చెమ్మ : వారాల ఆనంద్
తెలుగుసాహిత్యంలో కొందరు కేవలం రచయితలుగానో రచయిత్రులుగానో మాత్రమే కాకుండా విలక్షణ ఆలోచనాస్రవంతికి ప్రతీకలుగా నిలుస్తారు. అలాంటి విలక్షణ వ్యక్తిత్వాలలో కాత్యాయని విద్మహే ఒకరు. అధ్యాపకురాలిగా, పరిశోధకురాలిగా, విమర్శకురాలిగా, మహిళా ఉద్యమకార్యకర్తగా ఆమె ఎంతో కృషిచేసారు. కాత్యాయని విద్మహే అనగానే స్త్రీవాద సాహిత్యవిమర్శ గుర్తుకువస్తుంది. కాని ఆమె కృషి కేవలం స్త్రీవాద రచనలకే పరిమితం కాదు. తెలుగు సాహిత్యచరిత్రను కొత్తకోణంలో పరిశీలించడం, మరుగునపడిన రచయిత్రులను వెలుగులోకి తేవడం, సాహిత్యాన్ని సమాజంతో అనుసంధానించి చూడడంలో తనుచేసిన కృషి ప్రత్యేకమయింది. కాత్యాయని విద్మహే జీవితాన్ని పరిశీలిస్తే సాహిత్యం, పరిశోధన, ఉద్యమం అనే మూడు ప్రవాహాలు ఒకేచోట కలిసినట్లు కనిపిస్తుంది.
ఆమె స్త్రీవాద దృక్పథంతో ఆధునిక సాహిత్యాన్ని అధ్యయనం చేయడమే కాకుండా ప్రాచీన సాహిత్యంలో మహిళలు ఎట్లున్నరు, ఆనాటి కుటుంబ నియమాలు ఏంటి? తెలుసుకోవాలనే ఆసక్తితో అధ్యయనం చేసారు. సంప్రదాయ సాహిత్యంలోకూడా మహిళలలు కష్టాల్ని ఎదుర్కొన్నారు. అప్పుడూ పేట్రియాటిక్ భావావేశాలున్నయి. వారికి తెలియకుండానే వాళ్ల బాధలకు పరిష్కారాలు, ఒంటరి ధిక్కారాలు వున్నాయి, స్త్రీ స్వేచ్ఛ, లైంగికత, పేట్రియార్క్ అశ్లీలత, సమానత్వం తదితర అన్నికోణాల్లో అధ్యయనం చేసి కాత్యాయని విద్మహే రాసిన పుస్తకాలు మహిళ ఉద్యమాలకు నాయకత్వం వహించేవాళ్లకు మంచి రీసోర్సుగా ఉపకరించాయి. వామపక్ష మహిళాసంఘాలకు ఆ రచనలు సిలబస్‌గా పనికొచ్చాయి. మహిళా జీవన సమస్యలు– మూలాల అన్వేషణ పుస్తకం అనేకమందికి ప్రేరణగా నిలిచిందనే చెప్పాలి.
కాత్యాయిని మొదటగా ‘వేయిపడగలు’ నవల, పాఠశాల స్థాయినుంచే యుద్దనపూడి సులోచనరాణి, రంగనాయకమ్మ రచనలు చదవడం మొదలుపెట్టారు. డిగ్రీలో బి.ఏ. లిటరేచర్ చదివారు. తనపై రంగనాయకమ్మ స్వీట్ హోమ్ విశేషంగా ప్రభావం చూపింది. నవలలు అంటే ఇష్టంవల్ల ‘చివరకు మిగిలేది’ నవలపై పరిశోధన చేశారు. తర్వాత అల్పజీవి, అసమర్థుని జీవయాత్ర, చివరకు మిగిలేది, ఏకవీర నవలలు చదివారు. అపుడే తనకి చాలా విషయాలు అర్థమయ్యాయి. బుచ్చిబాబు రచనల్లో జాతీయోద్యమం, ఇడిపస్ కాంప్లెక్స్, మానవీయకోణంలో విలువలు, శీలం, లైంగికత తదితర అద్భుత పరిశీలనలు గమనించారు. ఆంగ్లసాహిత్యంతోపాటు ఫ్రాయిడ్, యాడ్లర్ ప్రభావాన్ని చూసారు. బుచ్చిబాబు మీద మోనోగ్రాఫ్ రాశారు. మార్క్సిజం మీద ఇష్టంతో 1978లో రావిశాస్త్రి రచనలు చదివి వ్యాసాలు రాసారు. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆమె ఆలోచనల వికాసానికి ముఖ్యమైన వేదికగా నిలిచింది. అక్కడ తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తూ అనేకమంది విద్యార్థులకు సాహిత్య అధ్యయనంలో కొత్త దృక్పథాన్ని అందించారు. విశ్వవిద్యాలయం కేవలం బోధనాకేంద్రం మాత్రమే కాకుండా సామాజిక చైతన్యానికి వేదిక కావాలని ఆమె నమ్మారు
‘వరంగల్ నగరం లేకపోతే నేను, నా సాహిత్యం లేదు’ అంటారామె. ఆర్ట్స్ కాలేజీ సాహిత్యం పట్ల కొత్త దృక్పథాన్ని చూపించింది. ఆర్ట్స్ కాలేజీలో అధ్యాపకురాలిగా ఉద్యోగంలో చేరడం గొప్ప అవకాశం అంటారామె. ఆ కాలంలో కాలేజీ తరగతిగదుల్లో రాడికల్ విద్యార్థుల ప్రశ్నలు ఆమెను బాగా ఆలోచింప చేశాయి. తెలంగాణ ప్రాంతంలో మహిళా ఉద్యమాలు బలపడుతున్న కాలంలో కాత్యాయని విద్మహే చురుకుగా పాల్గొన్నారు. మహిళలపై జరిగే వివక్ష, హింస, అసమానతలపై ఆమె నిరంతరం స్పందించారు. మహిళా ప్రశ్నలను కేవలం కుటుంబ సమస్యలుగా కాకుండా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలుగా చూడాలని ఆమె వాదించారు. ఆమె రచనలలో స్త్రీ జీవితం కేంద్రస్థానంలో ఉంటుంది. కుటుంబం, వివాహం, సంప్రదాయాలు, మతం, సంస్కృతి వంటి వ్యవస్థలు స్త్రీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఆమె విమర్శనాత్మకంగా విశ్లేషించారు. స్త్రీ స్వేచ్ఛ అంటే కేవలం వ్యక్తిగత స్వాతంత్ర్యం మాత్రమే కాదని, ఆలోచనలో, విద్యలో, ఆర్థిక రంగంలో, సామాజిక జీవితంలో సమాన అవకాశాలు పొందడమని ఆమె స్పష్టం చేశారు.
కాత్యాయని విద్మహే పరిశోధనలలో ముఖ్యమైన అంశం తెలుగు సాహిత్యచరిత్రలో మహిళల స్థానం. ఎన్నో దశాబ్దాలుగా సాహిత్యచరిత్ర పురుషరచయితల చుట్టూ తిరుగుతుండగా, రచయిత్రుల కృషిని వెలుగులోకి తీసుకురావడానికి కృషిచేశారు. సాహిత్యచరిత్రను మరింత సమగ్రమైనదిగా, సమానత్వ దృక్పథంతో తిరిగి రాయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. స్త్రీవాదం పాశ్చాత్య సిద్ధాంతాల అనుకరణ కాదు. భారతీయ సమాజ వాస్తవాలను, తెలుగు సంస్కృతి ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని రూపుదిద్దుకున్న విమర్శనాత్మక ఆలోచన. అందుకే ఆమె రచనల్లో స్త్రీ సమస్యలతో పాటు కులం, వర్గం, ప్రాంతీయ అసమానతల గురించిన చర్చ కూడా కనిపిస్తుంది. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) ఏర్పాటులో కాత్యాయని కీలకపాత్ర పోషించారు. స్త్రీవాద ఉద్యమం, దళిత మరియు మైనారిటీ మహిళల అనుభవాల మధ్య సంభాషణ అవసరాన్ని గుర్తించి, విభిన్న నేపథ్యాల మహిళా రచయితలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి జరిగిన కృషిలో భాగం అయ్యారు. 2010 విశాఖపట్నంలో సంస్థ ఏర్పడిననాటినుంచి అనేక కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. మహిళల సమస్యలను కులం, వర్గం, మతం, ప్రాంతం వంటి కోణాలతో అనుసంధానించి చూడాలన్న ప్రరవే లక్ష్యంతో ఆమె ఏకీభవించారు. తెలుగుసాహిత్యంలో మహిళా అధ్యయనాలకు, స్త్రీవాద విమర్శకు బలమైన పునాదులు వేసిన ప్రముఖ మేధావిగా కాత్యాయని విద్మహే పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సాహిత్యం సమాజానికి దూరంగా ఉండదు, అది మనకాలాన్ని ప్రశ్నిస్తూ, మార్పు వైపు నడిపించే చైతన్య శక్తిగా నిలుస్తుంది.





