“ఒకవైపు 60 ఏళ్లు దాటిన వారికి కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సవాలక్ష నిబంధనలు విధిస్తాయి. “తిరిగి చెల్లించే సామర్థ్యం” లేదనే నెపంతో వారిని ఆర్థికంగా అంటరానివారిగా చూస్తాయి. కానీ, అదే బ్యాంకులు వృద్ధులు దాచుకున్న సొమ్మును మాత్రం ఆప్యాయంగా స్వీకరిస్తాయి. భారతదేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్లలో దాదాపు 30 నుండి 40 శాతం వరకు సీనియర్ సిటిజన్లవే ఉంటాయి. తమ జీవిత కాల కష్టార్జితాన్ని, పదవీ విరమణ ప్రయోజనాలను భద్రత కోసం బ్యాంకులకే అప్పగిస్తారు.బ్యాంకులు ఈ భారీ మొత్తాలను తక్కువ వడ్డీకే సేకరించి, వాటిని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడులుగా, రుణాలుగా ఇచ్చి వేల కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నాయి. అంటే, వృద్ధుల సొమ్ము బ్యాంకులకు ఆర్థిక ఇంధనంలా పనిచేస్తోంది. వారి సొమ్ముతో లాభాలు పండిస్తున్న బ్యాంకులు, తిరిగి వారికే సేవలు అందించేటప్పుడు మాత్రం ముఖం చాటేస్తున్నాయి..”
- వ్యవస్థల నిర్లక్ష్యానికి బలి అవుతున్న అనుభవజ్ఞులు
- బ్యాంకింగ్ వైరుధ్యం.. పెట్టుబడికి ఓకే.. భరోసాకు నో!
- ఇన్సూరెన్స్ లెక్కల్లో మసకబారుతున్న మానవత్వం
భారతదేశం వంటి సువిశాల దేశంలో, అందునా గ్రామీణ నేపథ్యం అధికంగా ఉన్న సమాజంలో ఒక సామాన్యుడికి విశ్రాంతి అనేది కేవలం ఒక నిఘంటువులోని పదం మాత్రమే తప్ప వాస్తవ జీవితంలో ఎక్కడా కనిపించదు. జీవితాంతం కష్టపడి, కుటుంబం కోసం, సమాజం కోసం తన రక్తాన్ని చెమటగా మార్చిన ఒక రైతు లేదా అసంఘటిత రంగ కార్మికుడు, వయస్సు పండిన వేళ ప్రశాంతంగా గడుపుతాడని భావిస్తే అది కేవలం ఒక భ్రమ మాత్రమే అవుతుంది. దురదృష్టవశాత్తు మన పరిపాలనా వ్యవస్థలు, బీమా కంపెనీలు మరియు బ్యాంకింగ్ నిబంధనలు ఒక మనిషి సామర్థ్యాన్ని అతని పుట్టిన తేదీని బట్టి నిర్ణయిస్తున్నాయి. ముఖ్యంగా అరవై ఏళ్లు నిండిన వారు ఒక్కసారిగా ప్రభుత్వ పరంగా లభించే అనేక బీమా సౌకర్యాలు, ఆర్థిక వెసులుబాటులకు దూరం కావడం అనేది నేడు సామాజికంగా పెను సవాలుగా మారింది.
ఒక వ్యక్తికి అత్యంత ఆసరా, భద్రత, ఆర్థిక స్థిరత్వం అవసరమైన వయస్సులోనే, వ్యవస్థలు అతన్ని ‘పథకాలకు అనర్హుడు’గా ముద్రవేసి పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నది నేడు ప్రతి పౌరుడిని వేధిస్తున్న ప్రశ్న. మన దేశంలో వృద్ధాప్యం అనేది ఒక గౌరవప్రదమైన దశగా ఉండాల్సింది పోయి, కేవలం ప్రభుత్వ రికార్డుల్లో నిలిచిపోయే ఒక కాలపరిమితిగా మారిపోవడం బాధాకరం. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తే, అరవై ఏళ్లు నిండిన మరుసటి రోజే ఆ వ్యక్తి రక్షణ కవచం నుండి బయటకు నెట్టబడుతున్నాడు. ప్రమాదాలు సంభవించినప్పుడు లేదా ఆకస్మికంగా మరణించినప్పుడు ఆ వయస్సులో ఉన్న వారి కుటుంబాలకు జరిగే నష్టాన్ని పూడ్చేందుకు ఏ చట్టమూ ముందుకు రాకపోవడం గమనార్హం.
కేతిక నిబంధనల వెనుక మసకబారుతున్న మానవత్వం
ఈ వివక్షకు ప్రధాన కారణం ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు ప్రభుత్వం మధ్య ఉండే సాంకేతిక ఒప్పందాలు. ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం, 60 ఏళ్లు దాటిన వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని భావించే ‘యాక్చురియల్’ లెక్కలే ఈ అన్యాయానికి పునాది. 18 నుండి 59 ఏళ్ల వరకు తక్కువ ప్రీమియంతో బీమా కల్పించే కంపెనీలు, 60 దాటిన వారిని ‘హై రిస్క్’ కేటగిరీలో చూస్తాయి. ఈ వయస్సు వారిని కూడా పథకంలో చేర్చుకుంటే ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం భారం అనేక రెట్లు పెరుగుతుందని, ఆ ఆర్థిక భారాన్ని మోయలేక పాలకులు కఠినమైన వయస్సు పరిమితులను విధిస్తున్నారు.
రైతు బీమా వంటి పథకాలు ఆగిపోవడానికి ఇదే ప్రధాన కారణం.నిజానికి, వయస్సు పెరిగే కొద్దీ ప్రమాదాలు లేదా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి ఆ సమయంలోనే బీమా రక్షణ మరింత అవసరం. కానీ, వ్యవస్థలు మాత్రం లాభనష్టాల లెక్కలకే ప్రాధాన్యత ఇస్తూ మనిషి ప్రాణానికి ఉండే విలువను వయస్సుతో ముడిపెడుతున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు తమ లాభనష్టాల లెక్కల్లో భాగంగా, మరణాల రేటు ఎక్కువగా ఉండే వయస్సు విభాగాలను మినహాయించడం వ్యాపారరీత్యా వారికి లాభదాయకం కావచ్చు కానీ, ఒక సంక్షేమ రాజ్యంలో ప్రభుత్వం కూడా అదే వ్యాపార దృక్పథంతో ఆలోచించడం పౌరుల పట్ల చూపే చిన్నచూపుకు నిదర్శనం. దశాబ్దాల పాటు పన్నుల రూపంలోనో, శ్రమ రూపంలోనో దేశ నిర్మాణంలో భాగస్వామి అయిన వ్యక్తికి, అరవై ఏళ్లు రాగానే భద్రతను నిరాకరించడం సామాజిక వివక్షకు పరాకాష్ట.
బ్యాంకింగ్ వైరుధ్యం.. పెట్టుబడికి ఓకే.. భరోసాకు నో!
వృద్ధుల పట్ల బ్యాంకింగ్ రంగం అనుసరిస్తున్న విధానం మరింత విస్మయానికి గురిచేస్తోంది. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒకవైపు 60 ఏళ్లు దాటిన వారికి కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సవాలక్ష నిబంధనలు విధిస్తాయి. “తిరిగి చెల్లించే సామర్థ్యం” లేదనే నెపంతో వారిని ఆర్థికంగా అంటరానివారిగా చూస్తాయి. కానీ, అదే బ్యాంకులు వృద్ధులు దాచుకున్న సొమ్మును మాత్రం ఆప్యాయంగా స్వీకరిస్తాయి. భారతదేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్లలో దాదాపు 30 నుండి 40 శాతం వరకు సీనియర్ సిటిజన్లవే ఉంటాయి.
తమ జీవిత కాల కష్టార్జితాన్ని, పదవీ విరమణ ప్రయోజనాలను భద్రత కోసం బ్యాంకులకే అప్పగిస్తారు.బ్యాంకులు ఈ భారీ మొత్తాలను తక్కువ వడ్డీకే సేకరించి, వాటిని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడులుగా, రుణాలుగా ఇచ్చి వేల కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నాయి. అంటే, వృద్ధుల సొమ్ము బ్యాంకులకు ఆర్థిక ఇంధనంలా పనిచేస్తోంది. వారి సొమ్ముతో లాభాలు పండిస్తున్న బ్యాంకులు, తిరిగి వారికే సేవలు అందించేటప్పుడు మాత్రం ముఖం చాటేస్తున్నాయి. వృద్ధులకు అత్యవసరంగా ఏదైనా రుణం కావాలన్నా, ఆరోగ్య సమస్యల కోసం ఆర్థిక సాయం కోరినా ఇన్సూరెన్స్ లేదనో, వయస్సు దాటిందనో సాకులు చెబుతున్నాయి. తమ సొమ్మును వాడుకుంటూ తమకే భద్రత కల్పించని ఈ వ్యవస్థలో వృద్ధులు తమ సొమ్మును ఉంచడం ఎంతవరకు ఉత్తమం అనే సందేహం కలగడం సహజం.
చట్టపరమైన పరిహారాల్లో కొనసాగుతున్న అన్యాయం
చట్టపరమైన పరిహారాల విషయంలో కూడా 60 ఏళ్లు దాటిన వారికి అన్యాయం జరుగుతోంది. ప్రమాద బాధితులకు నష్టపరిహారాన్ని లెక్కించేటప్పుడు ఉపయోగించే ‘మల్టిప్లైయర్’ విధానం వయస్సు పెరిగిన కొద్దీ పరిహార మొత్తాన్ని తగ్గిస్తుంది. దీని వెనుక ఉన్న క్రూరమైన తర్కం ఏమిటంటే, ఆ వ్యక్తిపై ఆధారపడే వారి సంఖ్య తగ్గిందని భావించడం. కానీ వాస్తవంగా నేటి ఆర్థిక పరిస్థితుల్లో వృద్ధులు కూడా కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఉన్నప్పటికీ, అసంఘటిత రంగంలోని కోట్లాది మందికి ఆ వెసులుబాటు లేదు. వారికి ఇచ్చే కొద్దిపాటి ‘ఆసరా’ పింఛన్లు ఆకలి తీర్చడానికే సరిపోతాయి తప్ప, అనారోగ్యం వంటి ఆపదలను తట్టుకోవడానికి ఏమాత్రం సరిపోవు. రాజకీయాల్లో వయస్సుతో నిమిత్తం లేకుండా పదవులు అనుభవిస్తున్న నాయకులు, సాధారణ పౌరుడి వద్దకు వచ్చేసరికి మాత్రం వయస్సు నిబంధనలు గుర్తుకు రావడం విడ్డూరం.
వృద్ధులు ‘మార్గదర్శకులు‘ కావాలి.. భారం కాదు
అరవై ఏళ్లు నిండిన వారు ఈ వ్యవస్థకు అవసరమా లేదా అన్నది ఒక పెద్ద చిక్కుముడిలా మిగిలిపోతోంది. ఒకవైపు అనుభవం పండిన వృద్ధులను ‘మార్గదర్శకులు’ అని గౌరవిస్తాం, మరోవైపు అదే వ్యక్తులను ప్రభుత్వ పథకాల నుండి ‘అనర్హులు’ అని తొలగిస్తాం. అంటే ఇక్కడ వయస్సు అనేది గౌరవానికి చిహ్నమా లేక పథకాలకు అనర్హతకు ప్రమాణమా అన్నది అర్థం కాని పరిస్థితి. ఒక మనిషి జీవించి ఉన్నప్పుడు భరోసా ఇవ్వని నిబంధనలు, ఆ మనిషికి వయస్సు అయిపోయిందని చెప్పి ఆదుకోకపోవడం సామాజిక న్యాయం అనిపించుకుంటుందా?రైతుకు భూమిపై ఉన్న హక్కుకు వయస్సుతో సంబంధం లేనప్పుడు, ఆ భూమిని కాపాడే రైతుకు ఇచ్చే బీమాకు మాత్రం వయస్సుతో నిబంధనలు ఎందుకు ఉండాలి? నిబంధనలు మనుషుల కోసం పుట్టాయా లేక మనుషులనే నిబంధనల కోసం బలి ఇస్తున్నారా అన్నది పాలకులకే ఎరుక. అరవై ఏళ్లు నిండిన వారు సామాజికంగా ఒక ఆస్తిగా మారాల్సిన చోట, కేవలం సాంకేతిక కారణాల వల్ల ఒక సమస్యగా మిగిలిపోవడం ఈ వ్యవస్థల వైఫల్యమే తప్ప వ్యక్తి లోపం కాదు.
ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. వయస్సు నిబంధనలను సడలించి, వృద్ధులకు ఇచ్చే గౌరవం కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపాలి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో వృద్ధుల డిపాజిట్లపై ప్రత్యేక రక్షణ, వారికి సులభంగా రుణాలు అందేలా నిబంధనల మార్పు తక్షణ అవసరం. దశాబ్దాల అనుభవం ఉన్న మేధస్సును, సమాజ నిర్మాణం కోసం అలిసిన దేహాలను గౌరవించని ఏ నాగరిక సమాజం కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లలేదు. పండిన అనుభవానికి భద్రత లేని చోట వ్యవస్థల మనుగడ ఎప్పుడూ ప్రశ్నార్థకమే.





