ఎగువ రాష్ట్రాల జల దోపిడీ పక్కకు పోయింది! ఆల్మట్టి నిండితే గాని కిందకు వరద రావడం లేదు. ఎప్పుడైనా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ – 2 తీర్పు నోటిఫై జరిగితే కృష్ణలో 285 టియంసిలు ఎగువ రాష్ట్రాలకు పోతాయి!
కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు నిజమైనవి!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏ ఉద్దేశ్యంతో చెప్పారో గాని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక్క నదీ జలాల వివాదమే రావణ కాష్టంలాగా రగులుతోంది. తాజాగా గోదావరి జలాల వివాదంతో శృతి మించి రాగాన పడింది. ఈ పరిణామం ఎవరికీ శ్రేయస్కరం కాదు. ప్రజా జీవితంతో ముడి పడి వున్నందున జల వివాదాలు దురదృష్టం కొద్దీ రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలోనే కాకుండా సోదరులుగా మెలగ వలసిన ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య కూడా చిచ్చు రగిల్చే అవకాశం ఉంది . స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో పలు రాష్ట్రాలు విభజింపబడ్డాయి. కాని ఏ సందర్భంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడ లేదు.
కృష్ణ నదీ జలాల్లో తెలంగాణ వాటా తక్కువే!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా తక్కువే. బేసిన్ మొత్తం మీద పంపిణీలో జరిగిన అన్యాయమిది. లేదా ట్రిబ్యునల్ తీర్పుల సమయానికి ఆనాటి పాలకులు తెలంగాణ ప్రాంతంలో అనువైన ప్రాజెక్టులు నిర్మించక పోవడం. ఉమ్మడి రాష్ర విభజన సమయంలో జరిగిన అన్యాయం కాదిది. ఆ మాట కొస్తే అవశేష ఆంధ్ర ప్రదేశ్ లో కూడా సమతుల్యత లేదు. నిత్యం క్షామ పీడిత ప్రాంతమైన రాయల సీమకు ఇన్నేళ్లు గడిచినా న్యాయం జరగ లేదు. అటు దక్షిణ తెలంగాణకు ఇటు రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని ఇప్పటి పాలకులను నిందించి ప్రయోజనం లేదు. కోస్తా జిల్లాలకు ఏర్పడిన సౌలభ్యం బ్రిటీష్ కాలం నాటిది. ఫలితంగా వారికి నీటి వాటా సమృద్ధిగా లభ్యమైంది. పైగా బచావత్ ట్రిబ్యునల్ ను తప్పు పట్ట లేము. 1969 నాటికి నిర్మింపబడిన లేక నిర్మాణంలో వున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసింది. 1965 లో శ్రీ శైలం జలాశయం కేవలం జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగా కాకుండా సిద్దేశ్వరం వద్ద బహులార్థ సాధక ప్రాజెక్టుగా నిర్మించి వుంటే రాయలసీమ ఎడారిగా వుండేది కాదు.
కృష్ణా నదిలా కాకుండా ఏటా వందలాది టియంసిలు గోదావరి జలాలు సముద్రం పాలౌతున్నాయి. ఈ ఏడు గరిష్టంగా ధవళేశ్వరం బ్యారేజీ నుండి 4136. 96 టియంసిలు సముద్రంలో కలిశాయి. కాని ఆంధ్ర ప్రదేశ్ గోదావరి వరద జలాలు ఆధారంగా నిర్మించదలచిన గోదావరి బనకచర్ల అనుసంధానంపై తెలంగాణ అడ్డు చెప్పక తప్పని రాజకీయ పరిస్థితి తెలంగాణలో నెల కొని వుంది. కేంద్ర జల సంఘానికి డిపిఆర్ లు సమర్పించ కుండా ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ ముందుగా శ్రీ కారం చుట్టింది. ఇదే పంథా నేడు ఆంధ్ర ప్రదేశ్ చేపట్టింది. తమాషా ఏమంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది.
బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ – 2 తో లాభ పడిన కర్ణాటక
2014 లో రాష్ట్ర విభజన జరిగితే 2013 లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ – 2 తుది తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తమకు సమ్మతం కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు కెక్కి గెజిట్ నోటిఫికేషన్ జరగకుండా స్టే తెచ్చింది. ఫలితంగా ఇప్పటికీ 1975 లో వెలువడిన బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో వుంది. వాస్తవం చెప్పాలంటే తెలంగాణకు అన్యాయం జరిగినా రాయలసీమకు అపకారం జరిగినా బచావత్ ట్రిబ్యునల్ తప్పు కానేకాదు. 1969 నాటికి అమలులో వున్న లేదా ప్రారంభించిన పథకాలను ఆధారం చేసుకొని నీటి కేటాయింపులు చేసింది.. ఆనాటి పాలకులు అటు దక్షిణ తెలంగాణ ఇటు రాయలసీమకు ఆ లోపు అవసరమైన ప్రాజెక్టులు నిర్మించకుండా తీవ్ర అన్యాయం చేసిన మాట వాస్తవం. ఆ నెపం ఇప్పుడు అవశేష ఆంధ్ర ప్రదేశ్ భరించ వస్తోంది. అయితే 2013 లో తుది తీర్పు వెలువరించిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు తీవ్ర అన్యాయం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ తన తుది తీర్పు క్లాజ్ 14 (A) లో తను చేసిన కేటాయింపులు ఏ రాష్ట్రంలో గాని వినియోగంలో వుంటే సాధ్యమైనంత వరకు మార్పు చేయకూడదని పొందు పర్చిన అంశం దృష్టిలో పెట్టుకొని బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు జోలికి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వెళ్ల లేదు. 65 శాతం కింద నికర జలాలు 163 టియంసిలు సరాసరి కింద మిగులు జలాలు 285 టియంసిలు లెక్కించి మొత్తం 448 టియంసిలను అన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చుక్క మిగులు నీరు లేకుండా చేసింది. గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఇందుకు భిన్నంగా మిగులు జలాలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించు కొనే స్వేచ్ఛ ఇచ్చింది.
పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతలు భవిష్యత్తు ఏమిటి
ఇప్పటికే దాదాపు 27 వేల కోట్ల రూపాయలు వ్యయం చేయబడిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను నీటి కేటాయింపులు లేవని కేంద్ర జల సంఘం తిరస్కరించింది. అదే దారిలో డిండి ఎత్తిపోతల పథకం వుంది. ఇవి కాకుండా తెలంగాణకు చెంది ఏడెనిమిది పథకాలు డిపిఆర్ ఆమోదం పొంద వలసి వుంది. ఆంధ్ర ప్రదేశ్ కు చెంది మూడు నాలుగు పథకాలు పెండింగ్ లో వున్నాయి. పాలమూర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జూరాల నుండి శ్రీ శైలం జలాశయం మార్చి వివాదాస్పదం చేశారని ప్రతి పక్షంపై ఆరోపణ చేయడం పరిష్కార మార్గం కాదు. ఆంధ్ర ప్రదేశ్ తో సంప్రదింపులతోనే ఇచ్చి పుచ్చుకొనే ధోరణి ఒక్కటే పరిష్కార మార్గం. అంతే కాదు. మొన్న జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ అధికారులు సవాళ్లు విసురుకున్నారు. ఈ సందర్భంలో తెలంగాణ అధికారి ఒకరు తాము ప్రాజెక్టులు నిర్మించుతూ డిపిఆర్ లు పంపనపుడు మీరెందుకు ఫిర్యాదు చేయలేదని వాదించడం సరికాదు. ఇలా ఒకరి కొకరు సోదరులుగా వుండ వరసిన రాష్ట్రాలు పోట్లాడుకొంటూ వుంటే కేంద్రం నిరాదరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటం కుంటు పడుతుంది.కష్టమైనా నష్టమైనా రెండు తెలుగు రాష్ట్రాల ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించడమే ఈ రోజు రేపైనా ఉత్తమ మార్గం. దురదృష్టమో అదృష్టమే ప్రస్తుతం అందరూ కృష్ణ జలాలకు చెంది ట్రిబ్యునల్ తీర్పు కోసం వేచి వున్నారు. గోదావరి జలాలకు చెంది ఈ ప్రతి బంధకం లేదు. కనీసం గోదావరి జలాల వివాద పరిష్కారానికి ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరిపితే పరిష్కారం లభించక పోదు. క్షిపణి రాకెట్లతో పోరు సాగుతున్న గాజాలోనూ రష్యా యుక్రెయిన్ లాంటి యుధ్దాల విరమణ సంప్రదింపులతో సాధ్యమౌతున్నపుడు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ జల వివాదాలు చర్చలతో ఎందుకు పరిష్కారం కావు?
వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు