– సాంకేతిక నిపుణుల మార్గదర్శకత్వంలోనే ముందుకు
– ఎన్‌డీఎస్ఏ చెప్పింది విందామా.. విపక్షాల మాటలు విందామా?
– మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– మంత్రులు ఉత్తమ్, పొంగులేటితో కలిసి దేవాదుల పరిశీలన
– ఎన్‌డీఎస్ఏ చెప్పింది విందామా.. విపక్షాల మాటలు విందామా?
– మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– మంత్రులు ఉత్తమ్, పొంగులేటితో కలిసి దేవాదుల పరిశీలన
దేవాదుల, ప్రజాతంత్ర, జూలై 13 : గోదావరి నదీ జలాల్ని సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకునే కార్యక్రమంలో స్పష్టమైన ఒక యాక్షన్ ప్లాన్ ఉందని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సాంకేతిక నిపుణుల మార్గదర్శకత్వంలోనే ప్రభుత్వం ముందుకెళ్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టును సహచర మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యారేజీ వద్ద అధికారులతో సమీక్షించి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. మేడిగడ్డ తదితర బ్యారేజీల్లో నీళ్లు నింపడం ప్రస్తుతానికి అత్యంత ప్రమాదకరమని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎసఏ), సీడబ్ల్యూసీ(సీడబ్ల్యూసీ) అధికారులు హెచ్చరించారని, వారి నివేదికల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని తేల్చిచెప్పారు. సాంకేతికంగా ఎన్‌డీఎసఏ చెప్పిన మాట విందామా? విపక్షాల గాలి మాటలు విందామా అని ప్రశ్నించారు. ప్రవహిస్తున్న నీటి నుంచే లిఫ్ట్ చేసుకునే వీలుంటే బ్యారేజీలు ఎందుకు కట్టారు అని నాటి బీఆర్‌ఎస్ పాలకులను నిలదీశారు. వారి హయాంలో నాసిరకం నిర్మాణం వల్లే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయన్నారు. ఎన్‌డీఎస్ఏ, సీడబ్ల్యూసీ నిపుణులు స్వయంగా వచ్చి పరిశీలించి వీటిలో నీళ్లు నింపితే బ్యారేజీలు పూర్తిగా కొట్టుకుపోతాయని, గేట్లు ఎత్తి ఉంచాలని హెచ్చరించారని తెలిపారు. సాంకేతికంగా నిపుణులు వద్దు అంటుంటే బీఆర్ఎస్ నాయకులు మాత్రం కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయండి అంటూ గాలి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మీరు ఈ రాష్ట్రానికి చాలా పాపాలు చేశారు.. ఇకనైనా తప్పుడు ప్రచారాలు బంద్ చేయండి అని భట్టి హితవు పలికారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు సంపూర్ణంగా నీరందిస్తామన్నారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితిలో మొత్తం 22 రిజర్వాయర్లను నింపుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉన్న 10 పంపులను నిరంతరాయంగా నడుపుతూ దేవాదుల కింద ఉన్న 12 జిల్లాలకు నీరందిస్తామని, గోదావరి పరివాహక ప్రాంతంలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందిస్తామని, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం, గోదావరి ఇన్‌ఫ్లో వివరాలపై ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సొంత నిర్ణయాలతో కూలిన కాళేశ్వరం
ఇంజనీర్ల మాటను కాదని సొంత నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్‌ఎస్ పాలకులు దెబ్బతీశారని, వారి అవినీతి, అనాలోచిత నిర్ణయాల వల్లే మూడేళ్లకే కాళేశ్వరం బ్యారేజీలు కుంగిపోయాయని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్ఆర్‌ఎస్పీ ప్రాజెక్టులు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. అదే గోదావరి.. అదే ఇసుక పునాది.. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు గట్టిగా ఉంటే బీఆర్‌ఎస్ కట్టినవి ఎందుకు కూలిపోయాయి అని ప్రశ్నించారు. కాళేశ్వరం, సీతారామసాగర్ రీ డిజైన్ పేరిట గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సొమ్మును లూటీ చేసి వృథా చేసిందని, తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్లో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై డిప్యూటీ సీఎం భట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మొత్తం నేనే రక్తాన్ని చెమటగా మార్చి మెదడును రంగరించి, ఇంజనీర్లందరినీ పక్కన పెట్టేసి నేనే కాళేశ్వరం కట్టానని ఆనాడు కేసీఆర్, బీఆర్‌ఎస్ నాయకులు అనేకమార్లు చెప్పారు.. అలా నాయకులు తమ సొంత తెలివితేటలతో కట్టడం వల్లే ఆ ప్రాజెక్టు ఇవాళ కూలిపోయింది.. ఆ రోజే ఇంజనీర్లు చెప్పినట్టు కట్టి ఉంటే అది కూలిపోయేది కాదు కదాలి అని వ్యాఖ్యానించారు. తమ తప్పుతో ప్రాజెక్టును దేనికీ పనికిరాకుండా చేసిన నాయకులు ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీటిని లిఫ్ట్ చేయాలంటే గేట్లు మూయాల్సిందే
బ్యారేజీల నుంచి నీటిని పంప్ చేయాలంటే, కన్నెపల్లి పంపులకు లెవెల్ రావాలంటే మేడిగడ్డలో కనీసం 5 టీఎంసీల నీటిని నిల్వ చేయాలి. అన్నారంలో కనీసం 10 టీఎంసీలు, సుందిళ్లలో కనీసం 8 టీఎంసీల నీటిని నిల్వ చేయాల్సి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. ఈ రకంగా నీటిని నిల్వ ఉంచాలంటే బ్యారేజీ గేట్లు మూయాలి.. కానీ గేట్లు మూస్తే బ్యారేజీల పునాదులు దెబ్బతిని, అవి అడ్రస్ లేకుండా పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు. అందుకే నిపుణుల మార్గదర్శకత్వంలో సంపూర్ణంగా మరమ్మతులు పూర్తయ్యే వరకు గేట్లు ఎత్తి ఉంచుతామని, వరద నీరు కిందకు వెళ్లేలా చూస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రాజెక్టులు పదిలం 

గత కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో నిర్మించిన ప్రాజెక్టుల భద్రతను భట్టి విక్రమార్క కొనియాడారు. కాళేశ్వరం బ్యారేజీల కంటే ఎగువన ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును గత కాంగ్రెస్ హయాంలో కట్టారు.. అదే గోదావరి నది, కింద అదే ఇసుక పునాది.. 20 టీఎంసీల సామర్థ్యం ఉన్నా అది ఇప్పటికీ నిటారుగా, గట్టిగా నిలబడింది.. ఆరు దశాబ్దాల క్రితం కట్టిన ఎస్ఆర్‌ఎస్పీ కూడా గోదావరి ఉధృతికి చెక్కుచెదరలేదు అని చెప్పారు. మరి బీఆర్‌ఎస్ కట్టిన బ్యారేజీలు మూడేళ్లకే ఎందుకు కుంగాయి.. ఎందుకంటే వారు ఇంజనీర్లను పక్కనబెట్టి, రక్తాన్ని చెమటగా మార్చామంటూ సొంత తెలివితేటలతో కట్టారు కాబట్టే అని ఎద్దేవా చేశారు.
దేవాదుల పనులకు రూ.146 కోట్లు విడుదల 

ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని 22 రిజర్వాయర్లను నింపుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని పెండింగ్ పనులను వేగవంతం చేసేందుకు రూ.146 కోట్ల నిధులను ఆర్థిక శాఖ ద్వారా విడుదల చేశామన్నారు. అందులో భూసేకరణకు రూ.58 కోట్లు, పెండింగ్ పనులకు రూ.74 కోట్లు, నిర్వహణకు రూ.14 కోట్లు తక్షణం విడుదల చేశామన్నారు.
సస్యశ్యామలమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్
దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న పది పంపులను నిరంతరాయంగా నడుపుకుంటూ దాదాపు 12 జిల్లాలకు, గోదావరి పరివాహక ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందిస్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో దేవాదుల ప్రాజెక్టును ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేయడానికి ఎన్ని వేల కోట్లయినా కేటాయిస్తామన్నారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు నీరందిస్తామని చెప్పారు. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి గోదావరి నదీ జలాలను సంపూర్ణంగా వినియోగించుకుంటామని, ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉందని భట్టి స్పష్టం చేశారు.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




