– సన్న బియ్యంతో పేదలకు కడుపునిండా తిండి
– కేంద్రం దేశవ్యాప్తంగా ఈ ప థకం అమలు చేయాలి
– స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో కడియం
జనగామ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : మానవీయ కోణంలో అమలు చేస్తున్న గొప్ప పథకం సన్న బియ్యం పంపిణి పథకం అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. దేశంలోనే మొట్టమొదటగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కోటి 06లక్షల రేషన్ కార్డుల ద్వారా 3కోట్ల 10లక్షల మందికి ఉచిత సన్న బియ్యం పంపిణి జరుగుతందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రజా సంక్షేమ పథకాలను చూసి బిఆర్‌ఎస్ ఓర్వలేక పోతుందని మండిపడ్డారు. వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో, ధర్మసాగర్ మండల కేంద్రంలోని సుస్మిత గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వేలేరు, ధర్మసాగర్ మండలాలకు సంబందించిన కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా లబ్దిదారులకు అత్యంత భద్రతా ప్రమాణాలతో జారీ చేసిన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణి చేశారు. రెండు రోజుల క్రితం ఎక్కడో ఆదిలాబాద్ లో సంజీవ రెడ్డి అనే వ్యక్తికి ఇతర కాంగ్రెస్ నాయకులకు గొడవ జరిగితే అది కడియం శ్రీహరిపైనే జరిగింది అని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇంత దుర్మార్గంగా అబద్దపు వార్తలు చేయడం బిఆర్‌ఎస్ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొని నెల జీతాలు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, నాయకులపై సంబంధంలేని, స్జబెక్ట్ లేని వార్తలతో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నా 35ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఎవరి దగ్గర రూపాయి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసమే నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని బీజేపీ వాళ్ళు అంటున్నారని, కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సన్న బియ్యం పంపిణి చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల ఖర్చుతో చేపట్టే కార్యక్రమానికి మోడీ ఫొటో ఎలా పెడతారని ప్రశ్నించారు. పేద ప్రజల కడుపు నింపాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంటే దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణి చేయాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన నిలబడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు. కొత్తగా ఏర్పడిన వేలేరు మండలంలో మూడు ప్రధాన సమస్యలు ఉన్నాయన్నారు. అందులో మొదటిది మల్లన్న గండి రిజర్వాయర్ నుండి సాగు నీరు అందించాలని చెప్పారు. మల్లన్న గండి లిప్ట్-1 పనులు వేగంగా జరుగుతున్నాయని, అతి త్వరలోనే వేలేరుకు గోదావరి జలాలు తీసుకువస్తానని తెలిపారు. కొత్త మండలంలో మండల కార్యాలయాలు నిర్మాణం చేయాల్సి ఉందని ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయం నిర్మాణానికి 2కోట్ల 25లక్షలు మంజూరయ్యాయని, రెండుమూడు రోజుల్లో ఎంపీడివో కార్యాలయానికి మరో 2కోట్లు మంజూరు కానున్నాయని అన్నారు. నెల రోజులలోపు మండల కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని వెల్లడించారు. వేలేరు నుండి కొమ్ముగుట్ట వరకు రోడ్డు అభివృద్ధికి పంచాయతీ రాజ్ హ్యామ్ పథకం ద్వారా 14కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు పూర్తి చేయిస్తానని తెలిపారు. అలాగే వేలేరు మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రధాన రహదారిని పూర్తి చేయాల్సి ఉందన్నారు. వేలేరుకు సాగు నీరు తీసుకురాలేకపోయినా, మండల కార్యాలయాలు నిర్మాణం చేయకపోయినా, రోడ్డు పనులు పూర్తి చేయకపోయినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వోట్లు వేయమని అడగనని స్పష్టం చేశారు. వేలేరు, ధర్మసాగర్ మండలాల సర్పంచులు, తహసీల్దార్లు, ఎంపిడివోలు, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, రేషన్ డీలర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు