షాబాద్ ఉన్మాది రాజ్‌కుమార్ ఆత్మహత్య!

– కొత్తూరు మండలం పంజర్లలో శవమై తేలిన నిందితుడు
– పోలీసులకు దొరకకుండా బలవన్మరణం

షాబాద్/హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ముగ్గురు ¾పిల్లలు సహా ఆరుగురిని కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్ కథ విషాదాంతమైంది. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఈ ఉన్మాది చివరకు తన మేనమామ ఊరైన కొత్తూరు మండలం పంజర్లలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ లభ్యమైనట్లు తెలుస్తోంది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో రగిలిపోయిన రాజ్‌కుమార్ ఈనెల 10న అర్ధరాత్రి మూడు వేర్వేరు ప్రాంతాల్లో అత్యంత దారుణంగా ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మొదట షాబాద్ టౌన్‌లో మైనర్ బాలిక తల్లి, నాయనమ్మలను నరికి చంపాడు. ఆపై ఆ బాలికను అఖిల్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లి గొంతుకోశాడు. అంతటితో ఆగకుండా తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు కొడుకులను సైతం కిరాతకంగా బలిగొన్నాడు. ఈ ఘోర ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

12 బృందాల గాలింపు.. రివార్డు ప్రకటన

ఈ దారుణ ఉదంతాన్ని సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో 12 ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడమే కాక రూ.2 లక్షల రివార్డును కూడా ప్రకటించారు.

ఆత్మహత్య డ్రామా.. చివరకు శవమై తేలి..

ఆరుగురిని చంపిన తర్వాత ‘నేను కూడా చనిపోతున్నా’ అని రాజ్‌కుమార్ తన తండ్రికి ఫోన్ చేసినట్లు సమాచారం. మొదట తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య డ్రామా ఆడి పోలీసులను తప్పుదోవ పట్టించి తప్పించుకున్నాడు. కానీ చివరకు పంజర్లలో శవమై తేలాడు. దీంతో కేసు కీల‌క మ‌లుపు తిరిగింది.

బాలికను నమ్ముకుని అప్పులపాలయ్యా..సెల్ఫీ వీడియోలో రాజకుమార్‌

‌రంగారెడ్డి : షాబాద్‌లో ఆరు హత్యలకు ముందు రోజు హంతకుడు రాజ్‌కుమార్‌ ‌సెల్ఫీ వీడియో తీసుకున్నాడని ఫ్యూచర్‌ ‌సిటీ సీపీ తరుణ్‌ ‌జోషి తెలిపారు. అతని మృతదేహం వద్ద లభించిన సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియోను గుర్తించినట్లు పేర్కొన్నారు. వీడియో రికార్డు వివరాల ఆధారంగా హత్యకాండకు ముందురోజు అంటే జులై 10న వీడియో రికార్డు చేసినట్లు గుర్తించామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను సీపీ తరుణ్‌ ‌జోషీ మీడియాకు వెల్లడించారు. తాను అప్పులపాలయ్యానని, జీవితం మీద విరక్తి చెందినట్లు నిందితుడు ఈ వీడియోలో ఉందని అన్నారు. తన సంపాదనలో సగం వాళ్లకే పెట్టానని, తన దగ్గర డబ్బు వసూలు చేసి నష్టపరిచారని తెలిపాడన్నారు. తన పిల్లలకు భూమి లేకుండా చేసుకున్నానని. ఆ అమ్మాయిని నమ్మి అప్పుల పాలయ్యానని, చివరకు కేసు పెట్టి జైలుకు పంపాలని చూస్తున్నారని రాజ్‌కుమార్‌ ‌వీడియో రికార్డ్ ‌చేశాడని సీపీ వెల్లడించారు. 11 నుంచి 12 గంటల మధ్యలో ఆరు హత్యలు జరిగాయని సీపీ తరుణ్‌ ‌జోషి చెప్పారు. రాజ్‌కుమార్‌ ‌రూ.2 వేలకు కారు అద్దెకు తీసుకున్నాడని, ఘటన జరిగిన రోజు పదిన్నర గంటలకు ఊర్లోకి వచ్చాడని, అమ్మాయిని తీసుకుని దేవరకొండకు వెళ్లాడని చెప్పారు. ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌లు అలవాటు ఉండటంతో నిందితుడు 16 సిమ్‌ ‌కార్డులు వాడాడని చెప్పారు. నిందితుడికి రూ.2 కోట్లకుపైగా అప్పు ఉందని, దానివల్ల మానసిక పరిస్థితి స్థిమితంగా లేదని చెప్పారు. కాలేజీ నుంచి వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు ఆ బాలికను వేధించాడన్నారు. అతనిపై పోక్సో కేసు ఉందని, తాజాగా ముందస్తు బెయిల్‌ ‌వచ్చిందని వెల్లడించారు. షాబాద్‌లో బాలిక నానమ్మను చంపి అక్కడ నుంచి ఆమెను తీసుకుని దైవాలగూడ వెళ్లాడని సీపీ తరుణ్‌ ‌జోషీ తెలిపారు. అక్కడ బాలిక, తన భార్యను, పిల్లలను నిందితుడు చంపేశాడని వెల్లడించారు. 11:37 గంటలకు తన తండ్రికి ఫోన్‌ ‌చేసి ఆరుగురిని చంపేశానని, తాను ఆత్మహత్య చేసుకుంటానని రాజ్‌కుమార్‌ ‌చెప్పాడని తెలిపారు. ఒంటిగంటకు హంతకుడి తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారని చెప్పారు. ఈ ఘటన తర్వాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ తర్వాత నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని, జీపీఎస్‌ ఆధారంగా రాజ్‌కుమార్‌ని పట్టుకునేందుకు యత్నించామని వివ‌రించారు. క్లూస్‌ ‌టీం సభ్యులు మృతదేహం లభించిన ప్రాంతాన్ని పరిశీలించారన్నారు. ఎన్నిగంటలకు రాజ్‌కుమార్‌ ‌చనిపోయాడనేది క్లారిటీ లేదని తెలిపారు. పెంజర్లలో రాజ్‌కుమార్‌ ‌మేనమామ ఉన్నారని తెలిపారు. నిందితుడికి సంబంధించిన నాలుగు కుటుంబాలు ఈ గ్రామంలోనే ఉంటున్నాయని సీపీ తరుణ్‌ ‌జోషీ పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *