పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ, కొత్త వాటి కి ప్రాధాన్యం
విలేకరుల సమావేశంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి
మహబూబ్‌నగర్ ప్రజాతంత్ర జూన్ 28: రాష్ట్రంలోని ప్రతి నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో వినియోగించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నదని రాష్ట్ర నీటిపారుదల , పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పశుసంవర్ధక,యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, ర్యాలంపాడు రిజర్వాయర్ లను శనివారం సందర్శించి జూరాల ప్రాజెక్టులో ఏర్పడిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ జూరాల ప్రాజెక్ట్ సాంకేతికంగా పూర్తి భద్రంగా కొనసాగుతోందని తెలిపారు. 62 గేట్లలో 58 గేట్లు నిర్విరామంగా పనిచేస్తున్నాయని,తాత్కాలికంగా నాలుగు గేట్లకు రోప్ సమస్య తలెత్తినప్పటికీ,దాని వల్ల ప్రాజెక్ట్‌కి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.గతంలో ఎన్నో భారీ వరదలను జూరాల డ్యామ్ విజయవంతంగా ఎదుర్కొందని, ఇప్పుడు కూడా అన్ని భద్రతా చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం జాగ్రత్తలు పాటిస్తోందని తెలిపారు. గత దశాబ్ద కాలంలో తెలంగాణలో జరిగిన పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిరదని ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ప్రస్తుతం వచ్చిన కొత్త ప్రభుత్వం, గత పాత తప్పిదాలను సరిచేసే దిశగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. తుమ్మెళ్ల ఎత్తిపోతల పథకం కింద మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు భూసేకరణ పనులను వేగవంతం చేయడమే కాకుండా,జూరాల ఎడమ కాలువ ద్వారా ర్యాలంపాడు రిజర్వాయర్ పనులను త్వరితంగా పూర్తి చేస్తామని తెలిపారు.నెట్టెంపాడు భూసేకరణ కోసం ఇప్పటికే ?25 కోట్లు విడుదల చేశామని ,మిగతా మొత్తం త్వరలోనే ఇవ్వబడుతుందని తెలిపారు. నెట్టెంపాడు ప్రాజెక్టుకు రూ.2051 కోట్లు మంజూరు చేసి పనులను వేగంగా జరిపిస్తున్నామని, డిసెంబర్ 2025 లోపల 100% పూర్తి చేస్తామన్నారు.మానవ వనరుల దృష్టికోణంలోనూ,గత ప్రభుత్వ పాలనలో ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగనప్పుడు,నూతనంగా 11,000 మంది ఇరిగేషన్ ఇంజినీర్లను నియమించడం జరిగింది అనీ,ఇది ఈ ప్రభుత్వ విధేయతకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల మరియు యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు ఎంతమాత్రం ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని నిలబడిన విశ్వసనీయ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. 2009లో వచ్చిన భారీ వరదల సమయంలోనూ రోజుకి 12 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినప్పటికీ, ప్రాజెక్టు ఎంతమాత్రం నష్టాన్ని ఎదుర్కొనలేదని అన్నారు.ప్రజల్లో ఆందోళన కలిగించేందుకు కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని,అలాంటి అసత్యాల్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.గద్వాల్ శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని, సాగునీటి లభ్యత పెరిగిందని అన్నారు.ర్యాలంపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచేలా రెండు నుంచి నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసే పనులను వేగవంతం చేయాలని మంత్రిని అభ్యర్థించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్,అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ,ఇంజినీర్-ఇన్-చీఫ్ ఓ అండ్ ఏం శ్రీనివాస్, డ్యామ్ సేఫ్టీ చీఫ్ ఇంజినీర్ టి. ప్రమీలా,వనపర్తి చీఫ్ ఇంజినీర్ ఏ. సత్యనారాయణ రెడ్డి, గద్వాల సూపరింటెండిరగ్ ఇంజినీర్ రహీంఉద్దీన్, తదితరులు పాల్గొన్నారు.