– రూ.338 కోట్లతో నాలుగు లేన్ల ఆధునిక రహదారులు
– నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి
రంగారెడ్డి, ప్రజాతంత్ర,జూలై 7: ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లో హైబ్రిడ్ అన్యుటీ మోడల్ విధానంలో రూ.338 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆధునిక నాలుగు లేన్ల రహదారుల నిర్మాణ పనులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, ఇబ్రహీంపట్నం ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తనపై ఉంచిన విశ్వాసం వల్లే రాష్ట్రంలో కీలకమైన రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా సేవ చేసే అవకాశం లభించిందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటికే రూ.85 కోట్ల విలువైన రహదారి పనులు పూర్తి చేశామని, మరో రూ.275 కోట్లతో పలు రహదారి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అదనంగా రూ.100 కోట్ల విలువైన కొత్త రహదారి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, జాతీయ రహదారుల విస్తరణ, వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హాలన్నింటినీ అమలు చేస్తూ రాష్ట్రాన్నిమరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎంపీచామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.338 కోట్లతో 140కు పైగా రహదారి పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాలు, బస్తీల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌గా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. లక్ష్మీరెడ్డి పాలెం వద్ద ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి రూ.338 కోట్ల విలువైన రహదారి పనులు మంజూరు కావడం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. ఇందులో సుమారు రూ.275 కోట్ల పనులు నేరుగా ఇబ్రహీంపట్నం పరిధిలో చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో 200 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, రహదారుల విస్తరణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే రూ.2,300 కోట్లతో సమీకృత మార్కెట్ ఏర్పాటు ద్వారా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమంతోపాటు అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, భవనాల శాఖ ద్వారా భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాన రహదారులను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయడం ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతోపాటు ఉపాధి, పెట్టుబడులు, ప్రాంతీయ అభివృద్ధికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జాయింట్ కలెక్టర్ చంద్రారెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
హ్యామ్ రోడ్ల నిర్మాణంతో మారనున్న రూపురేఖలు
హైదరాబాద్ : రాష్ట్ర రహదారుల నెట్‌వర్క్‌ను గతంలో ఎప్పుడూ లేనంతగా అత్యద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. హ్యామ్ రోడ్లకు ఇటీవల సిఎం శంకుస్థాపన చేయడంతో రాష్ట్రంలో రోడ్ల స్వరూపం మారబోతోందన్నారు. ఈ ప్రాంత ప్రజలతో తనకు ప్రత్యేకమైన, వెలకట్టలేని అనుబంధం ఉందని, గతంలో ప్రజలు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి తనను ఎంపీగా గెలిపించారని ఆయన కృతజ్ఞతతో గుర్తుచేసుకు న్నారు. ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడి సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, అందుకే రోడ్ల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ శ్రీకారం చుట్టామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల రూపురేఖల ను మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తోందని మంత్రి వివరించారు. మొత్తం రూ. 13,000 కోట్ల భారీ వ్యయంతో, 34 ప్యాకేజీల కింద, 6,092 కిలోటర్ల మేర విస్తరించిన 441 రోడ్లను హ్యామ్ విధానంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల నల్లగొండ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల దుగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించుకున్నామని ఆయన గుర్తుచేశారు. ప్రమాదాలు లేని క్వాలిటీ రోడ్లుగా వీటిని తీర్చిదిద్దుతామని, రోడ్లు రద్దీగా ఉండే హైదరాబాద్ రూరల్ సర్కిల్ 1 / 2 ప్యాకేజీల్లోనే దాదాపు 30 రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా తాజాగా రూ. 338 కోట్ల వ్యయంతో 149 కిలోటర్ల మేర విస్తరించే 14 రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఈ ప్రాంత ప్రజల మనిషిగా అద్దం లాంటి రహదారులను నిర్మించి తీరుతామని, ఈ రోడ్ల కనెక్టివిటీ ద్వారా రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని మంత్రి భరోసా ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.