– ఎల్‌నినోతో ఆలస్యం కానున్న రుతుపవనాలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,మే30: రాష్ట్రంలో ఎండలకు తోడు, వడగాలులు కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అడపాదడపా కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నా, మొత్తంగా ఎండలు మాత్రం శాంతించడం లేదు. రుతుపవానలు కూడా ఆలస్యం అవుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావంతో జూన్ 1 నుంచి అక్టోబర్ వరకు నైరుతి సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు లేవని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో భిన్నవాతావరణం కొనసాగుతున్నది. తెల్లవారుజామున, రాత్రివేళలో వర్షం కురుస్తుండగా.. మిగతా సమయంలో ఎండలు దంచికొడుతున్నాయి. 17 జిల్లాల్లో 45 డిగ్రీలకుపై గా గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మంచిర్యాల జిల్లా తాండూరులో అత్యధికంగా 46.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో 46.3 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 46.2 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలుగు రాష్టాల్ల్రో వర్షపాతం కొద్దిగా ఆశించినస్థాయిలో ఉన్నప్పటికీ దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇది దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. వాతావరణంలో నెలకొన్న ఈ అనిశ్చితి దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకొంటూ, పంటల ప్రణాళికలను రూపొందించు కోవాలని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. 2026 నైరుతి రుతుపవనాల కాలానికి సంబంధించిన తుది దీర్ఘకాలిక వాతావరణ అంచనాలను భారత వాతావరణ శాఖ విడుదల చేసింది. ఈ సీజన్‌లో తెలంగాణలో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు మధ్య తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. ఈ వర్షాలు భూగర్భ జలవనరుల పునరుద్ధరణకు ఎంతో ఉపయోగపడుతాయని వివరించింది. సంవత్సరం వానకాలం ఎల్‌నినో ప్రభావంతో 2018 మాదిరిగానే ఉంటుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 2025 సంవత్సరం మాదిరి వర్షాలను ఆశించవద్దని తెలంగాణ వెదర్‌మ్యాన్ సూచించారు. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షాలు ఉంటాయని, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణంకంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అంచనా వేశారు. అయినప్పటికీ.. 2014-15లా సాధారణ వర్షపాతం 905.4 మి.. కురువాల్సి ఉండగా కేవలం 562.1 మి.. కురిసినంత తీవ్రంగా ఉండకపోవచ్చని తెలిపారు. గత 5-6 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం రుతుపవన వర్షాలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఏడాది దక్షిణ, ఉత్తర జిల్లాల్లో వర్షాల లోటు తీవ్రంగా ఉంటుందని, మధ్య తెలంగాణలో మంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఈ ఏడాది రెండో వారంలో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ఆరంభం ఉంటుందని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





