విద్య, సంక్షేమం, ఉపాధితో బీసీల సాధికారత

– టెన్త్‌లో రాష్ట్ర సగటును అధిగమించిన బీసీ హాస్టల్ విద్యార్థులు
– విద్యా వికాసానికి ప్రతి హాస్టల్ కేంద్రంగా మారాలి
– బోనాల సమయంలో కుల వృత్తుల ప్రదర్శన
– సిద్దిపేటలో బీసీ స్టడీ సర్కిల్ భవనం త్వరలో ప్రారంభం
– బీసీ సంక్షేమ శాఖ పనితీరుపై మంత్రి పొన్నం సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : వెనుకబడిన తరగతుల విద్య, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలోని జిల్లా బీసీ అభివృద్ధి అధికారులు, సహాయ బీసీ అభివృద్ధి అధికారులు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్లు, శాఖాధికారులతో ప్రజా భవన్‌లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీ యువతను సాధికారత కలిగిన వర్గంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు 96.05 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతం 95.15 కంటే అధికమని పేర్కొన్నారు. పరీక్షలకు 4,941 మంది హాజరుకాగా 4,746 మంది ఉత్తీర్ణులయ్యారని, 285 హాస్టళ్లు 100 శాతం ఫలితాలు సాధించాయని వెల్లడించారు. 641మంది 500కు పైగా మార్కులు సాధించారని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో బీసీ హాస్టళ్లలో 51.63 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాలు మెరుగైన ఫలితాలు సాధించాయని తెలిపారు. రెండో సంవత్సరం 71.85 శాతం ఉత్తీర్ణత నమోదైందని, హనుమకొండ, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాలు ఉత్తమ ఫలితాలు సాధించాయని వెల్లడించారు. ఈ సంవత్సరం మంచి మార్కులు సాధించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తక్కువ మార్కులు వచ్చిన ప్రదేశాల అధికారులను ఆదేశించారు. అదనపు విద్యా సహాయం అవసరమైన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో హాస్టల్ విద్యార్థులకు యూనిఫాం క్లాత్, నోట్‌బుక్స్ వంటి సామగ్రితో కూడిన సమగ్ర వెల్కమ్ కిట్ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. హాస్టళ్లలో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని, రిజర్వేషన్ ప్రకారం అడ్మిషన్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ నెలాఖరులోపు అన్ని హాస్టళ్లలో పేరెంట్-టీచర్ సమావేశాలు నిర్వహించి విద్యార్థుల పురోగతి, హాస్టల్ సౌకర్యాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. హాస్టల్ ప్రాంగణాల పరిశుభ్రత, కలుపు తొలగింపు, నిల్వ నీటి నిర్మూలన, ఎలుకల బొరియల తొలగింపు, పెస్ట్ కంట్రోల్, ఫాగింగ్, వాటర్ ట్యాంకుల శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. డైట్ మెనూను కచ్చితంగా అమలు చేయడంతోపాటు నాణ్యమైన బియ్యం, పప్పులు, కూరగాయలు, గుడ్లు, పాలు సరఫరా చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థికి అకడమిక్ ప్రొఫైల్, ఆరోగ్య ప్రొఫైల్ రూపొందించి వారి విద్యా పురోగతి, ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. పరీక్షల ఒత్తిడి, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం పెంపు కోసం కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీడ్ పథకం ద్వారా డీఎన్‌టీ, ఎన్‌టీ, ఎసఎన్‌టీ వర్గాల అభివృద్ధికి అందుతున్న ప్రయోజనాలపై అర్హులైన లబ్ధిదారులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. 33 జిల్లా వెనుకబడిన తరగతుల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారితో జిల్లా బీసీ అభివృద్ధి అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసి బీసీ సంక్షేమ శాఖ పథకాలు సంక్షేమ కార్యక్రమాలపై చర్చించాలన్నారు. బీసీ, ఈబీసీ వర్గాలకు సంబంధించిన కళ్యాణలక్ష్మి పథకం దరఖాస్తులు పెండింగ్ ఉండొద్దని మంత్రి అధికారులను ఆదేశించారు. బీసీ స్టడీ సర్కిల్‌లో మరిన్ని సంస్కరణలు తేవాలని సూచించారు. 12 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నిరంతరం పోటీ పరీక్షలకు గైడ్‌లైన్స్ అడుగుతున్నామని, స్టడీ సర్కిల్ ఇయర్ బుక్ విడుదల చేశామని తెలిపారు. అనుభవం ఉన్న ఫాకల్టీ ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. త్వరలో సిద్దిపేటలో సొంత స్టడీ సర్కిల్ భవనం ప్రారంభం కానుందని తెలిపారు. సొంత భవనాల నిర్మాణం పూర్తి చేసి అందులో విషయ పరిజ్ఞానం ఉన్న చిత్రాలు, చార్టులు, మ్యాపులు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా యÖపీఎస్సీ, గ్రూప్స్, ఎస్సెస్సీ, బ్యాంకింగ్, ఆరఆర్‌బీ తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా జూలై 14 నుండి 24 మధ్య హెచఎండీయే గ్రౌండ్స్‌లో కుల వృత్తుల ప్రదర్శన, మట్టి కుండల స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు, శాఖ కమిషనర్ బాలమాయాదేవి, అధికారులు మల్లయ్యభట్టు, అలోక్ కుమార్, మామిడి హరికృష్ణ, జిల్లా బీసీ అభివృద్ధి, సహాయ బీసీ అభివృద్ధి అధికారులు, స్టడీ సర్కిల్ డైరెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *