రూ.2వేల కోట్ల ఉద్యోగుల పెండింగ్ బ‌కాయిల విడుద‌ల‌

– ఉద్యోగుల‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న ప్ర‌భుత్వం
– గ‌త నెల 29న మొద‌టి విడ‌త‌లో రూ.2వేల కోట్లు విడుద‌ల 

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 29: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని ప్రభుత్వం మరోసారి చాటుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటిక  ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా రూ.2000 కోట్ల ఉద్యోగుల పెండింగ్ బ‌కాయిల‌ను సోమవారం విడుదల చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను వంద‌ రోజుల్లో రూ.6,000 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత నెల 29న మొదటి విడతగా రూ.2వేల కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం ఈరోజు రెండో విడతలో మరో రూ.2 వేల కోట్లను విడుదల చేసి తన నిబద్ధతను నిరూపించుకుంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగా రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్‌) బకాయిలను వంద శాతం చెల్లించి వారి ఖాతాలను పూర్తిగా క్లియర్ చేసింది. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో ఎలాంటి పెండింగ్‌లు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి సెప్టెంబర్ 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది. పెండింగ్‌లో ఉన్న రూ.10,000 లోపు విలువ కలిగిన చిన్న మొత్తాల బిల్లులన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించింది. ఈ విభాగంలో దాదాపు 5 లక్షలకు పైగా ఉన్న టోకెన్లను గుర్తించి ఏమాత్రం జాప్యం లేకుండా చెల్లింపులు జరిపారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చూపుతున్న సానుకూల ధోరణి అభినందనీయమని వారు కొనియాడుతున్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన బకాయిలను కూడా క్రమపద్ధతిలో క్లియర్ చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించడంత, ఉద్యోగుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *