ఊపిరి కోసం పోరాటం

– గుండె చుట్టూ 750 మిల్లీలీటర్ల ద్రవం
– రోగికి పునర్జన్మ ప్రసాదించిన బంజారాహిల్స్ కేర్ వైద్యులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21: అతను విజయవాడకు చెందిన 48 ఏళ్ల పంతంగి ధనుంజయుడు.. ఒక్కో నిమిషం ప్రాణాన్ని నిర్ణయించే అత్యవసర పరిస్థితిలో ఉన్నాడు.. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారిన స్థితి… గుండె పనితీరు వేగంగా క్షీణిస్తోంది..ఈ ప‌రిస్థితుల్లో కుటుంబ సభ్యులు చివరి ఆశగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్స్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో అత్యవసర వైద్య సేవల్లో ప్రతి నిమిషం ఎంత కీలకమో ఆ హాస్పిటల్ వైద్యులు మరోసారి చాటి చెప్పారు. అత్యవసర గుండె శస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడారు. 100 కిలోలకు పైగా బరువున్న ఆయన తీవ్రమైన శ్వాస ఇబ్బంది, ప్రమాదకరంగా తగ్గిన ఆక్సిజన్ స్థాయిలు, వేగంగా క్షీణిస్తున్న గుండె పనితీరు, పలు ఇతర అనారోగ్య సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో చివరి ఆశగా కేర్ హాస్పిటల్‌కు వచ్చారు. మధుమేహం సంబంధిత కిడ్నీ వ్యాధి, తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్న ఆయనకు గుండె చుట్టూ భారీగా ద్రవం పేరుకుపోయి, గుండె గదులపై ఒత్తిడి పెరిగి రక్త ప్రసరణ తీవ్రంగా ప్రభావితమైనట్లు వైద్యులు గుర్తించారు. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో మాసివ్ పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటారు. రోగి పరిస్థితి అత్యంత అస్థిరంగా ఉండటం, సాధారణ పద్ధతిలో ద్రవాన్ని తొలగించడం క్లిష్టంగా ఉండటంతో అత్యవసర వైద్య బృందం ముందుగా ఆయనను స్థిరపరిచింది. అనంతరం కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ నిపుణులతో కూడిన మల్టీ డిసిప్లినరీ హార్ట్ టీమ్ అత్యవసరంగా పెరికార్డియల్ విండో ప్రక్రియ చేయాలని నిర్ణయించింది. ఈ అత్యంత ప్రమాదకర అత్యవసర ప్రక్రియలో వైద్యులు గుండె చుట్టూ పేరుకుపోయిన సుమారు 750 మిల్లీలీటర్ల ద్రవాన్ని విజయవంతంగా తొలగించారు. దీంతో గుండెపై ఒత్తిడి తగ్గి గుండె పనితీరు క్రమంగా పునరుద్ధరణ జరిగింది. ఇలాంటి కేసుల్లో చికిత్స ఆలస్యం అయితే కార్డియాక్ టాంపోనేడ్, బహుళ అవయవాల వైఫల్యం, ఆకస్మిక గుండె మరణం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు. అందువల్ల సకాలంలో అత్యవసర వైద్య జోక్యం కీలకమని పేర్కొన్నారు. ప్రక్రియ అనంతరం రోగిని అధునాతన పర్యవేక్షణ కోసం ఐసీయూకు తరలించారు. 72 గంటల ఇంటెన్సివ్ కేర్ తర్వాత ఆయనకు వెంటిలేటర్సు తొలగించారు. అనంతరం రోగి క్రమంగా కోలుకుని స్థిరమైన ఆరోగ్యంతో నడుస్తూ డిశ్చార్జ్ అయ్యారు.
సకాలంలో నిర్ణయంతో ప్రాణాలు కాపాడగలిగాం : డాక్టర్ సూర్య ప్రకాశరావు 
‘ఈ రోగి మా వద్దకు వచ్చినప్పుడు ఆయన బతికే అవకాశాలు చాలా తక్కువగా కనిపించాయి. అయితే వేగవంతమైన అత్యవసర స్పందన, సరైన సమయంలో తీసుకున్న వైద్య నిర్ణయం, నిపుణులైన బృందం సమన్వయం వల్ల ఆయన ప్రాణాలు కాపాడగలిగాం’ అని హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ అండ్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ వి.సూర్య ప్రకాశరావు అన్నారు. ఈ సంఘటన మా అత్యవసర వైద్య సేవల సామర్థ్యాన్ని, మల్టీ డిసిప్లినరీ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది.. అనుభవజ్ఞులైన బృందాలు, అధునాతన మౌలిక సదుపాయాలు, వేగవంతమైన నిర్ణయాలు కలిసివస్తే అత్యంత విషమ స్థితిలో ఉన్న రోగులు కూడా కోలుకునే అవకాశం ఉంటుంది అని హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభినవ్ జోషి తెలిపారు.
——————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *