యూపీఎస్‌సీ ప్రిలిమ్స్‌లో 30మంది విజయఢంకా

– దళిత, బలహీనవర్గాల యువత నూతన ఒరవడి
– సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : సామాజిక న్యాయం, సమానావకాశాలు, నాణ్యమైన కోచింగ్ ద్వారా బలహీన వర్గాల యువతను దేశ అత్యున్నత సేవల్లోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం ఫలితంగా తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ మరోసారి విశిష్ట ఫలితాలను నమోదు చేసిందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. యూపీఎస్‌సీ ఈనెల 15న విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ-2026, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) ప్రిలిమినరీ పరీక్షల ఫలితాల్లో ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన 30మంది అర్హత సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. అలాగే సివిల్ సర్వీసెస్-2025 తుది ఫలితాలలో ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన ఎ.ఆశిష్ (ఏఐ-676) డి.ప్రవీణ్‌కుమార్ (ఏఐఆర్-793) తుది ఎంపిక సాధించడం విశేషమని, వీరికి ఐపీఎస్ లభించే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఐఎఫఎస్ తుది ఫలితాలలో డి.శశాంక్ (78వ ర్యాంకు), జి.శ్రీకాంత్ (115వ ర్యాంకు) సాధించిన విజయాలు రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దళిత, గిరిజన, బలహీనవర్గాల ప్రతిభావంతులైన యువత దేశ అత్యున్నత సేవల్లో స్థానం సంపాదించేలా ప్రత్యేక కోచింగ్, అధ్యయన సామగ్రి, వసతి, ఆర్థిక సహాయం, నిపుణుల మార్గదర్శకత్వంతో కూడిన శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ తుది ఎంపిక సాధించిన అభ్యర్థులతోపాటు ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలియజేస్తూ రాబోయే మెయిన్స్‌లోనూ అత్యుత్తమ విజయాలు సాధించి రాష్ట్రానికి మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ విజయాలకు ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నరసింహా రెడ్డి సమర్థవంతమైన నాయకత్వం, అంకితభావంతో కూడిన కృషి, అధ్యాపక బృందం అందించిన నాణ్యమైన శిక్షణ, మార్గదర్శకత్వం, విద్యార్థుల నిరంతర శ్రమ, క్రమశిక్షణ, పట్టుదల ప్రధాన కారణాలని అడ్లూరి పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగవర్గాలకు చెందిన యువత యÖపీఎస్‌సీ, ఐఎఫ్‌వోస్, గ్రూప్-1, గ్రూప్-2, ఇతర పోటీ పరీక్షల్లో విజయాలు సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. బలహీనవర్గాల యువతను దేశ పరిపాలనా వ్యవస్థలో కీలక స్థానాలకు చేర్చడం ద్వారా సామాజిక సాధికారతను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *