ఎక్కడి బస్సులు అక్కడే

– డిపోల ముందు ధర్నాలతో ఆర్టీసీ కార్మికుల నిరసన
– నగరంలో అద్దె బస్సులను నడిపిన ప్రభుత్వం
– ఆటోలు, క్యాబ్‌లకు పెరిగిన గిరాకీ
– కరీంనగర్‌లో లారీని ఢీకొట్టిన అద్దె బస్సు
– నగరంలో మెట్రో సర్వీసులను పొడిగించిన సర్కార్
– కార్మికుల సమస్యలపై సానుకూలంగా ఉన్నాం : ఎండీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు ఆయా డిపోలకే పరిమితం అయ్యాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. రహదారులపై బైఠాయించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో బస్సులు డిపోల్లో నిలిచిపోగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కార్మికుల సమ్మెతో పెద్దపల్లిలో 150 బస్సులు, మహబూబ్‌నగర్‌లో 112 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. కాగా, ప్రయాణికుల కోసం 16 విద్యుత్ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లో సమ్మె నేపథ్యంలో ప్రైవేటు డ్రైవర్‌తో నడిపిస్తున్న ఆర్టీసీ అద్దె బస్సు లారీని ఢీకొట్టింది. కరీంనగర్‌లోకి కోతిరాంపూర్ బైపాస్ వద్ద బస్సు అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంdం కాగా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. కాగా, శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడుపుతున్నందునే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
హైదరాబాద్ వంటి మహానగరంలో దాదాపు రోజుకు 25 లక్షల మంది ప్రజా రవాణాను వినియోగిస్తుండగా ఆర్టీసీ సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఆర్టీసీ అద్దె బస్సులను నడుపుతోంది. కండక్టర్ లేకుండానే వీటిని తిప్పుతోంది. పలుచోట్ల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తుండగా ఇదే అదనుగా వారు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైళ్ల సంఖ్య, ఫ్రీక్వెన్సీ పెంచాలని నిర్ణయించారు. సమ్మె ముగిసేవరకూ 56 మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. మియాపూర్- ఎల్.బి.నగర్ కారిడార్‌లో 4 నిమిషాల 20 సెకన్ల విరామంతో, నాగోల్- రాయదుర్గం కారిడార్‌లో 3 నిమిషాల 40 సెకన్ల విరామంతో రోజంతా గరిష్ఠంగా 56 రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. చివరి మెట్రో రైలు సర్వీస్ రాత్రి 11 గంటల తర్వాత కూడా పొడిగించేలా చర్యలు చేపట్టినట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉదయం నుంచి రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు తండోపతండాలుగా మెట్రో స్టేషన్లకు తరలివస్తున్నారు.
కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలం : ఆర్టీసీ ఎండీ 
కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కొన్ని సంఘాలు నిజాలను విస్మరించి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. అధికారులతో మంగళవారం చర్చలు విఫలం కావడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా బస్సులు నడపాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
డిపోల ఎదుట నేడు మహా ధర్నాకు జేఏసీ పిలుపు
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టీజీఎస్ ఆర్టీసీ ప్రారంభించిన సమ్మెను మరింత ఉదృతం చేసేందుకు ఆర్టీసీ జేఏసీ సన్నాహాలు ప్రారంభించింది. గురువారం అన్ని డిపోల ఎదుట మహా ధర్నాను నిర్వహించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఉదయం 5 గంటల నుంచి ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం, యాజమాన్యం సమ్మె డిమాండ్లను పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తూ దాటవేత ధోరణి అవలంబిస్తూ ప్రజలను, ఆర్టీసీ కార్మికవర్గాన్ని తప్పుదారి పట్టిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వం వేసిన కమిటీ అధికారులే ఇప్పటికిప్పుడు సమస్యలు పరిష్కరించలేమని చేతులెత్తేయడం వల్ల విధి లేని పరిస్థితుల్లో సమ్మెను ప్రారంభించవలసి వచ్చిందని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే వరకు, 2021 వేతన సవరణ 30 శాతం తగ్గకుండా అమలు చేసేవరకు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులను రద్దు చేసి ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేసే ఉత్తర్వులను రద్దు చేసే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, అన్ని యూనిట్లు, అన్ని వర్క్‌షాప్‌లలో మహా ధర్నాలను జయప్రదం జేయాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న కోరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ అమరవీరులకు నివాళులర్పించి సమ్మెను ముందుకు తీసుకెళ్తామని, కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాలయాపన కోసమే ప్రభుత్వం కమిటీ వేసిందని విమర్శించారు. కమిటీ అవసరం లేదని, తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే పక్రియను సర్కార్ వెంటనే ప్రారంభించాలని  డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలు సంపూర్ణంగా మద్దతిచ్చాయని, సమ్మెకు మంద కృష్ణ మాదిగ, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మద్దతు ఇస్తున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం తమను చర్చలకు ఆహ్వానించాలని, మరో సకల జనుల సమ్మె కాకుండా చూసుకోవాలని వెంకన్న హెచ్చరించారు.
——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *