మహిళా సాధికారతలో మరో కీలక మలుపు

– ఎస్‌హెచ్‌జీలకు 553 ఆర్టీసీ బస్సులు
– రేపు సీఎం చేతుల మీదుగా అంద‌జేత‌
– ఏర్పాట్లపై మంత్రులతో కలిసి సీఎస్ సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లకు 553 ఆర్టీసి బస్సులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రదానం చేసే కార్యక్రమం మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రులు డి.అనసూయ (సీతక్క), పొన్నం ప్రభాకర్, ఎంపీ వేం నరేందర్ రెడ్డిలతో కలిసి ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మహిళా సాధికారత, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ, గ్రామీణ ఆర్థికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, రైజింగ్-2047 లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. దేశంలోనే ఆదర్శవంతంగా మహిళా సాధికారతకు వినూత్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎస్ తెలిపారు. రాష్ట్రం అమలు చేస్తున్న ఈ ఫథకాలను  అధ్యయనం చేసేందుకు ఆయా రాష్ట్రాల అధికారులు రాష్ట్రానికి వస్తున్నారని సీఎస్ పేర్కొన్నారు. అన్ని జిల్లాల నుండి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వేల సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందున వారికి సీటింగ్ ఏర్పాట్లు, బ్యారికేడింగ్, తాగునీరు, మొబైల్ టాయిలెట్స్, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, డీజీపీ సీవీ ఆనంద్, స్పెషల్ సీఎస్‌లు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్, దాన కిషోర్, రవాణా కమిషనర్ ఇలంబర్తి, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎండీ వీణ అశోక్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అలా, ప్రొటోకాల్ డైరెక్టర్ హరీష్, తదితర అధికారులు పాల్గొన్నారు.

సభను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపు

మహా మహిళా సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ భారీ కార్యక్రమానికి సుమారు 25 వేల మంది మహిళలు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల రుణ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంపై ప్రకటించి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ.500 కోట్ల చెక్కులను పంపిణీ చేయనున్నారు. మహిళా సంఘాల ఆర్టీసీ అద్దె బస్సుల హైర్ చార్జీల కింద రూ.20.30 కోట్ల చెక్కులను అందజేయనున్నారు. అలాగే కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్టీసీకి రూ.199 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. మహిళా సంఘాలు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిచ్చిన 553 బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ వినూత్న రవాణా నమూనా రాష్ట్రంలో మహిళా సాధికారతకు కొత్త గుర్తింపుగా నిలుస్తోంది. ఇప్పటికే జిల్లాల నుంచి వేలాదిమంది మహిళలు తమ సంఘాలకు చెందిన సొంత బస్సుల్లో హైదరాబాద్‌కు తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి సీతక్క సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలను కేవలం లబ్దిదారులుగా కాక ఆర్థిక వ్యవస్థను నడిపించే భాగస్వాములుగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాల బలోపేతం, ఆర్థిక స్వావలంబన, వ్యాపార విస్తరణకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. ప్రతి మహిళా సంఘ సభ్యురాలు ఈ మహాసభలో భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *