– గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ పిలుపు
– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్ట్
– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక, విచ్ఛిన్నకర రాజకీయాలను ఎండగడుతూ బీజేపీ రాష్ట్ర శాఖ బుధవారం చేపట్టిన గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమంతో నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు నాయకత్వంలో సీనియర్ నాయకులు, యువమోర్చా, కార్యకర్తలు భారీ ర్యాలీగా గాంధీ భవన్ వైపు బయలుదేరగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ నినాదాలతో రాష్ట్ర కార్యాలయ ప్రాంగణం దద్దరిల్లింది. ఈ సందర్భంగా రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు కీలక సమావేశాలు జరుగుతున్న సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాహుల్ గాంధీ సభను బహిష్కరించి వీధి నాటకాలకు తెరలేపారని విమర్శించారు. ‘నీట్’ లీకేజీ అంశంపై సభలో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ చర్చ నుంచి పారిపోయిన రాహుల్ గాంధీ ప్రధాని నివాసం ముట్టడికి దిగడం ఆయన అపరిపక్వతకు, చట్టసభల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తుంటే తట్టుకోలేక రాహుల్, కేజ్రీవాల్‌ల ప్రేరణతో విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. గతంలో షాహిన్ బాగ్ రైతు ఉద్యమాన్ని ఏ విధంగానైతే దేశవ్యతిరేక శక్తులు హైజాక్ చేశాయో నేడు ‘సిజేపి’ పేరుతో జరుగుతున్న ధర్నా కూడా అదే తరహాలో సాగుతోందని రామచందర్ రావు ఆరోపించారు. దిల్లీలో నిరసనకు దిగిన వారిలో అసలు ‘నీట’ విద్యార్థులే లేరని, కేవలం యాంటీ సోషల్, అల్ట్రా లెఫ్ట్ మూకలను జమ చేసి ఆందోళనలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నిరసనల్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణతోపాటు చైనా, పాకిస్తాన్‌లకు మద్దతుగా దేశ వ్యతిరేక నినాదాలు చేయడం దిగ్భ్రాంతికరమన్నారు. ఇతర దేశాల నుంచి వస్తున్న కోట్లాది విదేశీ సొమ్ము మాయలో పడి రాహుల్ గాంధీ విదేశీ ఏజెంట్‌లా మారి బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో యువతను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అయితే భారతీయ యువత దేశ భక్తి కలిగిన వారని, దేశం కోసం ప్రాణాలిస్తారు తప్ప ఇలాంటి కుట్రలకు లొంగరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సాగిస్తున్న ఈ విధ్వంసకర రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ¾ పోరాటం కొనసాగుతుంతుందని, పోలీసుల అరెస్టులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
రామచందర్‌రావును బేషరతుగా విడుదల చేయాలి : బండి సంజయ్
తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్టును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. రాష్ట్రంలో పాలక పక్షం తీరు దారుణంగా ఉందని, అధికారంలో ఉండి ధర్నాలు, నిరసనలతో శాంతిభద్రతలను ఉల్లంఘిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ తీరు చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే అరెస్టు చేస్తారా అంటూ పాలకపక్షాన్ని ప్రశ్నించారు. ‘నీట’పై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం సిద్ధం అంటూ దమ్ముంటే కాంగ్రెస్ నేతలు చర్చకు సిద్ధం కావాలి అని సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు అరెస్టును మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ధర్నాలు, రాస్తారోకోలతో పాలనను పక్కన పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ తీరుకు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ‘నీట్’ అంశంపై పార్లమెంటులో చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నదని దుయ్యబట్టారు.
—————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





