– వంద రోజుల్లో చెల్లింపునకు యత్నాలు
– అధికారుల కమిటీ నివేదిక రాగానే పీఆర్సీపై నిర్ణయం
– జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులు అందిస్తాం
– మీ సమస్యల పరిష్కారం బాధ్యత మాది
– ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో సీఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం.. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో ఆయన శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాలుగు అంశాలపై ఉద్యోగ సంఘాలకు సీఎం రేవంత్ స్పష్టత ఇచ్చారు. వంద రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ.6 వేల కోట్లు చెల్లిస్తామన్నారు. పీఆర్సీపై తక్షణమే నివేదిక అందించాలని అధికారుల కమిటీని ఆదేశించామని, దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని, జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులను ఉద్యోగులకు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పనిచేశారని, మీ సహకారంతోనే సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నామని, ప్రతి నెలా మొదటి తేదీనే వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించామని, బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించామని, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తిచేశామని వివరించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కార్డుల ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ రెండేళ్లలో ప్రజా ప్రభుత్వంలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని చెప్పారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అందించే రూ.6 వేల కోట్ల నిధుల ఖర్చు ప్రాధాన్యతల నిర్ణయం మీదేనన్నారు. ప్రతీ రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై తమ సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని సీఎం సూచించారు.
ఉద్యోగ సంఘాల నాయకుల ధన్యవాదాలు
ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం గతంలో చాలావరకు పరిష్కరించిందని గుర్తుచేసుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వైద్య విధాన పరిషత్‌లో 13,100 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. పీఆర్సీ, హెల్త్ కార్డుల సమస్యలతోపాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని సీఎంకు ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పెండింగ్ సమస్యలు చాలావరకు పరిష్కరించాం : డిప్యూటీ సీఎం భట్టి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను చాలా వరకు పరిష్కరించామని తెలిపారు. మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి ఉద్యోగుల పెండింగ్ బిల్లులు లేకుండా చూస్తామన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో రూ.వేల కోట్ల బిల్లులు పేరుకుపోయాయని తెలిపారు. వీటిపై కసరత్తు చేసి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. వంద రోజుల్లో దాదాపు రూ.6 వేల కోట్లు పెన్షనర్ బకాయిలు క్లియర్ చేయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి ఉద్యోగులపై ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవీయ దృక్పథంతో ఆలోచించారని, మీ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నారని వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





