చెమ్మ : వారాల ఆనంద్
అకాడెమిక్, అకడమీషియన్ అనేమాటల నడుమ వున్న తేడా తెలియకుండానే రచయితలతో సహా చాలామంది పెద్దలు వాటిని ఒకే అర్థంలో వాడేస్తూ వుంటారు. నిజానికి అకాడెమిక్ అంటే విశ్వవిద్యాలయ బోధన, పరిశోధన, విద్యారంగంతో సంబంధం ఉన్నవ్యక్తి. కాగా అకడమీషియన్ అంటే అధికారిక విద్యా/ శాస్త్ర అకాడమీకి సభ్యుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి అనర్థం. ఈ రెండూ భిన్నమయిన ప్రతిభతో చేసే వృత్తులు, సేవలు. అలాంటి ఆ రెంటినీ అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించినవారు పాకాల యశోదారెడ్డి. తెలంగాణ భాషాసౌందర్యాన్ని సాహిత్యంలో ప్రతిష్ఠించిన ప్రముఖ రచయిత్రి, పరిశోధకురాలు. రచయిత్రిగా అనేకకథలు, వ్యాసాలు, విమర్శ పరిశోధన వంటి రంగాల్లో కృషి చేశారు. ముఖ్యంగా “ఎచ్చమ్మ కథలు” ద్వారా తెలంగాణ పల్లెజీవనాన్ని సహజమైన మాండలికంతో అక్షరీకరించారు. ఈ కథల్లో తెలంగాణ గ్రామీణ జీవితం, మానవ సంబంధాలు, పేదరికం, సాంప్రదాయాలు, స్థానిక భాషా మాధుర్యం స్పష్టంగా కనిపిస్తాయి. ఆమెరచనల్లో సహజమయిన తెలంగాణ గ్రామీణ జీవనశైలిని చిత్రించారు. తెలంగాణ మాండలికభాషను ఏదో యాసగా కాకుండా అత్యంత గౌరవప్రదంగా వినిపించారు. గ్రామీణ మహిళల అనుభవాలను, పల్లెసంస్కృతిని హృద్యంగా ఆవిష్కరించారు. రచనతో పాటు పరిశోధనాత్మక దృక్పథంతో తెలుగు సాహిత్యానికి సేవ చేసారు.
ఆచార్య పాకాల యశోదారెడ్డి 1929 ఆగస్టు 8న అప్పటి మహబూబ్‌నగర్ జిల్లా ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి గ్రామంలో జన్మించారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆమె చిన్నప్పటి నుంచే గ్రామీణ జీవతాన్ని అత్యంత దగ్గరగా చూశారు. ఆ దృష్టే తర్వాత ఆమె కథలకు ఊపిరయింది. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం కొనసాగించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు, సంస్కృతంలో ఎం.ఏ.లు పూర్తి చేశారు. తరువాత “తెలుగులో హరివంశాలు” అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందారు. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి డి.లిట్ కూడా అందుకున్నారు. యశోదారెడ్డికి తెలుగు, సంస్కృతం మాత్రమే కాక హిందీ, ఉర్దూ, కన్నడ, జర్మన్ భాషలపై కూడా పట్టు ఉండేది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖలో ఆచార్యురాలిగా పనిచేసి పరిశోధనల్లో అనేకమందికి మార్గనిర్దేశనం చేసారు. 1989లో ఉద్యోగ విరమణ చేశారు.
యశోదారెడ్డి పరిశోధనా రంగంలో చేసిన కృషిని పరిశీలిస్తే ప్రాచీన తెలుగు సాహిత్యం, ద్విపద వాజ్మయం, ప్రబంధ సాహిత్యం, హరివంశ సంప్రదాయాలపై ఆమెచేసిన అధ్యయనం విశేషమైనది. ఆమె స్వయంగా రాయడంతో పాటు అనేక గ్రంథాలకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. వాటిల్లో ద్విపద వాజ్మయ, ప్రబంధ వాజ్మయం, భాగవత సుధ, భారతీయ చిత్రకళ, తెలుగు సామెతలు, ఆంధ్ర క్రియాస్వరూప మణిదీపిక, పారిజాతాపహరణం, ఉత్తర హరివంశాలకు సంపాదకత్వం వహించారు. ఆమెచేసిన విశిష్ట ఉపన్యాసాలు తెలుగు ప్రాచీనసాహిత్యంపై పండితుల్లో విశేష గౌరవాన్ని సంపాదించాయి. రచయిత్రిగా యశోదారెడ్డి వందకుపైగా కథలు రాశారు. అందులో 63కథలు పుస్తకరూపంలో వెలువడ్డాయి. ఆమె కథలు తెలంగాణ గ్రామీణ జీవనాన్ని ఆయాకాలాల సామాజిక చిత్రణ అనొచ్చు. ముఖ్య కథాసంపుటాల గురించి చెప్పుకుంటే ‘మా ఊరి ముచ్చట్లు’, ‘ఎచ్చమ్మ కథలు’, ‘ధర్మశాల’ విలువైనవి.
మా ఊరిముచ్చట్లు 1920-40 మధ్యకాలంలోని తెలంగాణ గ్రామజీవితాన్ని అద్భుతంగా చిత్రించిన సంపుటి. పల్లెమనుషుల మాటలు, ఆచారాలు, నమ్మకాలు ఇందులో సహజంగా కనిపిస్తాయి. ఎచ్చమ్మ కథల్లో తెలంగాణ మహిళాజీవితం, కుటుంబసంబంధాలు, గ్రామీణ సంస్కృతి బలంగా ప్రతిబింబిస్తాయి. “ఎచ్చమ్మ” పాత్ర తెలంగాణ పల్లె మహిళల సమష్టి ప్రతిరూపంలా నిలబడుతుంది. యశోదారెడ్డి తెలంగాణ భాషను సాహిత్యంలో గౌరవప్రదంగా నిలబెట్టిన తొలి రచయిత్రుల్లో ఒకరు. ఆమెకి ముందు తెలంగాణ యాసను చాలామంది “గ్రామ్య భాష”గా తక్కువగా చూసే పరిస్థితి ఉండేది. కానీ యశోదారెడ్డి దానిని సాహిత్యభాష స్థాయికి తీసుకువెళ్లారు. ఆమెకథల్లో ముఖ్యంగా సహజ తెలంగాణ నుడికారం, సామెతలు, జాతీయాలు పల్లె పలుకుబడులు, మహిళల మాటల ధోరణి, జీవనానుభవాల నిజాయితీ ప్రధానంగా కనిపిస్తాయి.
“ఒకభాషలో నానుడి ఎప్పుడూ అలవోకగా పుట్టదు, అది ప్రజల అనుభవసారం” అని ఆమె చెప్పేవారు. అది ఆమెకు భాషపై ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది. ఆకాశవాణిలో తెలంగాణ మాండలికంలో ప్రసంగం చేసిన తొలి రచయిత్రిగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు.“మహాలక్ష్మి ముచ్చట్లు” వంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణభాషను ప్రజల్లో విస్తరింపజేశారు. కథలతోపాటు మంచికవిత్వం కూడా రాసారు. ఉగాదికి ఉయ్యాల, భావిక- కవిత్వం నిండా స్త్రీ అనుభూతి, కాలచింతన, సంస్కృతి పట్ల మమకారం కనిపిస్తాయి. తెలంగాణ భాషా ఉద్యమానికి ఊతాన్ని సాహిత్య ఆధారాన్ని ఇచ్చిన రచయిత్రిగా పాకాల యశోదారెడ్డిని చెప్పుకోవచ్చు. అకాడెమిక్ గానే కాకుండానే ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం అధ్యక్షురాలుగా పని చేసారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, లలితకళా అకాడమీ సభ్యురాలుగా వున్నారు. సుప్రసిద్ధ చిత్రకారుడు పాకాల తిరుమలరెడ్డి సహచరి కావడంతో ఆమెకు సాహిత్యమే కాకుండా చిత్రకళ తదితర కళారూపాలతో పరిచయం వుంది.
యశోదారెడ్డి రచనలు తెలంగాణ సామాజికచరిత్రకు సాహిత్యరూపాలు. ఆమెకథల్ని చదివితే ఒకయుగం మాట్లాడుతున్నట్టుంటుంది. తెలంగాణ పల్లెసంస్కృతిని, భాషను, మానవసంబంధాలను అక్షరాల్లో నిలిపిన అరుదైన సాహిత్యకారిణిగా ఆమెకు చిరస్థాయి స్థానం ఉంది. తెలంగాణ మాండలికాన్ని “సాహిత్య భాష”గా గౌరవించాలనే భావజాలానికి ఆమెరచనలు బలమైన పునాది వేశాయి. స్త్రీ సమానత్వం, సామాజిక చైతన్యం ఆమె రచనల ప్రధాన స్వరంగా చెప్పుకోవచ్చు. ఆమె 7 అక్టోబర్ 2007 న పరమపదించారు.





