భగ్గుమన్న కమర్షియల్‌ ‌సిలిండర్‌

– 19 ‌కిలోల సిలిండర్‌పై రూ.993 పెంపు
– హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ ‌సెంటర్లపై పెను భారం

న్యూదిల్లీ, మే 1: పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారత్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ఇందనం సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. చమురు నౌకలను దిగ్భందించారు. ఈ క్రమంలో కొరత అనివార్యంగా మారింది. ఈ క్రమంలో ముఖ్యంగా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల ఎల్పీజీ గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర భారీగా పెరిగింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ ‌సెంటర్లు, బేకరీలు వంటి వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. వాణిజ్య గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా రూ.993 పెంచింది. ఈ పెంపుతో హైదరాబాద్‌లో కమర్షియల్‌ ‌సిలిండర్‌ ‌రేటు రూ.3,315కు చేరింది. దిల్లీలో 19 కిలోల సిలిండర్‌ ‌ధర రూ.3,071కి చేరుకుంది. దిల్లీలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ‌ధర గతంలో రూ. 2,078.50 ఉండేది. అదేవిధంగా, ముంబైలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ‌ధర రూ.2,031 నుంచి రూ. 3,024కు పెరిగింది. ఇక 5 కిలోల సిలిండర్‌ ‌ధర రూ.914.50కి పెరిగింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ ‌ధరలను మూడుసార్లు పెంచింది కేంద్రం. మొదట మార్చిలో రూ.144 పెరగగా, ఏప్రిల్‌ 1‌న దాదాపు రూ.200 మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరగడం, సరఫరా ఇబ్బందులు, పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు వంటి అంశాలు ఈ పెంపునకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. వాణిజ్య సిలిండర్‌ ‌ధరలు భారీగా పెరిగినా.. గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్‌ ‌ధరల్లో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సాధారణ ప్రజలకు కొంత ఊరట లభించింది. గృహ వినియోగ సిలిండర్‌ ‌ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా ప్రజలపై ఆర్థిక భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదిలా ఉండగా.. పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌రిటైల్‌ ‌ధరలు కూడా యథాతథంగా ఉన్నాయి. మరోవైపు, విమానయాన రంగానికి పెద్ద ఊరటనిస్తూ దేశీయ విమానయాన సంస్థలకు ఏవియేషన్‌ ‌టర్బైన్‌ ‌ఫ్యూయల్‌ ‌ధరల్లోనూ కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
————-
గ్యాస్‌ ‌ధరల పెంపు..ఎలక్షన్‌ ‌బిల్లు : రాహుల్‌ ‌విమర్శలు 

దేశంలో వాణిజ్య గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరలు రూ.993 మేర పెరగడంపై కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. త్వరలో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌వంతు వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల తరువాత ధరాభారం పెరుగుతుందని తాను ముందే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది ఎలక్షన్‌ ‌బిల్లు అని వ్యాఖ్యానించారు. ఎక్స్ ‌వేదికగా ఈ మేరకు పోస్టు పెట్టారు. కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ‌ధర మునుపెన్నడూ చూడని స్థాయిలో ఒక్కసారిగా పెరిగాయని రాహుల్‌ ‌గాంధీ విమర్శించారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ రూ.1380ల మేర ధర పెరిగిందని అన్నారు. కేవలం మూడు నెలల్లోనే ధర 81 శాతం మేర పెరిగిందని వివరించారు. ఎన్నికల తరువాత ఇలా జరుగుతుందని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. ’టీ స్టాల్స్, ‌ధాబాలు, బేకరీ, స్వీట్‌ ‌షాపులు.. ఇలా అందరిపైనా భారం పెరిగింది. చివరకు  ఆహార ఖర్చులపైనా ప్రభావం పడుతుంది. మొదట ఎల్‌పీజీ గ్యాస్‌ ‌వంతు.. ఆ తరువాత పెట్రోల్‌-‌డీజిల్‌ ‌ధరల వంతు వస్తుంది’ అని అన్నారు. ఎన్నికలు ముగిశాక దేశంలో పెట్రోల్‌ ‌ధరలు పెరుగుతాయని రాహుల్‌ ‌గాంధీ మంగళవారం పేర్కొన్నారు. ’అలర్ట్‌గా ఉండండి.. ఎన్నికల వల్ల కలిగిన ఉపశమనం ఇక ముగిసినట్టే. ఇంధన ధరలు తక్కువగా ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వం లాభాలను దండుకుంది. ఇప్పుడు ధరలు పెరిగాయి కాబట్టి ధరాభారాన్ని ప్రజలపై పెడుతుంది’ అని రాహుల్‌ అప్పట్లో విమర్శించారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *