బియ్యం ఎగుమతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు

– రాష్ట్రాన్ని ప్రపంచ బియ్యం ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దుతాం
– బియ్యానికి విలువ జోడిస్తే రైతులకు, రైస్ మిల్లర్లకు రెట్టింపు లాభాలు
– ఫోర్టిఫైడ్ రైస్ వంటి వినూత్న ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్‌ లక్ష్యం కావాలి
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 : బియ్యం ఎగుమతులను భారీ స్థాయిలో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను పరిశీలిస్తున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాన్ని దేశంలోనే కాక ప్రపంచ స్థాయి బియ్యం ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోనీ ఓ హోటల్‌లో కేసీపీ న్యూట్రీ సంస్థ రూపొందించిన మల్టీ విటమిన్ రైస్ ఉత్పత్తులను సోమవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న బియ్యానికి దేశీయ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది కానీ ఎగుమతుల కోసం కాదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానంతో ముందుకు వెళ్లి బియ్యం ఎగుమతులను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతోంది’ అని తెలిపారు. రాష్ట్ర రైతులు, రైస్ మిల్లర్ల ప్రయోజనాల కోసం దేశీయ మార్కెట్లతోపాటు విదేశీ మార్కెట్లను కూడా లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎగుమతులు చేపట్టే పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ

తెలంగాణ వ్యవసాయ రంగం సాధించిన ప్రగతిని వివరిస్తూ ఈ ఏడాది యాసంగి సీజన్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, అదే సమయంలో భౌగోళికంగా పెద్ద రాష్ట్రం అయిన ఏపీలో 25 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు మాత్రమే జరిగిందని మంత్రి తెలిపారు. ఇది తెలంగాణ వ్యవసాయ సామర్థ్యానికి, రైతుల శ్రమకు, తమ ప్రభుత్వ రైతు అనుకూల విధానాలకు నిదర్శనం అని అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు కోసం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఇప్పటికే రూ.19,303 కోట్లను నేరుగా జమ చేసినట్లు వెల్లడించారు. పారదర్శకతతో, వేగవంతంగా రైతులకు చెల్లింపులు జరిపిన రాష్ట్రంగా నిలిచిందన్నారు. వానాకాలం, యాసంగి సీజన్లను కలిపి చూస్తే రాష్ట్రంలో బియ్యం ఉత్పత్తి 300 లక్షల మెట్రిక్ టన్నులు (300 ఎలఎంటీలు) దాటిందని తెలిపారు. రాష్ట్ర ప్రజల వినియోగం ఏడాదికి 36 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండటంతో తెలంగాణ ఇప్పుడు మిగులు బియ్యం ఉత్పత్తి రాష్ట్రంగా ఎదిగిందని పేర్కొన్నారు.

విలువ జోడింతోనే భవిష్యత్తు

రైస్ పరిశ్రమ ఆధునిక సాంకేతికతను స్వీకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మల్టీ విటమిన్ రైస్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ మంచి ఆదరణ పొందే అవకాశముందని చెప్పారు ‘తెలంగాణలో మాత్రమే విక్రయాలపై ఆధారపడకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను లక్ష్యంగా చేసుకోవాలి.. రాష్ట్ర ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలు, విదేశీ మార్కెట్లకు చేరేలా ప్రభుత్వం అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తుంద’ని ఉత్తమ్ స్పష్టం చేశారు.

సాగునీటి విప్లవమే వ్యవసాయ విజయానికి పునాది

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ, సాగునీటి విస్తరణ, రైతులకు నిరంతర నీటి లభ్యత కల్పించడం వల్లే రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. సాగునీటి రంగంలో ప్రభుత్వం చేపట్టిన భారీ పెట్టుబడుల ఫలితంగానే దేశంలో అగ్రగామి ధాన్య ఉత్పత్తి రాష్ట్రంగా అవతరించినట్లు పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెరగడం, రైస్ మిల్లింగ్ పరిశ్రమ బలోపేతం కావడం, బియ్యం ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *