దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలి : సుప్రీమ్‌ ఆదేశం

– అయోధ్య  రామాలయం విరాళాల చోరీ కేసులో.. 

న్యూదిల్లీ, జూలై 13 : అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ చోరీపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని అత్యున్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. వీటిని విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం.. పిటిషన్లపై స్పందించాలని కేంద్రంతో పాటు ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే ఆలయ నిర్వహణను చూస్తోన్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కూడా నోటీసులు ఇచ్చింది. సిట్‌లో భాగమైన సభ్యుల వివరాలను కూడా నివేదికలో ప్రస్తావించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌నేతృత్వంలోని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది. ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతా వాదనలు వినిపించారు. దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్‌ ‌రిపోర్ట్‌ను సీల్డ్ ‌కవర్‌లో సమర్పిస్తామని కోర్టుకు వెల్లడించారు. ఆ నివేదిక ప్రతిని తమకు కూడా ఇవ్వాలని పిటిషనర్లు కోరగా ఆ అభ్యర్థనకు వ్యతిరేకంగా మెహతా వాదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. మీకు చట్టం తెలుసు. ఎలాగైనా వారు ఆ రిపోర్ట్‌ను చూస్తారని స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది. అయోధ్య రామాలయ  విరాళాల చోరీ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో యూపీ ప్రభుత్వం ‘సిట్‌’ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లెక్కింపు సమయంలో పర్యవేక్షణ లోపాలను ‘సిట్‌’ ‌గుర్తించింది. అనంతరం పలు అరెస్టులు చోటుచేసుకున్నాయి. ఆ నేపథ్యంలోనే శ్రీరామ జన్మభూమి ట్రస్టు ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్‌ ‌రాయ్‌ ‌రాజీనామా చేశారు. అయితే, తనపై వస్తోన్న ఆరోపణలు నిరాధారమని ఆయన పేర్కొన్నారు.

సీబీఐ విచారణ కోసం 19న దిల్లీలో మౌన దీక్ష చేస్తా : వీహెచ్

భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 13 : అయోధ్య రామాలయం విరాళాల వ్యవహారంలో జరిగిన అవినీతిపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ చేపట్టాలనే డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు(వీహెచ్) భద్రాచలంలో రామాలయం వద్ద సోమవారం మౌన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు భారీగా భక్తులు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో బీజేపీ, విశ్వహిందూ పరిషత్, ఆరఎసఎస్‌లు కలిసికట్టుగా హుండీ, బంగారం వెండి తదితర సొమ్మును దోచుకున్నట్లు ఆరోపించారు. ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో డబ్బుచ సొమ్ము రూపేణ అయోధ్యకు సమర్పిస్తే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆ సొమ్మును ట్రస్ట్ కాజేసిందని విమర్శించారు. 20 తేదీన జరగనున్న పార్లమెంటు సమావేశాలకు ముందుగా 19వ తేదీన దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌన దీక్ష చేపడుతున్నట్లు వీహెచ్ తెలిపారు. అంతేకాక ఈ మౌన దీక్షకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ మౌన దీక్షకు భద్రాచలం నుంచి భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకటరావుతోపాటు మరికొందరు నాయకులు రానున్నట్లు తెలిపారు. రాముడు నడయాడిన భద్రాద్రిపై ఎందుకు వివక్ష చూపుతున్నారని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. ఏపీలో తిరుమల దేవస్థానంలో జరిగిన అవినీతిపై అక్కడి ప్రభుత్వం సిబిఐ విచారణ చేపట్టిందని, మరి దిల్లీ ప్రభుత్వం అయోధ్యలో జరిగిన అవినీతిపై ఎందుకు సీబీఐతో విచారణ జరిపించడం లేదని ఆయన ప్రశ్నించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *