– 170 ఎకరాల ప్రభుత్వ భూమి పట్టా ఎలా అయ్యిందో..
– ఆర్డీవో, తహసీల్దార్ వేర్వేరు రిపోర్టులు ఇవ్వడం ఏమిటి?
– దీని వెనుక ప్రభుత్వ పెద్దలెవ బయటకు రావాలి
– బీఆర్ఎస్ నేత హరీష్‌రావు డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : ధాన్యం కొనుగోలు చేతగాదు.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాదు..కానీ ప్రభుత్వ భూములను అందినకాడికి కొల్లగొడుతున్నారంటూ కాంగ్రెస్ పాలకులపై అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ రూ.వెయ్యి కోట్ల స్కాంను ఆధారాలతో బయటపెడుతున్నామని, ‘సిట్’ లేదా సిఐడీ విచారణ జరిపి ప్రభుత్వ భూములను కాపాడాలని, ఇందులో ఉన్న పెద్దలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్లో 173 నుంచి 183 మధ్య ఉన్న భూమిలో 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. ఆ భూమి ప్రభుత్వ భూమి అని, ఆక్రమణకు గురికాకుండా ఉండాలని ఆర్డీవో తహసీల్దార్‌కు చెప్పారని, అంతేకాక ప్రొహిబిటరీ లిస్టు 22ఏలో పెట్టాలని ఆదేశించారని తెలిపారు. ఇదే విషయం జనవరి 30నాడు హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో పొందుపరిచారని, ఇది ప్రభుత్వ భూమి అని ఫ్రిబవరి 24నాడు తహసీల్దార్ తేల్చారని ఆయన చెప్పారు. నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 28న ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందుతుందని తహసీల్దార్ ఆర్డర్ పాస్ చేసిండంటూ నాలుగు రోజుల్లో ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి ఎలా అయ్యింది అని ప్రశ్నించారు. అంతేకాక ఈ భూమిని భూ భారతి ఆన్లైన్లో కూడా పెట్టండి అన్నరు.. ఆర్డీవో, తహసీల్దార్లు ఇద్దరూ భిన్నంగా వ్యవహరిస్తే జీపీ రెవెన్యూ హైకోర్టుకు ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. ఏ ఆర్డర్ అయినా కలెక్టర్ అప్రూవల్తో హైకోర్టుకు వెళ్లాల్సి ఉండగా కలెక్టర్ ఎలా అప్రూవల్ చేశారని నిలదీశారు. అడ్వకేట్ జనరల్ ఏరకంగా అప్రూవల్ చేశారన్నారు. ఇంత పెద్ద స్కాం జరిగితే అధికారులపై చర్యలు తీసుకోవడం లేదు.. పత్రికల్లో వస్తే ఈ కేసులో ఎమ్మార్వోను కలెక్టరేట్‌కు బదిలీ చేసి ఊరుకున్నరని ఆయన విమర్శించారు. ఏసీబీ అధికారులు దాడికి వెళ్లగా ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పారో కానీ ఏసీబీ వాపస్ వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి అతి సన్నిహితుడు ఇందులో ఉన్నడు కాబట్టే ఏసీబీ వెనక్కి వచ్చిందని, ఒత్తిడి కారణంగానే ఎమ్మార్వోను బదిలీ చేశారని ఆరోపించారు. ఎమ్మార్వోను కాపాడటంలో ఉన్న పెద్దలు ఎవరో బయటకు రావాలన్నారు. భూ భారతిలో భూమి చేరాలంటే దరఖాస్తు పెట్టాలి.. ఆర్డీవో దాన్ని అప్రూవ్ చేయాలని భూభారతి చట్టం చెబుతుండగా ఎమ్మార్వో భూ భారతిలో పెట్టాలని చెప్పగానే అది అందులో ఎంట్రీ అయిపోయింది అని చెప్పారు. 170 ఎకరాలు ప్రభుత్వ భూమి పట్టా అని ఎలా ఎంట్రీ వేశారు.. పత్రికల్లో రాగానే ఎమ్మార్వోను బదిలీ చేసి భూమి మ్యుటేషన్ చేసుకున్నరు.. ఎందుకు భూమిని వెనక్కి తీసుకోరు.. ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టరు అని ప్రభుత్వాన్ని హరీష్‌రావు ప్రశ్నించారు. మొత్తంగా పట్టా భూమిగా మార్చుకొని 170 ఎకరాలు ఎక్కించారన్నారు. దీని వెనుక కలెక్టర్ ఉన్నడా, ప్రభుత్వ పెద్దలు ఉన్నరా.. రాత్రికి రాత్రి ఎట్లా ప్రైవేటు భూమి అయ్యింది అని ప్రశ్నిస్తూ ఎమ్మార్వో, ఆర్డీవోను సస్పెండ్ చేయాలని, సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆర్డర్ మీద అప్పీల్‌కు వెళ్లాలని, ఆ భూమిని తిరిగి నిషేధిత జాబితో పెట్టాలని కోరారు. మీది నిజంగా ప్రజాపాలన అయితే, ఈ భూ కుంభకోణంలో భాగస్వామ్యం లేకపోతే, తప్పు చేయకపోతే తహసీల్దార్‌ను వెంటనే డిస్మిస్ చేయండి, ప్రభుత్వ భూమిని కాపాడండి అని మరోసారి డిమాండ్ చేశారు.
ఆర్టీసీ డ్రైవర్‌పై వేటు తగదు
జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్‌పై సస్పెన్షన్ వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన డ్రైవర్ కావచ్చు.. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ.. రైతుల కష్టాలు చూడలేక ఒక మాట మాట్లాడిండు.. డ్రైవర్ అశోక్ ధాన్యం కొనుగోలు చేయాలని మాట్లాడితే తప్పు ఎలా అవుతుంది అని హరీష్‌రావు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్చ ఉంటుంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తారా అని అడిగారు. ప్రశ్నించే హక్కు ఆరో గ్యారెంటీ అన్న మీకు ఇంత నియంతృత్వ వైఖరి ఎందుకు అని ప్రశ్నించారు. సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌కు అండగా బీఆరఎస్ ఉంటుందని, న్యాయపోరాటం, ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని స్పష్టం చేస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




