– ఎంచుకున్న మార్గంపై విశ్వాసం ఉండాలి
– నేడు ప్రపంచానికే దిశానిర్దేశం చేస్తున్న దేశం
– ఫీజు రీయింబర్స్ మెంట్‌పై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
– యువత, మహిళలు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలి
– స్టూడెంట్స్ కాన్ క్లేవ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29: తన తండ్రి మరణం తర్వాత అనుకోకుండా తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఎలా ముందుకు సాగాలి అనే సందేహాలను ఎదుర్కొన్నప్పటికీ జీవితంలో షార్ట్‌కట్స్ ఉండవు.. జీవితం వేగాన్ని పరీక్షించే పోటీ కాదు.. అది సహనాన్ని పరీక్షించే ప్రయాణమని అర్థం చేసుకున్నాననని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాన్ క్లేవ్‌లో విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మీపై, మీరు ఎంచుకున్న మార్గంపై విశ్వాసం కలిగి ఉండటం అత్యంత ముఖ్యం.. ఈ మాటలు కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కావు.. జీవితంలో మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా ఇవి మీకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. భారతీయ జనతా పార్టీ సాధించగలిగిన వాటినే హామీ ఇస్తుందని. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సంపూర్ణ నిబద్ధతతో పని చేస్తామన్నారు. నాయకత్వం బలంగా ఉంటే మార్పు సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశపు ప్రాచీన నాగరికత గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. దీనికి ఉత్తమ ఉదాహరణ యోగా. మోదీ గారి నాయకత్వంలో యోగా ప్రపంచం నలుమూలలకు చేరుకుంది. దాంతో భారతీయ సంస్కృతి, విలువలు, నాగరికత శక్తి గురించి ప్రపంచం మరింత లోతుగా తెలుసుకుందన్నారు. ప్రస్తుతం భారతదేశం దిశానిర్దేశం చేయగల శక్తిగా ఎదిగిందన్నారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్‌పై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఫీ రీయింబర్స్‌మెంట్ ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు నేరుగా ప్రభావితమవుతున్నారు.దీనిని కేవలం రాజకీయ వ్యాఖ్యగా మాత్రమే చూడకుండా నేను ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను.. ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలంగా నిలదీస్తుంది. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మా గొంతును వినిపిస్తాం, ఆందోళనలు చేస్తాం, పోరాడుతామని స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి ప్రవేశంపై మాట్లాడుతూ ముందుగా స్పష్టమైన లక్ష్యంతో రాజకీయాల్లోకి రావాలి.నరేంద్ర మోదీ కూడా ఒక లక్ష మంది యువత రాజకీయాల్లోకి రావాలని, అలాగే మరింతమంది మహిళలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అయితే వారు ఒక స్పష్టమైన లక్ష్యంతో రావాలి.. షార్ట్‌కట్స్ కోసం కాదు, వ్యక్తిగత లాభం కోసం కాదు.. సమాజం, దేశ సేవ కోసం రావాలని వివరించారు. తెలంగాణలో స్టార్టప్‌లపై మాట్లాడుతూ మన దేశంలో స్టార్టప్‌ల అభివృద్ధికి సహజసిద్ధమైన ఎకోసిస్టమ్ ఉన్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్ వాటిలో ఒకటని గుర్తు చేశారు .గత 12 ఏళ్లలో భారత్ అద్భుతమైన స్టార్టప్ విప్లవాన్ని చూసిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, ‘ఖేలో ఇండియా’ వంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా క్రీడలకు దేశంలో అపూర్వమైన ప్రోత్సాహం లభించిందన్నారు. వికసిత్ భారత్‌పై మాట్లాడుతూ నరేంద్ర మోదీ 2047 నాటికి ‘వికసిత భారత’ నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు ఒక స్పష్టమైన దూరదృష్టితో పనిచేస్తున్నారన్నారు. ‘స్టార్టప్ ఇండియా’ వంటి విప్లవాత్మక కార్యక్రమాలు, మరెన్నో పథకాల ద్వారా, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణ ప్రయాణంలో యువతను భాగస్వామ్యం చేసేందుకు మోదీ అనేక అవకాశాలను సృష్టించారని తెలియజేశారు. మత్తు పదార్థాలకు బానిసలై జీవితాన్ని పాడుచేసుకోవద్దు, మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు హితవు చెప్పారు. బీజేపీ ఏకైక సిద్ధాంతం ‘దేశమే ప్రథమం’ అని తెలిపారు. ‘పార్టీ సిద్ధాంతం స్పష్టమైనది.. మా విధానాలు స్పష్టమైనవి.. మా ఉద్దేశం పారదర్శకమైనది.. కనుక బీజేపీకే ఓటు వేయాల’ని కోరారు. గతం అనేది ఒక పోరాటం.. అది మనల్ని ఇక్కడివరకు నడిపించింది. వర్తమానం అనేది ఒక పోరాటం.. దానిని మనం నిరంతరం కొనసాగించాలి. భవిష్యత్తు అనేది ఒక బాధ్యత.. దానిని మనం పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్లాలి. కాబట్టి జీవితంలో ఎప్పుడూ షార్ట్‌కట్స్ (అడ్డదారులు) కోసం వెతకకండి. లక్ష్యానికి కట్టుబడి ఉండండి.. నిరంతరం శ్రమిస్తూనే ఉండండి.. సహనం, స్పష్టమైన ఆశయంతో ముందడుగు వేయండని యువతకు పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





