హరీష్‌రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది

– ప్రతీ ఎన్నికలో బీఆర్ఎస్‌కు ప్రజలు శిక్ష వేస్తూనే ఉన్నారు
– బీజేపీది ఆశ కాదు.. అత్యాశ
– రైతు భరోసా నిధులు వారం రోజుల్లో జమ
– రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 : బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు హరీష్‌రావు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయనకు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందనే అనుమానం కలుగుతోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలి అన్న హరీష్ రావు వ్యాఖ్యలపై పైవిధంగా స్పందించారు. ప్రజానీకం తమకు ఐదేళ్లకు అధికారమిచ్చారు.. రెండున్నరేళ్లకే ఎందుకు అసెంబ్లీని రద్దు చేస్తాం.. ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది అని తెలిపారు. గత రెండున్నరేళ్లలో జరిగిన ప్రతీ ఎన్నికలోనూ ప్రజల తీర్పు ఏవిధంగా ఉందో ఆయనకు తెలుసు.. ఇప్పుడు కొత్తగా వచ్చే తీర్పు ఏముంది అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం చేసే మంచి పనులను జీర్ణించుకోలేక భవిష్యత్తులో అధికారం దక్కదనే ఆవేశం, ఆక్రోశంతో కేటీఆర్ ఉక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారన్నారు. ‘తన నియోజకవర్గం పాలేరులో కేటీఆర్ విమర్శలు ఇదే కోవలోకి వస్తాయన్నారు. బీఆర్‌ఎస్ నాయకుల చిల్లర విమర్శలకు ప్రతిసారీ స్పందించను.. ఎప్పుడో ఒకసారి కచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతా. కేటీఆర్‌ను అరెస్టు చేస్తేనే బాంబులు పేలినట్టుకాదు. ప్రజలు ఛీకొట్టినా బాంబులు పడ్డట్టేనన్నారు. ఏ వ్యక్తిపైనా కక్షపూరితమైన చర్యలు తీసుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేద’ని చెప్పారు. వాళ్ళను జైలులో వేస్తేనే శిక్షించినట్లు కాదు.. ప్రతీ ఎన్నికలో వాళ్లను ఓడించి ప్రజలు శిక్షిస్తూనే ఉన్నారు.. తమిళనాడు లాంటి పరిస్ధితి ఈ రాష్ట్రంలో తీసుకురాము అని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తామని బీజేపీ పగటికలలు కంటోంది.. ఆశ ఉండడంలో తప్పులేదు కానీ ఆ పార్టీ అత్యాశకు పోతోంది అని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్ రాని పార్టీ అధికారం గురించి ఆశ పడుతోందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకే తాను ముక్కలన్నారు. కాళేశ్వరం అవినీతి, ధర్మల్ పవర్ ప్లాంట్ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని అడిగితే బీజేపీ ఇప్పటివరకు స్పందించలేదన్నారు. ఈసారి రైతు భరోసా నిధులను అనుకున్నదానికంటే రెండుమూడు రోజుల ముందే వారం రోజుల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటివరకు 18 నియోజకవర్గాలలో 23 స్ధలాలను గుర్తించామన్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. భూముల ధరల సవరణలు ఎక్కడైనా పొరపాటుగా ఎక్కువ ధర నిర్ణయిస్తే సరిచేయడానికి సిద్దంగా ఉన్నామని, తాండూరులో ఇలాగే జరిగితే సరిదిద్దామని మంత్రి పొంగులేటి చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *