~ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆక్షేపణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 7: ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై బీఆర్‌ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల ఆర్థిక స్థితిని పట్టించుకోకుండా ప్రభుత్వం చార్జీలు పెంచడం అన్యాయం అని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందని, కానీ అదే సమయంలో పురుషులు, విద్యార్థులపై అదనపు భారాన్ని మోపుతోందని కేటీఆర్ మండిపడ్డారు. ఇంట్లో ఒక మహిళ ఉచితంగా ప్రయాణం చేస్తే, కుటుంబంలోని మిగిలిన సభ్యులందరికీ రెండింతలు చార్జీలు కట్టాల్సి వస్తోంది. ఈ విషయం ఇప్పుడు ప్రతి తెలంగాణ కుటుంబానికీ అర్థమైందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించినట్టు ప్రభుత్వం చెబుతున్నా వాస్తవానికి ఇది ఆర్థిక సమతుల్యతను దెబ్బతీసే నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలో ఈ విధంగా వసూళ్లను పెంచడం ప్రజలపై నేరుగా భారం మోపడం అవుతుందన్నారు. ఆర్టీసీని బలోపేతం చేయాలనే ఉద్దేశం ఉన్నా అది ప్రజల వెన్నుపైన భారం మోపడం ద్వారా సాధ్యం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తన ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ప్రయాణికులను బలితీసుకుంటోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నాయకులు కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, చార్జీల పెంపును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల జీవన వ్యయాలు ఇప్పటికే పెరిగిపోయాయని, ఇలాంటి చర్యలు సాధారణ కుటుంబాలపై మరింత భారం మోపుతాయని వారు పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





