గురుకులాలకు తాళాలు వేసే దుస్థితా?

– భవనాల అద్దె బకాయిలు చెల్లించకపోవడం దుర్మార్గం
– సర్కారుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇది ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసమర్థత, చేతకానితనానికి నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదిక‌గా మండిపడ్డారు. విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ గురుకుల భవనాలకు ఏడాదికాలంగా అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో చివరికి భవనాలకు తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని అన్నారు. పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ అత్యుత్తమ వ్యవస్థను కుప్పకూల్చి కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపేయాలన్న కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్టు అనుమానం కలుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు కూడా చెల్లించకుండా విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెడుతున్న ముఖ్యమంత్రి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు అగ్రవర్ణ పేదలకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందిస్తున్న రెసిడెన్షియల్‌ వ్యవస్థను సమాధి చేసే పన్నాగం పన్నుతున్నారని కేఈఆర్‌ వ్యాఖ్యానించారు. రెండేళ్లు నిండకుండానే రెండున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్‌ రెడ్డి కనీసం గురుకులాల అద్దె కిరాయి కూడా కట్టకుండా ఆ సొమ్ముతో ఎవరి జేబులు నింపుతున్నాడో తక్షణమే లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వెంటనే కాంగ్రెస్‌ సర్కారు రాష్ట్రంలోని అన్ని గురుకుల భవనాల అద్దె బకాయిలను విడుదల చేసి విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ గురుకులాలకు తాళాలు వేసే దుస్థితే వస్తే విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా ఈ నిరంకుశ కాంగ్రెస్‌ సర్కారుపై సమరశంఖం పూరిస్తామని కేటీఆర్‌ తీవ్ర హెచ్చరిక చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page