– సబిత, సునీతలపై దాడి హేయం
– ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి
– స్పీకర్‌ను అడ్డు పెట్టుకుని చిల్లర రాజకీయాలు
– రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై అత్యంత హేయమైన దాడి అని, వారికి జరిగిన ఈ అవమానానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలపై జరిగిన దాడికి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. క్రిమినల్ మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి తెలంగాణకు రావడం ప్రజల దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. మహిళా నాయకులను చుట్టుముట్టి లాగడం, గొంతు పట్టుకోవడం, చీర లాగడం ద్వారా దుశ్శాసన పర్వానికి తెరలేపారన్నారు. ప్రభుత్వ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్సీ స్పష్టం చేశారని, స్పీకర్ బాధపడి ఉంటే వ్యాఖ్యలను ఉపసంహరించుకుని విచారం వ్యక్తం చేశారని తెలిపారు. కేసీఆర్ ఇంటిపైకి కాంగ్రెస్ గూండాలను ప్రభుత్వం పోలీసు ఎస్కార్ట్‌తో పంపిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మరణాన్ని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధన కోసం 14 ఏళ్ల ఉద్యమం చేసిన కేసీఆర్ చావాలని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. రైతుబంధు ద్వారా 70 లక్షల మంది రైతులకు కేసీఆర్ అండగా నిలిచారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడం, బహిష్కరించడం ద్వారా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థలపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి అరెస్టు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు టార్గెట్ కేసీఆర్ లేదా ఎమ్మెల్సీలకు పదవులు లేకుండా చేయడమేనన్నారు. నిషేధిత జాబితా భూములు, విద్యార్థుల రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై చర్చకు డిమాండ్ తమను అడ్డుకునేందుకు పోలీసులను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లోనే కాంగ్రెస్ కార్యకర్తలతో దాడి చేయించే ప్రయత్నం జరిగిందని కూడా ఆరోపించారు. పోలీస్ యంత్రాంగం ఆదేశాలను గౌరవిస్తూ ఉన్న తమపై పోలీస్ స్టేషన్‌లోనే దౌర్జన్యానికి ప్రయత్నించారని విమర్శించారు. రాజ్యాంగం, చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రభుత్వానికి గౌరవం లేదని విమర్శించారు.
ప్రజలకు అండగా నిలిచిన కేసీఆర్
కేసీఆర్ హయాంలో కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్ల ద్వారా ప్రజలకు అండగా నిలిచారని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల ఆకాంక్షలను నెరవేర్చారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా కేటీఆర్ అభివర్ణించారు. 420 హామీలు ఇచ్చి వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిన హామీలపై నిలదీశారు. మహిళలకు రూ.2,500, తులం బంగారం, రైతులకు రూ.15,000 రైతు భరోసా హామీలపై ప్రశ్నలు కురిపించారు. రైతు కూలీలు, కౌలు రైతులు, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలు ఏమైందని నిలదీశారు. రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.4,000 హామీలపై, యువతకు స్కూటీల హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేదలు 420 హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామని చెప్పి మూడేళ్లు దాటినా అమలు చేయకపోవడంపై నిలదీశారు. రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని, జీఆరఎంబీ, కేఆరఎంబీ వ్యవహారాల్లో తెలంగాణ నీటిని ఆంధ్రాకు తరలించేందుకు అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు నీటి షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 510 అడుగుల నీటిమట్టం వద్ద కూడా సాగర్ నుంచి నీరు అందించారని గుర్తుచేశారు. 530 అడుగుల నీటిమట్టం ఉన్నప్పటికీ సాగర్ ఆయకట్టు రైతులకు నీరు ఎందుకు ఇవ్వడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కన్నెపల్లి పంపులు ఎప్పుడు ఆన్ చేస్తారో, కాళేశ్వరం నీళ్లు ఎప్పుడు వస్తాయో చెప్పాలన్నారు. కాళేశ్వరంపై క్షుద్ర రాజకీయాలు పక్కనపెట్టి రైతుల ప్రయోజనాల కోసం ప్రాజెక్టును వినియోగించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. మిగిలిన 823 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





