పోలీస్ అకాడమీలో ఘనంగా రాజా బహద్దూర్ 157వ జయంతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రాజా బహద్దూర్ వెంకట రామిరెడ్డి 157వ జయంతి వేడుకలను రాజాబహద్దూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో ఘనంగా నిర్వహించారు. అకాడమీ అధికారులు, ఆర్‌బీవీఆరఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అకాడమీ ప్రాంగణంలోని రాజాబహద్దూర్ విగ్రహానికి అకాడమీ అధికారులు, ఆర్‌బీవీఆరఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధులు, పోలీస్ అధికారులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. ముఖ్య అతిథిగా అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కె.ఆర్.కె.ప్రసాద్ మాట్లాడుతూ రాజాబహద్దూర్ వెంకట రామిరెడ్డి పేరు తెలంగాణ పోలీస్ అకాడమీతోపాటు మొత్తం పోలీస్ వ్యవస్థకు నిరంతర స్ఫూర్తినిస్తోందని అన్నారు. పేదలు, బలహీనవర్గాల ప్రజలకు వెంకట రామిరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని, పోలీస్ సేవలకు ఆయన ఒక నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. పోలీస్ సబఇన్‌స్పెక్టర్ శిక్షణార్థుల సంక్షేమం కోసం ఆయన ఏర్పాటు చేసిన నిధి ద్వారా శిక్షణార్థుల పట్ల ఆయనకున్న శ్రద్ధ, దూరదృష్టి స్పష్టమవుతున్నాయని అన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆయన పేరుతో తెలంగాణ పోలీస్ అకాడమీని మరింత అభివృద్ధి చేసుకోవడం గర్వకారణమన్నారు. భవిష్యత్ పోలీస్ అధికారులకు ఆయన జీవితం, సేవలు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
విద్యారంగంలో విశేష సేవలు
ఆర్‌బీవీఆరఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడు కొండ లక్ష్మీకాంతరెడ్డి మాట్లాడుతూ రాజా బహద్దూర్ వెంకట రామిరెడ్డి విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. విద్య ద్వారా సమాజ అభివృద్ధికి బాటలు వేసేందుకు ఆయన అనేక విద్యాసంస్థలను ఏర్పాటు చేసి, ఎంతోమందికి విద్యావకాశాలు కల్పించారని కొనియాడారు. సమాజ సేవ, విద్యాభివృద్ధి, ప్రజాసేవ రంగాల్లో ఆయన చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు.
ఆదర్శనీయమైన పోలీసింగ్ శైలి
రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తిరుపతి రెడ్డి రాజాబహద్దూర్ వెంకట రామిరెడ్డి బాల్యం, ఆయన ఎదిగిన తీరు, పోలీస్ శాఖలోకి వచ్చిన విధానం తదితర అంశాలను వివరించారు. ప్రజల భద్రత, సంక్షేమం, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఆయన అందించిన పోలీస్ సేవలు నేటి పోలీస్ అధికారులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రస్తుత పోలీస్ అధికారులు, శిక్షణార్థులు రాజాబహద్దూర్ సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ప్రత్యేక అతిథులకు జ్ఞాపికలు
కార్యక్రమం అనంతరం లక్ష్మీకాంతరెడ్డి, తిరుపతిరెడ్డిలకు అకాడమీ తరఫున జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్లు వేమా శ్రీనివాసరెడ్డి, యార్లగడ్డ రాంబాబు, వేముల శ్రీనివాసరావు, నరహరి, డీఎస్పీలు ఆదూరి శ్రీనివాసరావు, కృష్ణ, తోట శ్రీనివాసులు, తిరుపతి, జగదీశ్వర్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, అకాడమీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *