-గతంలో డబ్బులు తీసుకుని మైన్స్ కేటాయించారు
-అప్పుడు బిఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోంది
-సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 13 : సింగరేణిలో ప్రస్తుత దుస్థితికి కారణం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గతంలో డబ్బులు తీసుకుని మైన్స్ కేటాయించారని ఆరోపించారు. సింగరేణిని అప్పుడు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని ఆరోపించారు. సింగరేణిలో కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. సింగరేణికి నైనీ కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కొత్తగూడెం క్లబ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సింగరేణి భరోసా యాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు వేలం ద్వారానే బొగ్గు గనులు కేటాయిస్తూ వచ్చామన్నారు. సింగరేణికి అండగా ఉండాలనే ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సింగరేణిలో బొగ్గు మాయమైందని కేటీఆర్, హరీష్ లేఖలు రాసినట్లు చెప్పారు. ’సింగరేణి అంశంలో కేంద్రం తలదూర్చదని మీకు తెలియదా? మెస్సీతో ఫుట్‌బాల్ ఆడేందుకు సింగరేణి డబ్బు ఖర్చు చేస్తారా? సింగరేణిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేశారు’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్లపాటు సింగరేణిని కేసీఆర్ వోటు బ్యాంకుగా చూశారని వ్యాఖ్యానించారు. సింగరేణికి చేసిన మేలు ఏమిటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌పై మాత్రం కేసీఆర్ మాట్లాడలేదన్నారు. సింగరేణిలో ఏం జరిగినా కేంద్రాన్ని సంప్రదించడం లేదన్నారు. సింగరేణిపై కేంద్రం పెత్తనం ఉండదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వాల విధానాలపై మండిపడ్డారు. అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో దేశంలో అతిపెద్ద బొగ్గు కుంభకోణం జరిగిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆ సమయంలో జరిగిన బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని, అనంతరం బొగ్గు బ్లాకుల కేటాయింపులు పారదర్శకంగా జరగాలని అత్యున్నత ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం వేలం పక్రియ లేకుండానే సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను కేటాయించిందని తెలిపారు. ఈ బ్లాక్‌లో గ్రేడ్-8 నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, మరో 40 నుంచి 50 సంవత్సరాల వరకు సింగరేణి అవసరాలను తీర్చగల సామర్థ్యం ఉందని చెప్పారు. సింగరేణి సమస్యలను తాను పలుమార్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని, సంస్థకు మరిన్ని బొగ్గు బ్లాకులు అవసరమని వివరించానని కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం సింగరేణి ఎదుర్కొంటున్న పరిస్థితులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారపూరిత నిర్ణయాలు, సింగరేణిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడమే సంస్థ పరిస్థితి దిగజారడానికి దారితీసిందని విమర్శించారు. సింగరేణి నుంచి తీసుకున్న బొగ్గు, విద్యుత్ బకాయిలను చెల్లించకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం సుమారు రూ.24 వేల కోట్ల అప్పు మిగిల్చిందని ఆరోపించారు. రాష్ట్రానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి అభివృద్ధి కోసం కేంద్రాన్ని సమర్థవంతంగా సంప్రదించలేదని, ఈ పార్టీలు సింగరేణిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాయని కిషన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు