– 30 నెలల్లోనే 24 సార్లు మేజర్ బదిలీలు
– కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం
– బంగ్లాదేశ్, రోహింగ్యాల ఓట్లు తొలగించాలి
– బీజేపీ ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కనీస పట్టు సాధించలేకపోయారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్వయంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విద్యా, హోం, మున్సిపల్ శాఖలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని, రాష్ట్రంలో అభివృద్ధి అనేది మచ్చుకైనా కనిపించడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాసమస్యల పరిష్కారం, సంక్షేమాన్ని విస్మరించి,ఎంతసేపూ తమ హైకమాండ్ మెప్పు కోసం ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకుని తన పదవిని కాపాడుకోవడంపైనే ఆరాటపడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పాలన ఏ రకంగా పడకేసిందో చెప్పడానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలే నిదర్శనమని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ 30 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో 24 సార్లు మేజర్ బదిలీలు చేపట్టడం దారుణమన్నారు. సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల అధికారులు ఒక జిల్లాలో లేదా ఒక శాఖలో స్థిరపడి పాలనపై దృష్టి పెట్టి పట్టు సాధించుకునే లోపే మళ్ళీ బదిలీ వేటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ వంటి పెద్ద జిల్లాల కలెక్టర్లను ఒకటి కంటే ఎక్కువసార్లు బదిలీ చేశారంటే, ప్రభుత్వానికి అధికారులపై నమ్మకం లేదనే విషయం స్పష్టమవుతోంది. దీనివల్ల అధికార యంత్రాంగం పనులపై దృష్టి పెట్టలేకపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సచివాలయానికి రావడం చాలా అరుదుగా మారిందని, 71 సార్లు దిల్లీ పర్యటనలు చేయడాన్ని చూస్తుంటే రాష్ట్ర పాలన సచివాలయం నుండి జరుగుతున్నదా, దిల్లీ నుండి జరుగుతుల్ణన్నదా లేదా దారుస్సలాం నుండి జరుగుతుశ్రీష్ట్రశ్రీదా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని ఎద్దేవా చేశారు.మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలు సైతం డ్రగ్ మాఫియా గుప్పిట్లోకి వెళ్ళిపోయాయని డా. కె. లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలి నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయని తెలిపారు.
భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల ప్రక్షాళన (ఎసఐఆర్) ప్రక్రియను తెలంగాణలోని కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు తమ రాజకీయ మనుగడ కోసం వివాదాస్పదం చేస్తూ, ప్రజలను గందరగోళపరుస్తున్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఆ పార్టీ నాయకులు కేవలం మజ్లిస్ ప్రాపకం కోసం బాధ్యతారహిత వ్యాఖ్యలు చేస్తూ ఓటర్ల ప్రక్షాళనను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ‘ఒక వ్యక్తికి ఒకే ఓటు’ ఉండాలనేది చట్టబద్ధమైన విధానమని, బోగస్ ఓట్లు, దొంగ ఓట్లను తొలగించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు పెద్దఎత్తున చొరబడి దొంగ ఓట్లు పొందితే, వారికి ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కేవలం ముస్లిం ఓట్ల కోసం మజ్లిస్‌కు వంతపాడుతూ దొంగ ఓట్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.ఈ ప్రక్రియ జూన్ 24న ప్రారంభమై జులై 24తో ముగుస్తుందని, అయితే హైదరాబాద్‌లోనే 40% ఇళ్లకు ఇంకా ఎన్రోల్మెంట్ ఫామ్స్ అందలేదని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందన్నారు. బీఎల్ ఓలు అధికార పక్షం మరియు ఎంఐఎం ఒత్తిళ్లకు లొంగిపోయి మసీదుల్లో ఏర్పాటు చేసిన క్యాంపుల్లోనే ఫారాలు తీసుకుంటున్నారని ఫైరయ్యారు. పాతబస్తీలో చట్టం చెల్లదనే రీతిలో మజ్లిస్ నేతలు ప్రవర్తిస్తున్నారని, కరెంట్ బిల్లులు, పన్నులు కట్టాల్సిన అవసరం లేదని, దారుస్సలాం అనుమతి లేనిదే మంత్రులు కూడా పాతబస్తీకి రాలేరని అక్బరుద్దీన్ ఒవైసీ బాహాటంగా మాట్లాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మూగప్రేక్షకుడిగా మారిందని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకుని, బంగ్లాదేశీయులు, రోహింగ్యాల బోగస్ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజల విజ్ఞప్తి మేరకు జూలై 24 గడువును మరింత పెంచి, పారదర్శకంగా ఓటర్ల జాబితాను రూపొందించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ గాలికొదిలేసిందని లక్ష్మణ్ విమర్శించారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా దొడ్డిదారిన గెలవాలని మజ్లిస్ ప్రేరణతో హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేసి కాంగ్రెస్ కుట్రలు చేసిందని, కానీ బిజెపి ఈ ఎన్నికలను ఒక సవాలుగా తీసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన నమ్మకద్రోహాన్ని ప్రజా క్షేత్రంలో ఎండగడతామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




