ఉమ్మడి ఖమ్మం రహదారులు అభివృద్ధి చేయండి

-కేంద్ర మంత్రికి మంత్రి తుమ్మల లేఖ

ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 15 :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి, ప్రయాణికుల భద్రత లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత-జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీకి నాలుగు ప్రత్యేక లేఖలు  రాశారు. ఖమ్మం-అశ్వారావుపేట రహదారి నాలుగు వరుసలుగా మార్పు, ఖమ్మం ఔటర్ బైపాస్‌లో మిగిలిన లింకు మంజూరు, కొత్తగూడెం-పాల్వంచ పట్టణాలకు బైపాస్ నిర్మాణం, భద్రాచలం పట్టణానికి బైపాస్ మంజూరుపై ఈ లేఖల్లో ఆయన వివరించారు.

భద్రాచలం పట్టణానికి బైపాస్

ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సహా పలు ఉత్తరాది రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి-30 ప్రస్తుతం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఉన్న భద్రాచలం పట్టణం నడిబొడ్డు గుండా వెళ్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. ఇసుక లారీలు, పారిశ్రామిక, వ్యవసాయ వాహనాలతో పాటు ఏటా భారీ సంఖ్యలో వచ్చే భక్తుల రద్దీ కలగలిసి తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. 10 కిలోమీటర్ల పరిధిలోనే తొమ్మిది ప్రమాద ప్రాంతాలు (బ్లాక్‌స్పాట్లు) ఏర్పడి, ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన పండుగల సమయాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం భారీ వాహనాలను గంటల తరబడి నిలిపివేయాల్సి రావడంతో భక్తులకు తీవ్ర అసౌకర్యం, సరుకు రవాణాకు ఆలస్యం, రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల భద్రాచలం కరకట్ట మీదుగా ప్రత్యామ్నాయ హైవే నిర్మాణ ప్రతిపాదన తెరపైకి వచ్చినా, దానికి రూ.120 కోట్ల భారీ వ్యయం అవుతుందని మంత్రి గుర్తుచేశారు. అదే భద్రాచలం పట్టణానికి ప్రత్యేక బైపాస్ రోడ్డు నిర్మిస్తే కేవలం రూ.25 కోట్లతోనే పూర్తి చేయవచ్చని, ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఈ బైపాస్‌తో దీర్ఘకాలిక ట్రాఫిక్ రవాణాకు, ముఖ్యంగా భారీ వాణిజ్య వాహనాలకు పట్టణం గుండా వెళ్లే అవసరం తప్పుతుందని, భక్తులకు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తుందని, ప్రమాదాలు గణనీయంగా తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుందని, సరుకు రవాణా మెరుగుపడి ప్రాంత పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎన్‌హెచ్-30 వ్యూహాత్మక ప్రాధాన్యతను, భద్రాచలంలో రహదారి భద్రత అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని బైపాస్ నిర్మాణానికి పరిపాలన, ఆర్థిక అనుమతులు తక్షణమే మంజూరు చేయాలని మంత్రి కోరారు.

ఖమ్మం-అశ్వారావుపేట నాలుగు వరుసలు

జాతీయ రహదారి 365బీబీలోని ఖమ్మం-అశ్వారావుపేట మార్గాన్ని, జాతీయ రహదారి 563లోని వరంగల్-ఖమ్మం మార్గాన్ని తొలుత నాలుగు వరుసలుగా విస్తరించాలని ప్రతిపాదించినట్లు మంత్రి గుర్తుచేశారు. అయితే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రస్తుత రహదారుల విస్తరణకు బదులు ఖమ్మం-దేవరపల్లి (365బీజీ), వరంగల్-ఖమ్మం (163జీ) పేరుతో కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ రహదారులను చేపట్టిందని తెలిపారు. దీంతో ప్రస్తుత 365బీబీ, 563 రహదారుల విస్తరణ పక్కనపెట్టినట్లు వివరించారు. ఖమ్మం, వెంకటాయపాలెం, తనికెళ్ల, కొణిజర్ల, పల్లిపాడు, వైరా, పినపాక, తల్లాడ, అంజనాపురం, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, గంగారం, మండలపల్లి, అశ్వారావుపేట తదితర జనావాసాల గుండా సాగే ఈ 122 కిలోమీటర్ల రహదారిపై ట్రాఫిక్ ఒత్తిడి కొనసాగుతుందని, సుమారు 40 బ్లాక్‌స్పాట్లు ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజా భద్రత, ప్రాంత అభివృద్ధి దృష్ట్యా ఈ మార్గాన్ని కేంద్ర రహదారుల శాఖకు (మోర్త్) తిరిగి అప్పగించి, నాలుగు వరుసల పనులకు ప్రత్యేక కేసుగా పరిగణించి మంజూరు చేయాలని కోరారు.

ఖమ్మం ఔటర్ బైపాస్‌ కు  7 కిలోమీటర్ల లింకు

గ్రీన్‌ఫీల్డ్ రహదారుల నిర్మాణంతో ఖమ్మం పట్టణానికి పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయ దిశల్లో బైపాస్ ఏర్పడిందని, సూర్యాపేట-ఖమ్మం నాలుగు వరుసల రహదారి, ఖమ్మం-కురవి (365ఏ) పనులతో ఉత్తర భాగం కూడా పూర్తవుతుందని మంత్రి తెలిపారు. దీంతో ప్రతిపాదిత ఖమ్మం ఔటర్ బైపాస్‌లో దాదాపు 80 శాతం సిద్ధమైందని, అయితే ఖమ్మం-కురవి మార్గానికి, వరంగల్-ఖమ్మం (163జీ) మార్గానికి మధ్య ఆగ్నేయ దిశలో 7 కిలోమీటర్ల కీలక అనుసంధాన లింకు మిగిలి ఉందని వివరించారు. ఖమ్మం-కురవి మార్గాన్ని అమరావతి-నాగపూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే లింకుతో అనుసంధానిస్తే ఖమ్మం చుట్టూ నిరంతర రింగ్ రోడ్డు పూర్తిస్థాయిలో సాకారమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ లింకు పూర్తయితే ఖమ్మం చుట్టూ అన్ని జాతీయ రహదారుల మధ్య నిరంతర అనుసంధానం ఏర్పడి, పట్టణంలోకి భారీ వాహనాల రాకపోకలు తగ్గి, రద్దీ, ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. గత రెండు వార్షిక ప్రణాళికల్లో ఈ ప్రతిపాదన చేర్చినా నిధులు మంజూరు కాలేదని గుర్తుచేస్తూ, ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో మిగిలిన లింకుకు ప్రాధాన్యతపై పరిపాలన, ఆర్థిక అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కొత్తగూడెం, పాల్వంచలకు బైపాస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల మీదుగా సాగే జాతీయ రహదారి 30, ప్రస్తుతం కొత్తగూడెం, పాల్వంచ పారిశ్రామిక పట్టణాల నడిబొడ్డు గుండా వెళ్తుండటంతో తీవ్ర ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలు, పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి తెలిపారు. ఇసుక లారీలు, పారిశ్రామిక, వ్యవసాయ వాహనాల రాకపోకలతో సుమారు 23 బ్లాక్‌స్పాట్లు ఏర్పడి ప్రాణనష్టం సంభవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరెల్లి -కొత్తగూడెం మధ్య ఎన్‌హెచ్-930 పూర్తయితే ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కారుకొండ, సూరారం, రామవరం, లక్ష్మీదేవిపల్లి, ఓల్డ్ పాల్వంచ, జగన్నాధపురం మీదుగా 25 కిలోమీటర్ల బైపాస్ నిర్మించి, ఎన్‌హెచ్-930పి, ఎన్‌హెచ్-30లను అనుసంధానించాలని మంత్రి తుమ్మల ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుతో రహదారి భద్రత మెరుగుపడటంతో పాటు, ప్రయాణ సమయం తగ్గి, పారిశ్రామిక, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని పేర్కొంటూ, ప్రాధాన్యతపై మంజూరు ఇవ్వాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *