– రాజేందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి తోడు దొంగలు
– ‘కుడా’ స్థలాలను పెద్దలకు కట్టబెట్టే యత్నం
వరంగల్, ప్రజాతంత్ర, జూలై 7: కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా’)లో సుమారు రూ.70 కోట్ల అవినీతి జరిగిందని, దేవుడి భూమి అయిదెకరాలను స్టార్ హోటల్‌కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నార అసెంబ్లీలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. ‘కుడా’ ఆధ్వర్యంలో కుంటలను కబ్జాలు చేసి బిల్డర్లకు కట్టబెడుతున్నారన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్‌సీయూలో ఏ విధంగా చేశారో వరంగల్‌లోనూ అదేవిధంగా చేస్తున్నారని తెలిపారు. ‘కుడా’ చైర్మన్ వెంకట్రామిరెడ్డి భుజంపై తుపాకీ పెట్టి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కాలుస్తున్నారన్నారు. ‘కుడా’ టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి సంస్థకు చెందిన స్థలాలను వేలం పెట్టి విలువైన భూములను తమ వారికి ఇప్పించుకున్నారని కూడా ఆరోపించారు. రెండున్నర ఎకరాల ప్రైమ్ ల్యాండ్‌ను అప్పటి కలెక్టర్ ఆమ్రపాలి ‘కుడా’కు అప్పగించారని, ఇప్పుడు ఆ స్థలాన్ని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ‘కుడా’ చైర్మన్ ఎనిమిది ప్లాట్లుగా చేసి వేలం పెట్టారని తెలిపారు. గజం రూ.65 వేలకు నిర్ణయించారని, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సిండికేట్ ఏర్పాటు చేసి అదనంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. 6,697 గజాలను వేలంలో పెడితే రూ.100 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ.49 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని ఆయన చెప్పారు. నర్సంపేట రోడ్డులో కమర్షియల్ ప్లాట్‌కు గజం రూ.85 వేలు నిర్ణయించారని, ‘కుడా’కు రూ.70 కోట్ల నష్టం చేశారని అన్నారు. ‘కుడా’ చైర్మన్‌గా తాను ఉన్నప్పుడు ఒక్క గజం కూడా తక్కువ రేటుకు అమ్మలేదన్నారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు తోడేళ్ళలా దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ‘కుడా’ వేలాన్ని రద్దు చేసి ఆన్‌లైన్ టెండర్ల ద్వారా వేలం ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు. గజం రూ.70 వేలు ఇవ్వడానికి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఎవరు అని ప్రశ్నించారు. ‘కుడా’ ఏమైనా రాజేందర్ రెడ్డి సొంత ఆస్తినా.. ‘కుడా’పై రాజేందర్ రెడ్డికి ఏం అధికారం ఉంది అని వినయ్‌భాస్కర్ నిలదీశారు. రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక వరంగల్ వెస్ట్‌లో ఒక్క అంగుళం అభివృద్ధి జరగలేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన ‘కుడా’ అభివృద్ధిపై చర్చకు సిద్దం అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో మున్సిపల్, హోం శాఖ మంత్రి లేరు.. రేవంత్ రెడ్డి పరివారం రాష్ట్రాన్ని దోచుకుంటోందని వినయ్ భాస్కర్ ఆరోపించారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నారు. విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





