– తొలి పుష్కర స్నానమాచరించిన కంచి పీఠాధిపతి, మంత్రులు
– తరలివస్తున్న భక్తులు
– భక్తి పారవశ్యంతో పులకిస్తున్న త్రివేణి సంగమం
శ్లో॥ ప్రణీత వరదా వైణ్య గౌతమీచ సరస్వతి॥
సద్యః పంచ వహం త్యత్ర ప్రయాగా త్కోటి శోధికం ॥
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 21 : కాళేశ్వరం త్రివేణి సంగమం వేద మంత్రోఛ్చారణలతో మారుమోగింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏకైక క్షేత్రం అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి సంగంమంలో గురువారం ఉదయం 5.43 నిమిషాలకు పుష్కరాలు లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. గురువారం వేకువ జామునే త్రివేణి సంగమ తీరాన సరస్వతి నదికి పుష్కరుడిని ఆహ్వానించే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. త్రివేణి సంగమ క్షేత్రం, త్రిలింగ క్షేత్రం అయిన కాళేశ్వరం అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఇప్పటివరకూ సాంప్రదాయానికే పరిమితమైన సరస్వతి అంత్య పుష్కరాలు ఈసారి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.
గణపతి పూజతో..
గోదావరి, ప్రాణహిత నదులు కలిసినచోట అంతర్వాహినిగా సరస్వతి నది ఉద్భవించిన ప్రాంతంలో ఉదయం 5.43 గంటలకు సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. గోదావరి పుష్కరాల సమయంలో (వీఐపీ ఘాట్) సరస్వతి ఘాట్‌లో సరస్వతి నది పుష్కరాలను నిర్వహిస్తున్నారు. కంచి స్వామితోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హై కోర్టు న్యాయమూర్తి నందా, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి, రంగారెడ్డి ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, ట్రేడింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, ఇతర ప్రముఖులు త్రివేణి సంగమ క్షేత్రంలో సరస్వతి అంత్య పుష్కర వేడుక ప్రారంభోత్సవ కార్యక్రమానికి హజరై పుణ్య స్నానాలాచరించారు. తొలుత విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరునికి తొలి పూజలు చేసిన తరువాత అంత్య పుష్కర మహోత్సవ వేడుకలకు అంకురార్పరణ చేశారు.
కంచి పీఠాధిపతిచే..
అత్యంత అరుదైన సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరించారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పుష్కర స్నానాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు సరస్వతి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కాళేశ్వర మక్తీశ్వర స్వామిని, శ్రీ శుభానంద దేవిని, సరస్వతి మాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పుష్కరాలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలోని జిల్లా యంత్రాంగం కొన్ని రోజులుగా అవిశ్రాంతంగా శ్రమించి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పుష్కర స్నానాలు ఆచరించి చదువుల తల్లి సరస్వతి మాత అశీస్సులు పొందాలని ఆయన ఆకాంక్షించారు.
అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భద్రత, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సేవలు, రవాణా వంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ పుణ్యకాలంలో భక్తులు సౌకర్యవంతంగా, సురక్షితంగా పుష్కర స్నానాలు నిర్వహించుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ అంత్య పుష్కరాలు పన్నెండు రోజులపాటు కొనసాగుతాయి. ఆచరించిపుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించే భక్తుల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పలు ధార్మిక సంఘాలు ఉచిత అన్నప్రసాద వితరణ చేస్తున్నాయి, చలువ పందిళ్లు ఏర్పాటు చేసి ఎండ తీవ్రతనుంచి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు.
ఆలయ విశిష్టతలు
భారత దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకే పానవట్టంపై యముడు (కాళేశ్వరుడు) శివుడు (ముక్తేశ్వరుడు) కొలువై ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. ఇక్కడ కాళేశ్వరునికి పూజలు చేసిన తర్వాతే ముక్తేశ్వరునికి పూజలు చేయడం ఆనవాయితీ.
ముక్తేశ్వర లింగం పైభాగంలో రెండు చిన్న రంధ్రాలు ఉంటాయి. ఎంత నీటితో అభిషేకం చేసినా ఆ నీరు అందులోనే ఇంకిపోవడం ఒక అద్భుతం. భక్తులు తమ పాపాలు తొలగిపోవడానికి, మృత్యు భయం తొలగిపోవడానికి ఆలయంలోని ‘యమకోణం’ (ఒక చిన్న సందు) గుండా వెళ్లడం ఒక ముఖ్యమైన ఆచారం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





