సారస్ మేలాకు సందర్శకుల తాకిడి

– మూడో రోజు 20 వేల మందికి పైగా సందర్శకులు
– రూ.10 లక్షలకు పైగా విక్రయాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : గ్రామీణ మహిళా సంఘాల సభ్యులు, చేతివృత్తుల కళాకారులు, మహిళా వ్యాపారవేత్తలకు అండగా నిలుస్తున్న సారస్ గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయ మేలాకు రోజురోజుకూ సందర్శకుల తాకిడి పెరుగుతోంది. హైదరాబాద్‌లోని ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచఎండీఏ మైదానంలో జరుగుతున్న మేళా మూడో రోజు సందర్శకులతో సందడిగా మారింది. గ్రామీణ మహిళల ఉత్పత్తులకు పట్టణ మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 20 వేల మందికి పైగా సందర్శకులు మేళాను సందర్శించగా రూ.10 లక్షలకుపైగా విలువైన ఉత్పత్తుల విక్రయాలు జరిగాయి. మహిళా సంఘాల సభ్యులు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు పరిచయం చేసేందుకు, తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు సారస్ మేళా చక్కటి వేదికగా నిలుస్తోంది. సందర్శకులలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. స్టాళ్లను సందర్శిస్తూ గ్రామీణ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించి కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ ఉత్పత్తులు, హస్తకళలు, ఆహార పదార్థాలు, చిరుతిళ్లు, చేనేత వస్త్రాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడం, మధ్యవర్తులపై ఆధారపడకుండా మహిళలు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం ఈ మేళా ద్వారా లభిస్తోంది. ఉత్పత్తుల నాణ్యత, ధరలు, ప్యాకేజింగ్, వినియోగదారుల అభిరుచులపై ప్రత్యక్ష అవగాహన పొందేందుకు కూడా ఇది దోహదపడుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన స్టాళ్లలో విభిన్న రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. తమ ప్రాంతాల ప్రత్యేకతను చాటి చెప్పే ఉత్పత్తులను మహిళలు ఉత్సాహంగా విక్రయిస్తున్నారు. సందర్శకుల ఆదరణ, పెరుగుతున్న విక్రయాలు మహిళా పారిశ్రామికవేత్తల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి.

వ్యాపార అనుభవాలపై మహిళా సంఘాల సభ్యుల చర్చ

మేళా సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా సంఘాల సభ్యులు తమ వ్యాపార అనుభవాలను పరస్పరం పంచుకున్నారు. వ్యాపారాలను నిర్వహించే క్రమంలో తమ జిల్లాల్లో ఎదురవుతున్న సమస్యలు, ఉత్పత్తుల విక్రయాల్లో ఎదురవుతున్న సవాళ్లు, మార్కెటింగ్ అవకాశాలు, ఉత్పత్తులకు మరింత విస్తృత గుర్తింపు తీసుకురావాల్సిన అంశాలను సెర్ప్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మహిళా సంఘాల వ్యాపారాలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, మార్కెట్ అనుసంధానం, ఉత్పత్తుల విక్రయాలను పెంచుకునే మార్గాలు, వ్యాపార నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలపై చర్చించారు. మహిళలు తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా ఒకరి నుంచి మరొకరు నేర్చుకునేందుకు, కొత్త ఆలోచనలను స్వీకరించేందుకు ఈ సమావేశం ఉపయోగపడింది.

సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా మేళా

మూడో రోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను అలరించాయి. కళాకారుల ప్రదర్శనలు, సాంప్రదాయ కళారూపాలు మేళాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామీణ సంస్కృతి, కళలు, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలు సందర్శకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఉత్పత్తుల కొనుగోళ్లతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు కూడా ప్రజలు ఆసక్తి చూపడంతో మేళా ప్రాంగణం సందడిగా మారింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *