హైడ్రా కార్యక్రమాలను కొనసాగిస్తాం

– ఎవరు అధికారిగా ఉండాలో మాకు స్పష్టత ఉంది
– కబ్జాలు చేస్తే బడా బాబులైనా, పేదలైనా ఊరుకోం
-హైడ్రాపై కావాలనే తప్పుడు ప్రచారాలు
– కావాలనే సోషల్ ‌మీడియాలో దుష్ప్రచారాలు
– దిల్లీలో మీడియాతో సీఎం రేవంత్‌ ‌రెడ్డి

న్యూదిల్లీ, జూలై 28: హైడ్రా పనులు కొనసాగించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. కబ్జాకోర్లు మాత్రమే హైడ్రా వద్దంటున్నారని పేర్కొన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. కబ్జాలు చేస్తే బడా బాబులైనా, పేదలైనా ఊరుకోమని స్పష్టం చేశారు. గండిపేట, బతుకమ్మ కుంటలను ఆక్రమించింది పేదలా..పెద్దలా అని విపక్షాలను ఆయన ప్రశ్నించారు. ఎన్‌ ‌కన్వెన్షన్‌ ‌పేదలదా.. పెద్దలదా.. అని వారిని నిలదీశారు.హైడ్రా తాము తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణగా సీఎం అభివర్ణించారు. హైడ్రాకు ఉన్నతాధికారిగా ఎవరిని నియమించాలనే విచక్షణ తమ ప్రభుత్వానికి ఉందని కుండబద్దలు కొట్టారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌ ‌కుమార్‌పైన 400 పైగా కోర్టు ధిక్కరణ కేసులున్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి గుర్తు చేశారు. దురుద్దేశంతోనే కేసులు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారంటూ బీఆర్‌ఎస్‌ ‌నేతలపై మండిపడ్డారు. కోర్టు తీర్పుని పరిశీలించి.. ఆ తర్వాత తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. హైడ్రా కార్యాచరణపై తమకు పూర్తి స్పష్టత ఉందని అన్నారు. కబ్జాకోరులకు సహకరించొద్దంటూ మీడియాకు సూచించారు. డబ్బులు పెట్టి సోషల్‌ ‌డియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోతుకుంట భూముల కేసు విచారణ నేపథ్యంలో హైడ్రా కమిషనర్‌ ఎ.‌వి.రంగనాథ్‌పై హైకోర్టు సోమవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కమిషనర్‌ ‌పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలపై సమీక్షిస్తామని చెప్పారు. కబ్జాకోరులు ఫేక్‌ ‌పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. చెరువులు, కుంటలు, నాలాలను కాపాడటమే హైడ్రా సిబ్బంది విధి. బతుకమ్మకుంటను కబ్జా చేస్తే రక్షించారు.. దానిపై కోర్టుకెళ్లారు. బతుకమ్మకుంటలో బీఆర్‌ఎస్‌ ‌నేత 10 ఎకరాలు కబ్జా చేశాడు. కేసీఆర్‌ ‌పర్యటన సందర్భంగా ఆ నేత పూల వర్షం కురిపించాడు. కబ్జాదారులను కాపాడేందుకు డబ్బు ఖర్చు చేసి సోషల్ ‌మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. హైడ్రాపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనే విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉంటుంది. తప్పుడు కేసులను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం‘ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రానికి 11.56 లక్షల ఇండ్లు కేటాయించండి
– స్థానిక అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు వీబీ జీ రామ్ జీలో ప‌నులు చేర్చండి

ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ కింద రాష్ట్రానికి 11,56,915 ఇండ్ల‌ను కేటాయించాల‌ని కేంద్ర గ్రామీణాభివృద్ది, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన త‌ర్వాత పేద‌ల‌కు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వ‌డానికి అధిక ప్రాధాన్య‌మిస్తున్న‌ట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌తో కృషి భ‌వ‌న్ లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాన్ని వివ‌రించారు. గత ప్రభుత్వం పీఎంఏవై-జీ ను వినియోగించుకోక‌పోవ‌డంతో రాష్ట్రంలో గ‌త ప‌దేళ్లు పేద‌లు సొంత ఇళ్లు నిర్మించుకోక‌పోవ‌డంతో, ఇప్పుడు తీవ్ర డిమాండ్ నెల‌కొంద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వ‌హించిన స‌ర్వేలో 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించిన‌ట్లు సీఎం తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *