించే న్యాయవాదులపై రూ.5 లక్షల జరిమానా విధిస్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాళికా శరణ్ మిశ్రా స్పష్టం చేశారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచిన రోజే నిర్వహించిన బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. రామాలయానికి భక్తులు సమర్పించిన కానుకల దుర్వినియోగం ఆరోపణలు.. తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని బార్ అసోసియేషన్ తెలిపింది. అందువల్లే సభ్యులంతా ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంది. ఇదే సమావేశంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, ఆలయ నిర్మాణ ఇన్‌చార్జి గోపాల్‌రావుపై కేసు నమోదు చేయాలని కూడా అసోసియేషన్ తీర్మానించింది. వీరంతా మరో మూడు రోజుల్లో అయోధ్యను వీడాలని, లేనిపక్షంలో నగరమంతా బంద్ చేపట్టి, ఆలయాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించింది. కాగా, 2005లో రామ జన్మభూమి తాత్కాలిక ఆలయంపై జరిగిన ఉగ్రదాడి కేసులోనూ నిందితుల తరఫున వాదించబోమని నాడు ఇదే బార్ అసోసియేషన్ ప్రకటించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





