– వినతిపత్రం ఇచ్చేందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్లినపుడు..
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: గో రక్షకులపై దాడి చేసిన ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడిని, వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావును పోలీసులు అరెస్టు చేశారు. గో రక్షకుడు సోనూ సింగ్‌పై ఘట్‌కేసర్ వద్ద బుధవారం రాత్రి తుపాకీతో హత్యాయత్నం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడానికి రామచందర్‌రావు, ఆయనతోపాటు పార్టీ రాష్ట్ర, జిల్లా, యువ మోర్చా, గౌ సేవా సమితి నాయకులు వెళ్లారు. ఈ సందర్భంలో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. తమ నాయకుల అక్రమ అరెస్టును బీజేపీ తీవ్రంగా ఖండిరచింది. గాంధేయ పద్ధతిలో వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే తమ నాయకులు వెళ్లారని, అయితే ప్రభుత్వం ఆందోళన స్వరాలను అణగదొక్కడానికి పోలీసులను వినియోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించింది. గో రక్షకులపై దాడి చేసిన నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేయని పోలీసులు శాంతియుతంగా న్యాయం కోరిన బీజేపీ నాయకులను అరెస్టు చేయడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొంది. గో రక్షణపై తన కట్టుబాటును పునరుద్ఘాటిస్తూ సోనూ సింగ్‌పై హత్యాయత్నం చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని, బీజేపీ నాయకులపై నమోదైన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, గో రక్షకులకు భద్రత కల్పించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
గోరక్ష సభ్యుడు సోనూసింగ్‌పై బుధవారం జరిగిన కాల్పులను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు పిలుపునివ్వడంతో డీజీపీ ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోనూ సింగ్ పై కాల్పులను నిరసిస్తూ ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దశలవారీగా వస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. డీజీపీ ఆఫీసుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు రామచందర్‌రావు చేరుకుని గోరక్షకునిపై జరిగిన కాల్పుల అంశంపై డీజీపీకి మెమొరాండం ఇచ్చారు. అటు కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రవీంద్ర భారతి, అసెంబ్లీ ఏరియాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
రేవంత్ రెడ్డి సర్కారు కాదు.. రేవంతుద్దీన్ సర్కారు :రామచందర్‌రావు
గోవులను రక్షిస్తున్న ప్రశాంత్‌సింగ్‌పౖౖె అభాండాలు వేయడమేమిటని ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ప్రశ్నించారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన సోనూ సింగ్ కేసు సెటిల్‌మెంట్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. హాస్పిటల్‌లో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్న బాధితుడిపై తప్పుడు ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నడుస్తోందా అని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నడుస్తున్నది రేవంత్ రెడ్డి సర్కారు కాదు.. రేవంతుద్దీన్ సర్కారు అని ఎద్దేవా చేశారు. ఎంఐఎం గూండాలను కాపాడటానికే రేవంత్ సర్కారు ఉందా అని నిలదీశారు. సోనూ సింగ్‌పై కాల్పుల ఘటన నేపథ్యంలో డీజీపీకి మెమొరాండం అందించేందుకు బయల్దేరగా తనతోపాటు సుమారు వంద మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాష్ట్రంలో గోశాలల ఏర్పాటు, నిర్వహణ, గోవుల సంరక్షణ కోసం కొత్తగా పాలసీ తెస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు గోవులను కోసేవాళ్లకు గన్ లైసెన్సులు ఇస్తున్నారా అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గోవులను తరలించే గూండాలు, మాఫియా రెచ్చిపోతోంది.. గోరక్షకులపై దాడులు పెరిగాయి.. దానికి పరాకాష్ట ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన ఇబ్రహీం అనే వ్యక్తి సోనూ సింగ్‌ను కాల్చి చంపేందుకు యత్నించడమేనన్నారు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గోవధ నిషేధ చట్టం తీసుకురావాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





