బీసీ రిజర్వేషన్లపై ఆయనకు చిత్తశుద్ధి లేదు..
ఇది మరోసారి నిరూపితమైంది..
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: బీసీ రిజర్వేషన్ల పేరు చెప్పి దిల్లీ జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాల ముసుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నాకు దిగడం 42 శాతం రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నంగానే భావిస్తున్నామని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్లు కల్పించడంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని, తాము ముందు నుంచీ చెబున్నది ఇప్పుడు మరోసారి నిరూపితమైందని తెలిపారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీలను కేవలం వోటుబ్యాంకుగానే చూస్తున్న రేవంత్ రెడ్డికి ఎంతసేపూ వారిని వాడుకొని వదిలేయాలన్న ఆలోచనే తప్పితే వారి అభివృద్ధి కాదని అన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని మీరు హామీ ఇచ్చి ఇప్పుడు కేంద్రంపై నెపం ఎలా నెడుతారు? బీసీ రిజర్వేషన్ల పెంపు మీ పరిధిలో లేకపోతే, ఎలా హామీ ఇచ్చారు? బీసీ రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేకనే రేవంత్ రెడ్డి ఈ డ్రామాలాడుతున్నారని, రేవంత్ రెడ్డి అసలైన బీసీ ద్రోహి అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీయే.. రేవంత్ రెడ్డి వెనకుండి ఈ డ్రామాలు ఆడిస్తున్నాడని విమర్శించారు.
ఒక బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అయితే జీర్ణించుకోలేక నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ అసభ్యకరంగా తూలనాడిన విషయాన్ని బీసీలు ఇంకా మరచిపోలేదని, మోదీ అనే ఇంటి పేరున్న వారంతా దొంగలే అంటూ రాహుల్ గాంధీ తన బీసీ వ్యతిరేకతను బాహాటంగానే చాటుకున్న విషయం అందరికీ తెలిసినదేనని అన్నారు. కాంగ్రెస్ ముందు నుంచీ బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటూ వొచ్చిందని, తొలి ప్రధాని నెహ్రూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారు. ఇందిరా గాంధీ కూడా బీసీ రిజర్వేషన్ల అమలును తొక్కిపెట్టారు. మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని నాటి ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రయత్నిస్తే, నాడు రాజీవ్ గాంధీ పార్లమెంట్ వేదికగానే తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. వారి వారసత్వంలోనే రాహుల్ గాంధీ బీసీ వ్యతిరేకతను నరనరాన నింపుకొన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డిని ముందు పెట్టి రాహుల్ గాంధీ డ్రామాలు ఆడిపిస్తున్నారు.
రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో అధికారంలోకి వొచ్చిన 6 నెలల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు, తర్వాత మరచిపోయారు. ప్రజల నుంచి ముఖ్యంగా బీసీల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో మరో గత్యంతరం లేక 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పాస్ చేశారు తప్పితే, బీసీల బాగుకోరి కాదు. బీసీ సంక్షేమం కోసం ఏడాదికి రూ.20,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్ లలోనూ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సమగ్ర సర్వేలో బీసీల జనాభా 46% అని చెబుతున్నారు, మీ మంత్రివర్గంలో 46 శాతం బీసీలు ఉన్నారా? సగానికి పైగా ఉన్న బీసీలకు మీరిచ్చిన మంత్రి పదవులు రెండంటే రెండేనని అన్నారు. . దీనిని బట్టే బీసీల మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తున్నదని అన్నారు. ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్నారు,
మరి ఏమైంది? ఇంకెప్పుడు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తారు? రేవంత్ రెడ్డి బీసీలకు చేసిన మోసాల చిట్టా చాలా పెద్దది. నరేంద్ర మోదీ ప్రభుత్వం బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తోంది. బీసీ జాతీయ కమిషన్ కు రాజ్యాంగబద్ధతను కల్పించింది మోదీ ప్రభుత్వమే. మోదీ విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేస్తున్నారు. బీసీలకు స్కాలర్‌షిప్స్ పెంచారు, అనేక పథకాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చారు. మోదీ ప్రభుత్వం చొరవ వల్ల విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది. బీసీ ద్రోహులైన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బీసీలపై కపటప్రేమ ప్రకటిస్తూ.. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలనుంచి ప్రజల దృష్టి మళ్లించే రాజకీయ కుట్రలు చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.





