– 27 లక్షల మంది విద్యార్థులకు ‘విజయ’ పాలు
– లాభసాటిగా తెలంగాణ పాడి పరిశ్రమ
– డిప్యూటీ సీం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : రాష్ట్రంలో పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీనం సాగిస్తున్న రైతులను ఆదుకోవడంతోపాటు విజయ డెయిరీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రజాప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలోని పాడిపరిశ్రమను ఆదుకునేందుకు, పాల ఉత్పత్తులపై ఆధారపడిన వారి జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రజాప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు విజయ డెయిరీ నుంచి పాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం సచివాలయంలో శనివారం జరిగింది. సమావేశంంలో పశుసంవర్ధక శాU మంత్రి వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో పాల వినియోగం, సేకరణ, రైతులకు చెల్లించాల్సిన బిల్లులపై లోతైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పాల వినియోగం, కొత్తగా ప్రభుత్వం ప్రకటించిన మేరకు వివిధ పాఠశాలల్లో చదువుకుంటున్న 27 లక్షల మంది విద్యార్థులకు పాలను అందించే అంశంపై అధికారులతో చర్చించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం పాల ఉత్పత్తికి సంబంధించి ఖచ్చితమైన లెక్కలు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పాలిచ్చే పశువుల అసలు సంఖ్యను గుర్తించాలని ఆదేశించారు. వాస్తవ పాల ఉత్పత్తిపై సమగ్ర నివేదికను తదుపరి సమావేశంలో ఇవ్వాలని సంబంధిత అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశించారు. రైతుల నుంచి సేకరించే పాల ధరపై స్పష్టమైన విధానం ఉండాలన్నారు. రైతులకు బకాయులు లేకుండా ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలన్నారు. పాఠశాలలకు సరఫరా చేసే పాలకు సంబంధించిన బిల్లులను సంక్షేమ శాఖలు నేరుగా ఆయా విభాగాలకే బదిలీ చేయాలని చెప్పారు. దీనివల్ల రైతులకు ఎలాంటి బకాయిలు ఉండవని చెప్పారు. పాడి రైతులకు సమయానికి డబ్బులు చెల్లిస్తే వారి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుంది.. డెయిరీకి నమ్మకంతో పాలు పోస్తారని అన్నారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు, పాల ఉత్పత్తులను గణనీయంగా పెంచేందుకు ఆధునిక పద్దతులను అనుసరించాలని సూచించారు. రైతులకు వ్యవసాయం పైనేకాక పాడి పరిశ్రమ ద్వారా అదనపు జీవనోపాధి కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని భట్టి ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




