తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికులే కీలకం

– అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి వారికుంది
– మాజీ మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ఆనాడు కేసీఆర్ సకల జనులను ఏకం చేశారని, అందులో ఆర్టీసీ కార్మికులు ప్రధాన పాత్ర పోషించారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల కృషి మర్చిపోలేనిదని, ఆ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి వారికి ఉందని సంచలన వ్యాఖ్య‌లు చేశారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా రాణిగంజ్ డిపో ముందు కార్మికులతో కలిసి ఆయన గురువారం ధర్నాకు దిగారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవాలని ఆనాడు కేసీఆర్ కేబినెట్ నిర్ణయం తీసుకుందని, ఇంతలో ప్రభుత్వం మారిందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ప్రతిపక్ష నేతలు వెనకుండి సమ్మె చేయిస్తున్నారని ఓ మంత్రి అంటున్నారని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు తీరిస్తే సమ్మె ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. సమ్మె చేసే వారిని ఆర్టీసీ ఎండీ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అందరం కలిసి సెక్రటేరియట్ ముట్టడికి వెళ్దాం.. ప్రభుత్వం మెడలు వంచి హామీలను సాధిద్దాం అని తలసాని పిలుపునిచ్చారు. విద్యుత్ బస్సులకు ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి నడిపిస్తున్నారని, ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్లకు విద్యుత్ బస్సు నడపడం రాదా అని నిలదీశారు. మీరు ధైర్యంగా పోరాడండి.. వెనుక కేసీఆర్ ఉన్నారు.. పార్టీ మొత్తం ఉంది’ అంటూ ఆర్టీసీ కార్మికులతో తలసాని అన్నారు. కేబినెట్ సమావేశం అయిన వెంటనే ఆర్టీసీ జేఏసీని ప్రభుత్వం చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. హామీల విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వాలన్నారు. తూతూ మంత్రంగా ఒప్పుకోవద్దని జేఏసీ  నాయకులకు విజ్ఞప్తి చేశారు. 29 డిమాండ్లు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారని.. మరి అవి ఏమిటో మీడియా సాక్షిగా విడుదల చేయాలని తలసాని డిమాండ్ చేశారు.

సమ్మెను నిర్వీర్యం చేసే కుట్ర : బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ 

రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు విధానాల ఫలితంగా అన్ని వర్గాలు రోడ్లపైకి వస్తున్నాయని బీఆర్ఎస్ నేత జి.దేవీప్రసాద్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభిస్తే దాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్ హయాంలో ఆగస్టు 2023లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారని, నాడు ఎన్నికల కోడ్ రావడంతో అపాయింటెడ్ డే రాలేదని తెలిపారు. 32 డిమాండ్లపై కార్మికులు సమ్మె నోటీసు ఇస్తే ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలవలేదని ఆరోపించారు. ఆర్టీసీ బస్సులకు నైపుణ్యం లేని డ్రైవర్లను తాత్కాలికంగా నియమించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న తాత్కాలిక డ్రైవర్ నిర్వాకంతో 38 మంది ప్రయాణికులు గాయపడ్డారన్నారు. తాండూరులో పోలీసులు జారీ చేసిన హెచ్చరిక దుర్మార్గంగా ఉందని, సీఎం జిల్లాలో పోలీసులు ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తున్నారని మండిపడ్డారు. సమ్మెపై బీజేపీ గోడ మీద పిల్లి వాటాన్ని ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. ఆర్టీసీ సమ్మె వెనుక హరీష్ రావు ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు ఆర్టీసీ కార్మికులకే కాదు.. సమస్యల్లో ఉన్న ఎవరికైనా మద్దతు ఇస్తారని స్పష్టం చేశారు. కాళేశ్వరం ఘోష్ కమిషన్ నివేదికపై హై కోర్టు తీర్పుతో ప్రభుత్వానికి కనువిప్పు కావాలని సూచించారు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ నేపథ్యంలో ఇరిగేషన్ ఇంజినీర్ల పై క్రమశిక్షణ చర్యలకు ఇచ్చిన నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి : మాజీ మంత్రి వేముల   

నిజామాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె డిమాండ్లను పరిష్కరించకపోతే మరో సకల జనుల సమ్మె తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి  హెచ్చరించారు. కమిటీలతో ఎంతకాలం వారిని మభ్యపెడుతూ కాలయాపన చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర సాధనలో అగ్రభాగాన ఉన్న ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఒక్కసారి ఆర్టీసీ ప్రైవేట్‌పరమైతే ప్రజలకు భారం తప్పదని హెచ్చరించారు. ఇది ఒక్క ఆర్టీసీ కార్మికుల సమస్య కాదని, యావత్తు రాష్ట్ర ప్రజల సమస్య అని అన్నారు. ఆర్టీసీ కార్మికుల విలీనంపై సర్కార్ వైఖరేమిటో చెప్పాలని నిలదీశారు. అధికారుల కమిటీ ఎలాంటి సమస్యలకు పరిష్కారం చూపలేదన్నారు. కార్మికులతో చర్చల” జరిపిన వారిలో ఒక్క మంత్రి లేరని, అందుకే అధికారుల కమిటీ చేతులెత్తేసిందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాష్ట్రవ్యాప్తంగా సకల జనుల మద్దతు ఉన్నదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో కాలయాపన చేయకుండా చేతల్లో పనితనం చూపించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానిదే బాధ్యత : బీజేపీ చీఫ్ రామచందర్ రావు

హైదరాబాద్: కార్మికుల పక్షాన ఉంటానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇద్దరే అంటూ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం అసలు సమస్యలు పక్కనపెట్టి కేబినెట్ అంటూ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. పీఆర్సీపై అప్పుడు కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నదని విమర్శించారు. అన్ని జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలు వారికి మద్దతుగా ఉంటారని తెలిపారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలన్నారు. లేదంటే బీజేపీ తరఫున ఆందోళనలో పాల్గొంటామని హెచ్చరించారు. రేపు(శుక్రవారం) ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *